Take a fresh look at your lifestyle.

తొమ్మిదేళ్లుగా నమోదు కాని యాచకులు సంఖ్య ..! ప్రశ్నార్థకంగా వారి మనుగడ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి , న్యూ దిల్లీ: భారత పార్లమెంటులో 2018లో ఆసక్తికరమైన ఒక ప్రశ్న ఓ పార్లమెంటు సభ్యుడు అడిగారు. ఆయన అడిగిన ప్రశ్న “భారతదేశంలో ఎంత మంది బిచ్చగాళ్ల ఉన్నారు..?” ఈ ప్రశ్నకు పార్లమెంటు వేదికగా లోక్ సభ లో లిఖితపూర్వక సామాజిక న్యాయ మంత్రి తవార్ చంద్ గెహ్లోట్ గణాంకాలను ఇచ్చారు. భారతదేశంలో మొత్తం 4,13,670 మంది బిచ్చగాళ్ళు నివసిస్తున్నారు, 2,21,673 మంది పురుష యాచకులు , 1,91,997 మంది మహిళా యాచకులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో మహిళా యాచకులు మగవారి కంటే అధికంగా ఉన్నారని, 81,224 మంది బిచ్చగాళ్లతో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది అని.. ఉత్తర ప్రదేశ్ లో 65,835 మంది , ఆంధ్రప్రదేశ్ 30,218 మంది , బీహార్ 29,723 మంది , మధ్యప్రదేశ్ 28,695 మంది , రాజస్థాన్ 25,853 మంది యాచకులతో ఉందని.. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో యాచన జీవనోపాధిగా కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని మంత్రి తెలిపారు.

2011 జనాభా లెక్కల డేటా ఆధారంగా మంత్రి ఈ వివరాలు పార్లమెంట్ కు తెలిపారు. భారతదేశంలో యాచించి పొట్ట నింపుకోవటం అనేది పాతకాలపు సమస్య. దేశంలోని పేదల కోసం సాధారణ ఉద్యోగాలు అంతరించి పోతున్నాయి. దీనితో జీవనోపాధి కోసం యాచించడం అనివార్యం అయిపోతున్నది. అనాధగా ఉండి సమాజంలో ఏ స్థాయి లేని వ్యక్తికి ఇళ్ళల్లో పాచి పని ఉద్యోగం ఇవ్వటానికి కూడా ఎవరు అనుమతించని పరిస్థితి మన సమాజంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పని చేసుకుని పొట్ట పోషించుకోవాలని ఆత్మాభిమానం ఉన్నా కూడా యాచకులుగా మారే పరిస్థితి కొంతమంది ముందు తలెత్తుతుంది. యాచకులకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన నివారణ చర్యలు తీసుకోవలసిన బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్రం అంటున్నది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 20 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్రాలలో యాచక వ్యతిరేక చట్టాన్ని రూపొందించాయి అని తెలుస్తోంది. ఈ చట్టం అమలుకు సంబంధించి ఎటువంటి సమాచారం దొరకటం లేదు. ప్రస్తుతం, యాచకులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి పథకం లేదు. యాచకులకు సంబంధించిన సమస్యలపై పని చేయడానికి ఈ రంగం మొత్తాన్ని కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీఓలకి కొంతమంది వ్యక్తిగత నిపుణులకి వదిలిపెట్టేసాయి.

- Advertisement -

2011లో విడుదల చేసిన యాచకుల గణాంకాలు ఇలా ఉంటే తొమ్మిదేళ్ల కాలంలో యాచకుల సంఖ్య ఇంకా పెరిగే ఉంటుంది. అయితే కొత్త గణాంకాలు ఇంకా మన ముందుకు రాలేదు. ప్రస్తుత ఆర్థిక అసమానతల కారణంగా ఆర్థిక మాంద్యాన్ని చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కొ రోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నది. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ గణాంకాల లోనే నమోదు కాని ఎంతోమంది యాచకుల పరిస్థితి ,వారి మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలింది ..!

Leave a Reply