Take a fresh look at your lifestyle.

అహింస నేటి సమాజానికి శరణ్యం

సైద్ధాం తికంగా మహాత్మా గాంధీని విమర్శించే వారు చాలా మంది ఉండవచ్చు.దేశవిభజన సమయంలోను, స్వాతంత్య్ర పోరాట సమయంలోను మహాత్మాగాంధీ అను సరించిన శాంతియుత విధా నాలను నిరసించి, సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌లాంటి వీరులు విబేధించి ఉండవచ్చు. సర్ధార్‌ ‌పటేల్‌ ‌లాంటి ఉక్కుమనిషి ని పక్కన బెట్టి, నెహ్రూని ప్రధాని ని చేయడం పట్ల నాటి తరంలోనే కాదు,నేటి తరంలో కూడా చాలామందికి అసంతృప్తి ఉండవచ్చు. అయితే రాజకీయ, సైద్ధాంతిక వ్యక్తిగత వైరుధ్యాలు పక్కన పెడితే గాంధీ ఆశించిన అహింసా విధానం, ప్రస్తుత ప్రపంచానికి ఆదర్శప్రాయం అని చెప్పక తప్పదు. ప్రపంచమంతా హింసా దృక్పథం పెరిగిన నేపథ్యంలో, మానవులకంటే మృగాలే నయమనుకునే వర్తమానంలో గాంధీ ప్రపచించిన శాంతి మార్గం ప్రస్తుత ప్రపంచానికి అత్యవసరం. శాంతి, అహింస, సహనం వంటి బాపూజీ సూత్రీకరిచించిన విలువలు కాలగర్భంలో కలసిపోయాయి.’’ అహింసో పరమో ధర్మః’’ అన్న నాటి మాటలు నేటి వ్యవస్థలో నేతిబీరకాయలోని నేతిలా పైపై నీతి ప్రవచనాలు వల్లెవేయడానికే పనికొస్తున్నాయి. హింస,స్వార్ధం,అవినీతి, అరాచకాల వంటి గతుకుల దారిలో సగటు మనుషుల చాలీచాలని ఆర్ధిక స్థితిగతులతో అతుకుల బ్రతుకులై కడుదుర్భరం గా ఉన్నాయి. గాంధేయవాదం మంటగలిసింది. హింసాప్రవృత్తితో ,అవినీతితో ఆర్ధికంగా ఎదిగే వారే నేటి సమాజంలో అధికం. ఆర్ధికంగా చితికిన బ్రతుకుల గతుకుల్లో అస్తవ్యస్తంగా మారిన సగటు జీవుల జీవనయానం వర్ణింపశక్యంకాదు.

