- కొత్తగా మరో 5,892 కొరోనా కేసులు నమోదు
- 46 మంది మృతి చెందినట్లు వెల్లడి
- బెల్లంపల్లిలో తాజాగా మరో ఇద్దరు మృతి
- గాంధీలో రోగులకు చికిత్సలు అందడం లేదని బంధవులు ఆందోళన
తెలంగాణలో కొరోనా కేసులు తగ్గడం లేదు. రోజువారి కేసులు ఆరువేలకు అటుఇటుగా ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 కొరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. అలాగే కొరోనాతో 46 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 4.81 లక్షల కొరోనా కేసులు నమోదవగా.. 2,625 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 73,851 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1104 కొరోనా కేసులు నమోదవగా.. రంగారెడ్డి 443, మేడ్చల్ 378, నల్గొండ జిల్లాలో 323 కేసులు, వరంగల్ అర్బన్ 321, కరీంనగర్ జిల్లాలో 263 కేసులు, నాగర్‌కర్నూలు 204, సిద్దిపేట 201, మహబూబ్‌నగర్ జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే గాంధీ హాస్పిటల్ వద్ద కొరోనా రోగుల బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక గాంధీలో కొరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ వార్డుల్లో రోగులను అటెండర్లు, ఆయాలు పట్టించుకోవడం లేదని తమకు పేషెంట్లు ఫోన్ చేసి బాధపడుతున్నారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా పేషంట్ల ఆరోగ్య పరిస్థితిపై కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌కి వెళ్తే పోలీసులు గెంటేస్తున్నారని బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో కొరోనా మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేరపుతోంది. గురువారం ఒక్కరోజే బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో 12 మంది మృతి చెందారు. మరో ఇద్దరి మరణంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బెల్లంపల్లి, రామకృష్ణపూర్ ఐసోలేషన్ కేంద్రాల్లో పోలీసులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే కొరోనాతో టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు. యూసుఫ్‌గూడ బస్తీకి చెందిన మేడికొండ మల్లికార్జున్(49) నాగర్జున్‌సాగర్ ఉప ఎన్నిక, మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మూడు రోజులు ఐసొలేషన్‌లో ఉన్న తర్వాత గాంధీ హాస్పిటల్లో చేరారు. రెండు రోజుల నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందారు.
మల్లికార్జున్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బద్దం మహేందర్‌గౌడ్ (38) కూడా కొరోనాతో మృతి చెందాడు. మహేందర్‌గౌడ్‌కు వారం రోజుల కిందట కొరోనా సోకింది. ఆరోగ్యం క్షీణించటంతో అతన్ని బీఎన్‌రెడ్డినగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గురువారం ఉదయం నాగోలులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మహేందర్‌గౌడ్ కుటుంబ సభ్యులందరికీ కొరోనా సోకింది. మహేందర్‌గౌడ్‌తో పాటు అతని భార్య, పిల్లలు, తల్లి, తమ్ముడు ఇలా అందరూ కొరోనా బారిన పడ్డారు. వారు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. భార్యాపిల్లలు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.