Take a fresh look at your lifestyle.

ప్రచారం కాదు…. పనులు చేయండి

  • వర్షాకాలంలో అవసరమైన ప్రణాళికను వెంటనే ప్రకటించండి
    టీ పీసీసీ కోశాధికారి గూడూరు

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో రానున్న వర్షాకాలంలో అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్‌ ‌చేశారు. రుతుపవనాలు వచ్చే మూడు వారాల్లో తాకే అవకాశాలు ఉన్నాయని సూచనలు వస్తున్న నేపథ్యంలో నగరం మరింతగా దెబ్బతినకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకుసోమవారం ఆయన మీడియా ప్రతినిధులకు విడుదల చేసిన ప్రకటనలో నగరంలో మురుగు నీటి కాల్వలను ఇంకా శుభ్రం చేయలేదనీ, లక్షల టన్నుల చెత్తను తొలగించలేదనీ, దీంతో జీహెచ్‌ఎం‌సి చేతగానితనం బట్టబయలైందని విమర్శించారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో విజయం సాధించిన తరువాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఫిబ్రవరి 18, 2016న గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌కోసం 100 రోజుల కార్యాచరణను ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా 1550 రోజులు గడచిన తరువాత కూడా కనీసం 1 శాతం కూడా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. 100 రోజుల కార్యాచరణపై స్టేటస్‌ ‌రిపోర్ట్ ఇవ్వడానికి బదులు మంత్రి కేటీఆర్‌ 10 ఎఎమ్‌..10 ‌మినిట్స్ ‌పేరుతో మరో పబ్లిసిటి స్టంట్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ‌నుంచి కేటీఆర్‌ ‌తీసుకున్న 10 ఎఎమ్‌..10 ‌మినిట్స్ ‌కార్యక్రమం చవకైన పబ్లిసిటి స్టంట్‌గా పేర్కొన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హైదరాబాద్‌ ‌నగరం అధ్వాన్నంగా మారిందనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలనీ, కొరోనా వైరస్‌పై పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందనీ, కాలానుగుణంగా వచ్చే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవడం వంటి ఇతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదని ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి మంత్రి కేటీఆర్‌కు సూచించారు.

కేసీర్‌ ‌తెలంగాణకు పట్టిన మాయల ఫకీరు : మాజీ మంత్రి పొన్నాల
పొరుగు రాష్ట్రమైన ఏపీతో జల వివాదాలు తలెత్తినసమయంలో తనేదో చేస్తున్నట్లు సుదీర్ఘ క్యాబినెట్‌ ‌భేటీలు…సమీక్షలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్‌ ‌ప్రజల దృష్టిని మరల్చడానికి కుట్రలు చేస్తున్నాడని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రానికి పట్టిన మాయల ఫకీరుగా ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయనిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఇక్క కొత్త సాగునీటి ప్రాజెక్టునైనా ప్రారంభించలేదనీ, కాంగ్రెస్‌ ‌హయాంలో గోదావరిలో మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు ఎన్నో నిర్మించామని గుర్తు చేశారు. హైదరాబాద్‌ ‌నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టులు నిర్మించామనీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే కేసీఆర్‌ ‌దాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గత ఏడాది ఎస్సారెస్పీ ఎల్లంపల్లి వద్దకు 108 టీఎంసీల నీళ్లు వస్తే కేవలం 22 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుని మిగిలిన 86 టీఎంసీల నీటిని వృధా చేశారని ఇది టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. కనీసం నికర జలాలు వాడుకోలేని మీరు ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించడానికి సీఎం కేసీఆర్‌ అబద్దాలు చెబుతున్నారనీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులపై తమతో చర్చకు రావాలని సవాల్‌ ‌విసిరారు. ఇది నీళ్ల పేరుతో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మరో దోపిడీ కోణమనీ, కేసీఆర్‌ ‌ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో కొత్తగా ఏ పనీ చేయలేదనీ, తట్టెడు మట్టి తీయలేదనీ, ప్రజల డబ్బును నిరర్థకం చేసే విధంగా సీఎం కేసీఆర్‌ ‌ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా పొన్నాల ధ్వజమెత్తారు.

Leave a Reply