అవిద్య, నిరుద్యోగం,ఆర్ధిక అంతరాలు, అవినీతి,అరాచకాల మధ్య ఏ ఎండకాగొడుగు పడితే కాని బ్రతకలేని అవకాశవాదపు దాష్ఠీకాలు నేటి సమాజంలో అడుగడుగునా తారసపడుతున్నాయి.అరకొర ఆదాయంతో సగటుజీవికి తెల్లారితే భయం. అనారోగ్యం దాపురిస్తే మరీ దుర్భరం. మధ్యతరగతి జీవులకు ఎండావాన, రేయిపగలూ రెండూ సమానమే.చావలేక, బ్రతకలేక చస్తూ బ్రతకడమేనా సగటుజీవి నుదుటి రాత? ఇది విధిలిఖితమా? విధివైపరీత్యమా?మానవ కల్పిత వైఫల్యమా? ఇది అర్థం కాని మనోవేదన.పైకి డాంబికం-లోలోపల రోదన, భరింపశక్యంగాని వేదనలతో అనేకమంది నేటి సమాజంలో ‘‘పరువు’’ అనే తెరచాటున దాచేస్తున్న కన్నీళ్ళ పర్వానికి ముగింపు దొరకదు.కక్కలేక, మింగలేక మానసిక క్షోభ అనుభవించే నిజ జీవితపు కథలవెతలు ఊహాతీతం-వర్ణనాతీతం. కడుపు నిండితే కవిత్వం-కడుపు కాలితే వైరాగ్యం…ఇదీ సమకాలీన సమాజంలో కానవస్తున్న వైరుధ్యం. ఆర్ధిక అంతరాల మధ్య ఆర్ధికలేమితో కృంగిపోతున్న సగటు జీవి అంతరంగాన్ని పాలకులు గమనించాలి. కష్టాల సంద్రాన్ని ఈదలేక మనోనిబ్బరం కోల్పోతున్న మధ్యతరగతి మనుషుల ఆక్రందనలు వర్ణింప నలవికావు. ‘‘గ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలు’’ అనే మహాత్ముని ఆశయాలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. గ్రామ స్వారాజ్యం నేటికీ సిద్ధించలేదు. హింస,ప్రతీకారాలతో గ్రామీణ వాతావరణం కూడా కలుషిత మై పోతున్నది.మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై స్వేచ్ఛగా తిరగగలిగే రోజులు రావాలనే గాంధీ ఆశలు అడియా సలైనాయి.పట్టపగలే చిన్న పిల్లలను సైతం చెరబట్టి హత్యలు చేసే అమానవీయ నైజం పెరిగి పోయింది. ఒకవైపు సగటు జీవి ఆవేదనాస్వరం ఇలా ఉంటే మరోవైపు మానవత్వం కానరాని మనుషులతో పోరాటం మానసిక సంఘర్షణ కు దారితీస్తున్నది.స్వార్ధపు సంకెళ్ళలో చిక్కిశల్యమై మానవీయకోణమే అదృశ్యమైపోతున్నది. అవకాశవాదపు ధోరణులు మానవత్వాన్నే వెక్కిరిస్తున్నాయి. ‘‘బ్రతుకు-బ్రతికనివ్వు’’ అనే కనీస స్పృహ అంతర్ధానమౌతున్నది. మనిషిని మనిషే కబళించుకుతినే అనాగరికపు ఆటవిక సంస్కృతి శరవేగంగా దూసుకువస్తున్నది.

మానవత్వం మంటగలిసి దానవత్వం జడలువిప్పి నర్తించే నరజీవన యానంలో ‘‘మంచి-చెడు’’ అనే విచక్షణ నామ మాత్రమైనా కానరాదు. ‘‘బహిర్ముఖం-అంతర్ముఖం’’ ఈ రెంటినడుమా వ్యత్యాసం హస్తిమశకాంతం. లోపల రాక్షసత్వం-బయట గాంధీతత్వం.ఇదే నేటి మానవనైజం. పరస్పర విరుద్ధమైన భిన్న వైరుధ్యాల మధ్య నడయాడే మానవజీవన చక్రంలో నటనపాలు అధికమై,నిజస్వభావం ‘నటన’ అనే తెరచాటున కనుమరుగై మానవత్వాన్ని వెక్కిరిస్తుంటే ఏదీ మంచికి దారి?ఏదీ నిజానికి రహదారి? ఊహకందని అడ్డదారుల్లో విడ్డూరాల నడుమ వయ్యారాలు పోయే మానవ జీవనగమ్యంలో మనిషి పెరిగి,మనసు తరిగి మానవత్వం కృశించింది. మానవత్వం మాయమైన మనిషిలో సత్యం నాస్తి-అహం జాస్తి. ఇదే నేటిజీవన ముఖచిత్రం. మాయమైపోతున్న మనిషి గత కాలపు జీవన అవశేషాలే చరిత్ర పుస్తక పుటల్లో నిలిచిపోతున్న సువర్ణభరిత అధ్యాయాలు. గత కాలపు జీవన సౌందర్యాన్ని, గతకాలపు మనుషుల నిష్కల్మష హృదయసౌందర్యాలను గ్రంథస్తం చేసి, నేటి సమాజానికందిస్తే గుడ్డిలో మెల్లలా కొంతయినా సమాజానికి ఉపయోగపడుతుంది.గజానికొక గాడ్సే వెలిసిన సమాజంలో నిజాయితీగా బ్రతికే వారికి చోటుండాలి-సత్యం,అహింసలకు కనీస మార్గముండాలి.అదే మహాత్మునికి మనం అర్పించే నివాళి కి నిజమైన అర్ధం,పరమార్ధం.
– సుంకవల్లి సత్తిరాజు. మొ:9704903463

Leave a Reply