నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ నిడమనూరు ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమం సాదాసీదాగానే సాగిపోయింది.
నేడు నామినేషన్ల పరిశీలన.. చేపట్టనున్నారు. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్, మే 2న ఫలితం వెల్లడికానుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ప్రలోభ పెట్టి వోట్లు వేయించుకోవడం ప్రజస్వామ్యానికి హాని చేస్తుందన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా తరఫున మువ్వా అరుణ కుమారి నామినేషన్ దాఖలు చేశారు.