Take a fresh look at your lifestyle.

ఆగని కొరోనా విజృంభణ

  • 3,60,960 మందికి కొవిడ్‌ ‌పాజిటివ్‌
  • 2‌లక్షల మరణాలు దాటిన జాబితాలో భారత్‌
  • ‌భారత్‌లో స్టెయ్రిన్‌ ‌ప్రాణాంతకం కాదంటున్న నిపుణులు
  • 150 జిల్లాల్లో లాక్‌డౌన్‌ ‌పరిస్థితులు ఉన్నట్లు గుర్తింపు

భారత్‌లో కొరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కి చేరింది. ఇందులో 1,48,17,371 మంది కొరోనా నుంచి కోలుకోగా, 29,78,709కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నాయి.  ఇక దేశంలో కొత్తగా రికార్డ్ ‌స్థాయిలో 3293 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 2,01,187కి చేరింది.రెండు లక్షలకు పైగా మరణాలు సంభవించిన దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉన్నది. నిత్యం లక్షల్లో కేసులు..వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు కరోనా విపత్కర పరిస్థితులను కళ్లకుకడుతున్నాయి.దేశంలో తొలిసారిగా మరణాల సంఖ్య ప్రమాదకరస్థాయిలో 3 వేలు దాటింది. తాజాగా 3,293 మంది కొరోనా మహమ్మారికి బలయ్యారు. దాంతో మరణాల సంఖ్య రెండు లక్షల మార్కు 2,01,187ను దాటింది. గణాంకాల ప్రకారం..అమెరికా(5.87లక్షలు), బ్రెజిల్‌(3.95‌లక్షలు), మెక్సికో(2.15లక్షలు) మరణాల సంఖ్య పరంగా భారత్‌ ‌కంటే ముందు వరసలో ఉన్నాయి. అలాగే  17,23,912 మందికి కొవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 3,60,960 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. ఇక కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 29,78,709కి చేరింది. మొత్తం కేసుల్లో క్రియాశీల వాటా 16.34 శాతంగా ఉంది. ఇక మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2.61లక్షల మంది వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇదొక్కటే సానుకూలాంశం. ఇప్పటివరకు కోటీ 48లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 82.54 శాతానికి దిగజారింది.  కొరోనా ఇండియన్‌ ‌స్టెయ్రిన్‌ (‌బి. 1. 617 వేరియంట్‌) ‌యూకే వేరియంట్‌లాగానే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని, అయితే ఇది అత్యంత ప్రాణాంతకం (లీథల్‌) అనేందుకు ఆధారాలు స్వల్పమని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. సార్స్ ‌సీఓవీ2(కరోనా వైరస్‌) ‌బి. 1. 617 వేరియంట్‌ను డబుల్‌ ‌మ్యూటెంట్‌ ‌లేదా ఇండియన్‌ ‌స్టెయ్రిన్‌ అని పిలుస్తున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో సెకండ్‌ ‌వేవ్‌ ‌సందర్భంగా ఈ వేరియంట్‌ అధికంగా కనిపించింది. మహారాష్ట్రలో దాదాపు 50కిపైగా కేసుల్లో ఈ వేరియంట్‌ ‌కనిపించిందని, యూకే వేరియంట్‌ 28 ‌శాతం మేర కనిపించిందని ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ ‌సుజిత్‌ ‌సింగ్‌ ‌గతవారం చెప్పారు. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒక్కసారిగా కొరోనా విజృంభించింది. పలు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క బాధితులు పలు ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఈ రెండు వేరింట్లు అత్యంత ప్రమాదకారులని చెప్పలేమని, కానీ యూకే వేరియంట్‌ ‌వేగంగా వ్యాప్తి చెందే రకమైతే, భారత వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకమై ఉండొచ్చని ఐజీఐబీ డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. అయితే ఈ విషయం నిరూపణకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిఉందన్నారు. గతేడాదితో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో మరణాలు పెరగడానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణమైఉంటుందన్నారు. ఎక్కువమంది వ్యాధికి గురైతే మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. భారత్‌ ‌వేరియంట్‌లో మూడు రకాల సరికొత్త ప్రొటీన్‌ ఉత్పరివర్తనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఇండియన్‌ ‌స్టెయ్రిన్‌ ‌ప్రాణాంతమైనదని చెప్పేందుకు సంపూర్ణ ఆధారాల్లేవని ఎన్‌సీబీఎస్‌ ‌డైరెక్టర్‌ ‌సౌమిత్ర దాస్‌ ‌తెలిపారు. భారత్‌లో కనిపిస్తున్న వేరియంట్లు వాక్సిన్‌కు లొంగేవేనని, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వీటిపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని గతవారం జరిగిన వెబ్‌నార్‌లో ఆయన అభిప్రాయపడ్డారు. ఇదేసమయంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కూడా జోరందుకుంది.

ఈ నేపధ్యంలో కేందప్రభుత్వం విడుదల చేసిన ఒక రిపోర్టు ప్రకారం దేశంలో కరోనా వ్యాప్తి రేటు 15 శాతం ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ‌విధించాల్సిన పరిస్థితి ఉందని తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు జిల్లాల్లో మరోమారు లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తూ, పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌  ‌విధించాల్సి వుంటుంది. దేశంలోని 150 జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ‌విధించాల్సిన అవసరం ఉంటుందని అధికారులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ‌విధించపోతే పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశాలున్నాయని వారు హెచ్చరించారు.

Leave a Reply