Take a fresh look at your lifestyle.

గజ దొంగలే కాదు, గజ హంతకులూ వొస్తున్నారు..

ప్రతి ఏటా జూన్ 5 న జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఈ సంవత్సరం ఎంచుకున్న అంశం “టైం ఫర్ నేచర్ “..ప్రకృతి పరిరక్షణకు నడుం బిగించాల్సిన సమయం…!భూమి మీద మనిషి జీవించడానికి కావలసిన ప్రకృతి వనరులను ..వన్య ప్రాణులను కాపాడుకోవలసిన సందర్భం..! దురదృష్ట వశాత్తు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ఉత్సవాలకు సిద్దమవుతున్న రెండు రోజుల ముందు కేరళ లో గర్భంతో ఉన్న ఒక ఏనుగు ను డైనమైట్ తో హతమార్చడం కలిచివేసే దుర్ఘటన ..!

ఏనుగు మరణించినా .. జీవించి ఉన్నా ఏనుగే, మనిషి శ్వాస పోయి పీనుగ అయితే ఎందుకూ కొరగాడు. ఆ ఇంగితాన్ని తెలుసున్నవాడెవడూ ఏనుగు జోలికి వెళ్ళడు. వన్యప్రాణులను కాపాడుకోవాలనీ, ఏటా వన్య ప్రాణుల సంరక్షణ దినాన్ని పాటిస్తుంటాం. కానీ, వన్య ప్రాణుల విషయంలో మనుషులు ఎంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారో కేరళలో జరిగిన ఉదంతం ఓ ఉదాహరణ. గజరాజు ఏనుగు కాలును మొసలి పట్టి పీడించినప్పుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే భార్యకు కూడా చెప్పకుండా వైకుంఠం నుంచి తరలి వొచ్చాడు. ఆధునిక కాలంలో ఏనుగులను వాటి మానాన వాటిని బతక నివ్వకుండా వాటికి పనస పండులో డైనమేట్ పెట్టి చంపిన వారిని కిరాతకులని అన్నా వారినీ తక్కువ చేసి చూడటమే అవుతుంది. అందులోనూ ఆ ఏనుగు గర్భంతో ఉన్న సమయంలో దానిని చంపాలనే ఆలోచన ఆ వ్యక్తికి ఎలా వొచ్చిందో, ఎవరు ఈ ఘోరకృత్యానికి ఒడిగట్టారో సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏనుగుని గజరాజ అంటాం. మన పురాణాల్లో ఏనుగుకు ఉన్న ప్రాధాన్యత మరి దేనికీ లేదు. మన పండుగలు వినాయక చవితితో ప్రారంభం అవుతాయి. ఏనుగు సాధారణంగా మన జోలికి రాదు. వాటి జోలికి వెళ్తే మాత్రం వొదిలి పెట్టవు. పులి, సింహాల వంటి క్రూర జంతువు కాదు. అలాంటి ఏనుగు జోలికి వెళ్ళాలనే ఆలోచన ఆ దుష్టులకు ఎలా వొచ్చిందో,ఎవరు ప్రోద్బలం చేశారో తెలుసుకోవల్సి ఉంది. మన దేశంలో ఏనుగు జాతి క్రమంగా నశించి పోతోంది. పూర్వకాలంలో రాజులు, మహారాజులు ఏనుగులపై అంబారీలు వేసి కవులూ, కళాకారులను ఊరేగించేవారు. అల్లసాని పెద్దన గురించి ఇప్పటికీ కవులు సందర్భోచితంగా ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే , బమ్మెర పోతనా మాత్యుడు భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టం ఎంతో భావగర్భితంగా వర్ణించారు. ఆధునిక కాలంలో కూడా ఏనుగులు దేవాలయాల్లో భక్తులకు ఆశీస్సులు అందించినట్టుగా నెత్తి మీద తొండంతో చరుస్తూ భక్తులు ఇచ్చే కానుకులు స్వీకరిస్తూ ఉంటాయి. కేరళ, కర్నాటక, తమిళనాడులలోని దేవాలయాల్లో దైవ దర్శనం తర్వాత ఏనుగుల ఆశీస్సులు తీసుకోవడం భక్తులకు అలవాటు.

