బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం : నిర్మలాసీతరామన్
న్యూఢిల్లీ,మార్చి16: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓవైపు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ప్రతి ప్రభుత్వ బ్యాంకును అమ్మేస్తామని అనడం సరికాదు. ఈ బ్యాంకుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న ఉద్యోగులను రక్షించుకుంటాం. వాళ్ల జీతాలు, పెన్షన్లకు రక్షణ కల్పిస్తాం అని నిర్మల అన్నారు.
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రెండు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహ రణలో భాగంగా ఈ బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తున్నట్లు బ్జడెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్లో మెజార్టీ వాటాను అమ్మేయగా.. మరో 14 బ్యాంకులను విలీనం చేసింది. అయితే అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఏదీ జరిగినా…ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామి నిచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్రం ప్రతిపాదనకు వ్యతిరేకంగా తొమ్మిది కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. రెండవ రోజు ఉధృతంగా సమ్మె చేపడుతున్న నేపథ్యంలో ఆమె కీలక ప్రకటన చేశారు. దేశ ఆకాంక్షలను బ్యాంకులు తీర్చాలని తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ’ కొన్ని బ్యాంకులను మాత్రమే ప్రైవేటీకరిస్తాం. ప్రతి బ్యాంకు సిబ్బంది ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. ఎంత ఖర్చైనా ఉద్యోగుల ప్రయోజనాలను రక్షిస్తాం’ అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో తాము కొనసాగుతామని ప్రభుత్వ రంగ సంస్థ విధానం చాలా స్పష్టంగా చెబుతుందని అన్నారు.