Take a fresh look at your lifestyle.

రామాలయమే కాదు, రామరాజ్యమూ కావాలి

ఇక కొద్ది గంటల్లో అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ చేసి చరిత్రలో ఒక ముఖ్య ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. ఐతిహాసికంగా అయోధ్య త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుని జన్మస్థలం. రామునితో ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ముఖ్యంగా తెలుగువారికి విడదీయరాని అనుబంధం ఉంది. వాగ్గేయకారులైన త్యాగరాజ రాజ స్వామి, భద్రాచల రామదాసు ఈ బంధాన్ని మరింత పటిష్ఠం చేశారు. తెలుగునాట రామాలయం లేని గ్రామం లేదు. గ్రామ స్వరాజ్యం నినాదంతో జాతిపిత మహాత్మాగాంధీ రామరాజ్యం కోసం పరితపించాడు. మన పురాణాల్లో కూడా రాముణ్ణి ఒక దేవునిగా కాకుండా స్వధర్మాన్ని పాటించే మనిషికి ప్రతిరూపంగా అభివర్ణించారు.’ రామో విగ్రహవాన్ ధర్మః ‘ అనే సంస్కృత శ్లోకం అంతరార్థం అదే. దేశమంతటా రామాలయాలు ఉన్నప్పుడు అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఇన్ని దశాబ్దాలు ఎందుకు పట్టింది. శ్రీరాముడు నడిచిన మార్గంలో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసి ఉంటే అయోధ్య వివాదం ఏనాడో పరిష్కారం అయి ఉండేది. కానీ, రామాలయం నిర్మాణం అనేది ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్రంగా చేసుకున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి అనుకూల ప్రతికూల వర్గాలు కొట్లాడుకోవడం వల్లనే సమస్య మరింత జటిలం అయింది. నిజానికి అయోధ్యలో రామాలయం నిర్మాణంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయనుకోవడం సమంజసం కాదు.

గాంధీజీ మార్గంలో నడవకుండా, ఆయనను ఒక వోటు బ్యాంకుగా ఉపయోగించుకున్నవారున్నట్టే, రాముని మార్గంలో పయనించకుండా రాముణ్ణి వోటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకు దేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ మూడున్నర దశాబ్దాల పాటు చేసిన ప్రయత్నం వల్ల ఇరువైపులా పట్టుదలలు పెరిగి సమస్య మరింత జటిలం అయింది. గోటితో పోయే రీతిలో ఈ సమస్యను సంప్రదింపులు ద్వారా పరిష్కరించుకుంటే ఏనాడో రామాలయ నిర్మాణం సాకారం అయ్యేది. మనది లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థగా రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత అందుకు కట్టుబడి ఉండాలన్న ఇంగితాన్ని పాటించకుండా తగువులకు దిగడం వల్ల రామాలయం సాకారానికి ఇంత కాలం పట్టింది. దేశంలో కోట్లాది ప్రజల కల సాకారానికి నేటి ఉదయం నాందీ ప్రస్తావన జరగనుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం రామలల్లా తాత్కాలిక ఆలయం (మేక్ షిఫ్ట్ టెంపుల్) తాళాలు తెరిపించడంతో బీజేపీ వారు ఆ తాళం చెవులను అస్త్రంగా తీసుకుని సొంత బలంగా పెంచుకున్నారు. ఇందులో ఎన్ డితివారీ వంటి కాంగ్రెస్ నాయకుల పాత్ర కూడా ఉంది. నిజానికి బీజేపీ అగ్రనాయకుడు ఎల్ కె అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు జరిపిన రథయాత్ర బీజేపీ రాజకీయంగా ఎదగడానికి తోడ్పడింది. లోక్ సభలో రెండు స్థానాలు మాత్రమే ఉన్న ఆ పార్టీ బలం ఒక్కసారిగా 200కి పెరిగింది. దీంతో ఆవలి వర్గం వారు తమ బలాన్ని నిరూపించుకునేందుకు దేశంలో లౌకిక వాదులకు దన్నుగా నిలిచారు. రాముణ్ణి బీజేపీవారూ, మైనారిటీలను లౌకికవాదులు వోటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం ప్రారంభించారు. దీంతో దేశంలో రాజకీయ పార్టీల అజెండా ఒక్కసారిగా మారిపోయింది. దేశంలో కోట్లాది ప్రజలకు కడుపునిండా తిండి, కట్టుకోవడానికి గుడ్డ, తలదాచుకోవడానికి నీడ కల్పిస్తామంటూ వాగ్దానం చేసిన కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల జీవనాభ్యుదయానికి ఏ మాత్రం ఉపయోగ పడని మతం కార్డులు ప్రయోగించి ప్రజల్లో చీలికలను సృష్టించాయి.