వన్య ప్రాణి దినోత్సవాలను ఏటా అక్టోబర్ లో వన్య ప్రాణి వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ, హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఉత్సవాల సందర్భంగా పాఠశాల విద్యార్ధులకు చిత్రలేఖన., వ్యాసరచన పోటీలు నిర్వహిస్తుంటారు . చిత్ర లేఖనం లో ఆసక్తి ఉన్న బడి పిల్లలు విఘ్నేశ్వరుని చిత్రంతో పాటు ఏనుగు చిత్రాలను కూడా గీస్తూ ఉంటారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచేందుకు ఏనుగు భౌతికంగా ఒక అనుకూలమైన వన్య ప్రాణి, ఏనుగులు అసోం సహా ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఎక్కువగా ఉంటాయి. అవి సాధారణంగా జన జీవనం వైపు కదిలి రావు. అడవుల్లో వన్య ప్రాణులకు స్థానం లేకుండా ఆధునిక కాలంలో బహుళ జాతి కి చెందిన సంస్థలు బ్లాస్టింగ్ లు చేస్తున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచికరణ అమలులోకి వొచ్చిన తర్వాత అడవులను బహళ జాతి సంస్థలకు ప్రభుత్వాలు ధారాదత్తం చేస్తున్నాయి. దీంతో అడవుల్లో వన్య ప్రాణుల మనుగడకు భద్రత లేకుండా పోయింది. అటవీ శాఖ అన్ని రాష్ట్రాల్లో ఉన్నా అది నామమాత్రమే. దానిపై ప్రభుత్వాలకు అజమాయిషీ లేదు. ప్రతి స్థాయిలోనూ లంచం వ్యవస్థీకృతం కావడంతో అటవీ సంపద అంతా ఇతర ప్రాంతాల వారు దోచుకుని పోతున్నారు. అడవుల్లో తమకు అడ్డు వొచ్చిన జంతుజాలాలను చంపి అటవీ సంపద దోపిడీకి అలవాటు పడిన వారే ఇలాంటి అకృత్యాల కు పాల్పడుతున్నారు.గతంలో అడవి దొంగ వీరప్పన్ అడవుల్లో వన్య ప్రాణులకు హాని తలపెట్టేవాడని పుంఖానుపుంఖంగా కథలు వెలువడేవి. అంతకన్నా కర్కశులు ఇప్పుడు అటవీ శాఖను పట్టి పల్లారుస్తున్నారు. అటవీ శాఖకు న్యాయంగా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం రాకపోవడానికి ఈ అడవి దొంగలే కారణం. ఇప్పటికీ ఎర్రచందనం దొంగల గురించి అనేక వార్తలు వొస్తున్నాయి. ఎర్రచందనం దొంగలను అరికట్టడం ఏ ప్రభుత్వం వల్లా సాద్యం కావడం లేదు.

కలప కోసం అటవీ సంపదనూ, ఖనిజాలనూ కొల్లగొట్టుకుని పోతున్న వారికి ప్రభుత్వంలోని పెద్దల మద్దతు లభిస్తోంది.జార్ఖండ్, చత్తీస్ గఢ వంటి రాష్ట్రాల్లో అటవీ సంపదను కొల్లగొట్టుకుని పోయే కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా గుత్తి కోయలకు మద్దతుగా పౌర హక్కుల సంఘం నాయకుడు కె బాలగోపాల్ అవిశ్రాంత పోరాటం జరిపారు. ఇప్పుడు అలాంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నందుకే ప్రముఖ కవి వరవర రావు ప్రధాని హత్యకు కుట్ర పన్నారంటూ అక్రమ కేసు బనాయించి పూణే సమీపంలోని తాళోజీ జైలులో నిర్బంధంలో ఉంచారు. అటవీ సంపదను పరిరక్షించాలనే వారిపై నక్సలైట్లుగా ముద్ర వేసి కేసులు బనాయిస్తున్నారు. అడవి దొంగలపై అనేక సినిమాలు కూడా వొచ్చాయి. అటవీ జంతులన్నింటి కన్నా ఏనుగుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది .అందుకే దానికి గజరాజు అనే పేరు స్థిర పడింది. కేరళలోనే మరో ఏనుగును ఇదే మాదిరిగా చంపినట్టు వార్తలు వొచ్చాయి. ఈ గజ హంతుకులెవరో పట్టించి వారికి తగిన శిక్ష విధించాలి.జంతువులు జోలికి వెళ్లిన వారు బతికి బట్టకట్టలేదని గతంలో అనేక దృష్టాంతాలు మన ముందున్నాయి .ఎన్నడూ ఎరగనిది కొరోనా అనే మహమ్మారి వ్యాపించడానికి ఇలాంటి అకృత్యాలు పెరిగి పోవడమే కారణమని అనడం అత్యుక్తి కాదేమో..!

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!