Take a fresh look at your lifestyle.

‘‘‌విద్యాకాంతులే బాల్యోదయానికి ఆలంబనం’’

(నవంబర్‌ 14 ‌బాలల దినోత్సవం సందర్భంగా)

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నదానం అన్నిదానాలకంటే గొప్పదని అంటారు. అయితే అన్ని దానాల కంటే విద్యాదానం మహోత్కృష్ట మైనదని భారతీయ సంస్కృతి చాటి చెబుతున్నది.’’అన్నదానం పరం దానం విద్యాదానమతః పరం? అన్నేనక్షణికాతృప్తిర్యావజ్జీవం చ విద్యా?? ‘‘ అనే శ్లోకం  విద్య యొక్క విలువను విశదీకరిస్తున్నది. అన్నదానం ఉదరాన్ని నింపి, తాత్కాలిక క్షుద్భాధ ను హరిస్తే, విద్యాదానం సర్వ బాధలకు శాశ్వత  నివారిణి.  ఈ సత్యాన్ని గుర్తించి విద్య యొక్క విశిష్టతను,ఆవశ్యకత ను చాటిచెప్పి బాల్యాన్ని బడిలో గడపాలనే ధ్యేయంతో, బాల్యం జీవిత దశలన్నింటినీ సక్రమ పంథాలో నడిపించడానికి మూలకారణం కాబట్టి అలాంటి బాల్యం విద్యా గంధంతో పరమళించాలనే లక్ష్యంతో ప్రతీ ఏటా నవంబర్‌ 14 ‌వ తేదీన  జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశ ప్రగతిలో భావి భారత పౌరుల  కీలక పాత్రను గుర్తించి, బాలల వికాసం కోసం పరితపించిన భారత ప్రథమ ప్రధాని పండిట్‌ ‌నెహ్రూ గౌరవార్థం ఆయన జయంతి ని బాలల దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీ.

ఆకాశంలో నిండు పున్నమి చందురుని వెలుగుజిలుగులకు  రేయి చాటున నిదురిస్తున్న   సూరీడు ఆలంబన.రుతువుల ఆగమనానికి భూభ్రమణమే మూలం. క్షేత్రానికి బీజం, అవనికి పచ్చదనం
నెరలు తీసిన నేలకు నీరు, వర్షానికి మేఘం,సేద్యానికి హాలికులు ఎంత అవసరమో, అలాగే రేపటి సమాజ భవితవ్యానికి  విజ్ఞాన వికాసంతో విరబూసే పటిష్ఠమైన ‘‘బాలప్రపంచం’’ అవసరం. వర్తమాన సమాజంలో నెలకొంటున్న విషమ పరిస్థితుల నేపథ్యంలో  బాలల పాత్ర భవిష్యత్తుకు అత్యంత కీలకం. రేపటితరం ఎదుగుదల  నేటితరం తీసుకొచ్చే  మార్పుపైనే ఆధారపడి ఉంది.

అసూయ,అహంకారం,క్రోధం వంటి దుర్గుణాలతో  అలమటించే  వారెవరూ జనజీవితంలో మార్పు తీసుకు రాలేరు. స్వోత్కర్ష  శోభనివ్వదు.లేని గుణాలు గౌరవాన్ని సమకూర్చవు.  కార్యశూరులు కలహించరు. ధైర్యవంతులు ద్వేషించరు. సహనమూర్తులు క్రోధించరు. మేడి పండు లాంటి నేటి సమాజానికి నేతిబీరకాయ నీతులు పనిచేయవు.మనసా,వాచా కర్మణా  సద్బుద్ధి స్థిరం కావాలి.స్వార్ధ,లోభ,మదమాత్సర్యాది దారిద్య్రాలతో కూనారిల్లుతున్న సంఘం చెక్కిన చైతన్యం లేని సజీవ శిల్పాల్లో సత్ప్రవర్తన, మానవీయత, నిస్వార్ధం లాంటి  గుణాలను నింపి, చలనం తీసుకువచ్చే శిల్పకారులు తయారు కావాలి.పరివర్తన అనేది కాలక్రమంలో రావాలి. అనుకున్నంత అశ్వవేగంతో  ఆకస్మిక మార్పు సంభవించదు. మఖలో పుట్టి పుబ్బలో ఆవిరైపోయే వీరావేశం పనికిరాదు.  మార్పు తేవలసిన యువతలో ముందుగా  మార్పు రావాలి. నేటి యువతలో నిజమైన సామాజిక స్ఫృహ కరువైనది. ప్రచారార్భాటాలకోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. నిజమైన స్ఫూర్తి రావాలంటే చిరుప్రాయం నుండే సద్వర్తనం అలవడాలి. నిజమైన వ్యక్తిత్వానికి బాల్యమే పునాది. బాల్యం అష్టవంకరలతో, చిందర వందర గా తయారైతే భవితవ్యం గందరగోళంగా తయారౌతుంది. స్వార్ధం, వంచన, కృత్రిమత్వం వంటి కుత్సితమైన వాతావరణంలో  బాల్యం బందీ అయితే భవిష్య పరిణామాలు అతి భయంకరంగా ఉంటాయి. ఇప్పటికే మానవ సమాజం మానవ లక్షణాలను కోల్పోయింది. బాల్యదశలోనే  స్వార్ధాన్ని ఉగ్గుపాలతో రంగరించి,సకల అవలక్షణాలను గోరు ముద్దలుగా చేసి తినిపించి, భావిభారతం కోటి సూర్యప్రభలతో వర్ధిల్లాలంటే అది సాధ్యమా?  ఎదిగే చెట్టు గాలికి వంగక పోతే నేల కొరుగుతుంది. పెరిగే వయస్సు సంస్కార భరితంగా లేకపోతే సమాజమే సర్వనాశన మౌతుంది.  సకల దారులు సర్వ అవలక్షణధారులకే  అనుకూలంగా మారిన నేటి వ్యవస్థకు మూలాల నుండి శాశ్వత చికిత్స జరగాలి. బాల్యమే మిగిలిన దశలకు మూలం.కాబట్టి బాల్యాన్ని సక్రమపంథాలో నడిపించాలి. జన్మ ప్రదాతలు, జ్ఞాన ప్రదాతలు  సంఘటితమై భవిష్య భారత ప్రగతి రథానికి అతిరథ సారథ్యం వహించాలి. అదే నిజమైన బాలల దినోత్సవం. అదే పండిట్‌ ‌నెహ్రూ ఆశించిన నవ భారతానికి నిజమైన నిదర్శనం. సందర్భోచితంగా  నిర్వహించే ఉత్సవాలు ఉత్సవ విగ్రహాల వంటివి. అలాంటి వాటి వలన ప్రయోజనం శూన్యం. స్ఫూర్తి దాయకమైన ప్రసంగాలతో బాలల ప్రపంచంలో వెలుగు రేఖలు పూయించాలి. భావి భారత ప్రగతి స్వప్నాలను సాకారం చేయాలి.
– సుంకవల్లి సత్తిరాజు,
                  : 9704903463.

Leave a Reply