ఇది పూర్తిగా మన దేశానికి సంబంధించిన సమస్య అయినప్పటికీ, పొరుగున ఉన్న పాకిస్తాన్ సహా అన్ని దేశాల్లో భారత్ కు శత్రువులను తయారు చేసింది. ముఖ్యంగా, సరిహద్దుల్లో ఉన్న కాశ్మీర్ సమస్య మరింత జటిలం కావడానికి కారణమైంది. దశాబ్దాల పాటు దేశాన్ని తీవ్ర ఆందోళనలకు కారణమయిన ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం లభించినందుకు ఆనందించని పౌరులెవరూ ఉండరు. మన దేశంలో మెజారిటీ ప్రజల ఆకాంక్ష నెరవేరేందుకు ఇంతకాలం పట్టింది. అయితే, రామాలయం నిర్మాణం సర్వ సమస్యల పరిష్కారిణి కాదు. రామాలయం లేని గ్రామాలు లేవు. అంత మాత్రాన గ్రామాలన్నీ సర్వ శోభితంగా వర్ధిల్లడం లేదు. ఇందుకు కారణం పాలకుల ఆలోచనలో,ఆచరణలో యోజనాల దూరం తేడా ఉండటమే. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టిన జాతి పిత మహాత్మాగాంధీకి ఏటా జయంతి, వర్ధంతిల సందర్భంగా సభలు నిర్వహించి ఘనంగా నివాళులర్పిస్తున్నాం, కానీ, గాంధీ కలలు గన్న రామరాజ్యాన్ని సాధించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం, సమాన ప్రతిపత్తి అందించడమే రామరాజ్యం లక్ష్యం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు., సమాజంలో దశాబ్దాలుగా అణగారిన వర్గాలుగా కొనసాగుతున్న వారి జీవితాల్లో అణు మాత్రం మార్పును మన పాలకులు తీసుకుని రాలేకపోయారు. ముఖ్యంగా గాంధీజీ ప్రబోధించిన అంటరానితనం నిర్మూలన, సామాజిక న్యాయం అందని పండులాగే మిగిలిపోయాయి. మాజీ ప్రధాని వాజ్ పేయి గుజరాత్ అల్లర్లను నివారించలేకపోయినందుకు ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని రాజధర్మాన్ని పాటించడంలో విఫలమయ్యారంటూ బహిరంగంగానే ఎద్దేవా చేశారు. రాజధర్మం అంటే దేశంలో అన్ని వర్గాల ప్రజల పట్ల సమభావం కలిగి ఉండటం,అన్ని వర్గాలకూ సమన్యాయాన్ని కలిగించడం రాజధర్మమని వాజ్ పేయి చాలా సూటిగానే స్పష్టం చేశారు. ప్రతి సందర్భంలో జనం మెప్పు కోసం ఆయన పేరును ప్రస్తావించే మెప్పించేందుకు ప్రస్తుత పాలకులు ఆయన మార్గంలో నడుస్తున్నారా , లేదా అని. ఆత్మవిమర్శ చేసుకోవల్సిన సమయం , సందర్భం ఇది.

Leave a Reply