Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఆగని కొరోనా విజృంభణ

  • కొత్తగా 6,551 మందికి పాజిటివ్‌
  • ‌వైరస్‌ ‌బారిన పడి 43 మంది మృత్యువాత
  • కోవిడ్‌ ‌చికిత్స పొందుతూ వేములవాడ పూజారి మృతి
  • జగిత్యాలలో టెస్టింగ్‌ ‌కిట్ల కొరతతో ఆందోళన

చాపకింద నీరులా కొరోనా ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. సమాజంలోకి చొచ్చుకుని పోయింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా..మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో వైరస్‌ ‌ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది.  ఒక్క రోజులో  వైరస్‌ ‌నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రోజురోజుకు పెరుగుతూ వొస్తున్న కేసులతో యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం 65,597 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో 73,275 కొరోనా టెస్టులు చేసినట్లు వివరించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 4,01,783కు కొరోనా కేసులు చేరుకున్నాయి. మొత్తం 2,042 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65,597 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, కొరోనా నుంచి 3,34,144 మంది రికవరీ అయ్యారు. ఇక జిల్లా వారీగా చూసినట్లయితే..జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 1,418 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ 554, ‌రంగారెడ్డి 482, నిజామాబాద్‌ 389, ‌సంగారెడ్డి 368 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 4,01,783కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,34,144 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌బారినపడి 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో 1,418, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్‌ అర్బన్‌లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్‌నగర్‌లో 226, సిద్దిపేటలో 268 అత్యధికంగా కొరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.

ఇక కొరోనాతో వేములవాడ మున్సిపల్‌ ‌పరిధిలోని రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్న దామోదర్‌ (41) అనే అర్చకుడు సోమవారం మృతి చెందాడు. దామోదర్‌కు వారం రోజుల క్రితం కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగిత్యాలలో కొరోనా టెస్టింగ్‌ ‌కిట్ల కొరత నెలకొంది. పరీక్షల కోసం వొచ్చిన వారికి నిర్లక్ష్య సమాధానం ఎదురవుతోంది. కిట్లు లేక పరీక్షలు చేసుకోకుం డానే జనం వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత రావాలంటూ వారికి వైద్యుల సూచిస్తున్నారు. పరీక్షల కోసం గంటల తరబడి జనం క్యూలో నిలబడ్డారు.

Leave a Reply