Take a fresh look at your lifestyle.

నీలోఫర్‌ ‌దవాఖాన భోజన.. కాంట్రాక్టర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు?

అక్రమాలకు పాల్పడ్డ నీలోఫర్‌ ‌హాస్పిటల్‌ ‌భోజన కాంట్రాక్టర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని నివేదిక అందినప్పటికీ ఆతనిని ఎందుకు కాపాడుతున్నారని వ్యాఖ్యానించింది. నీలోఫర్‌ ‌హాస్పిటల్‌లో భోజన కాంట్రాక్టర్‌ ‌బాధ్యతలు నిర్వర్తిస్తున్న సురేశ్‌ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడుతూ తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడని హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. ఇతని అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరిపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని వివరణ కోరింది. దీంతో కాంట్రాక్టర్‌ ‌సురేశ్‌పై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సమర్పించిన నివేదికను హైకోర్టుకు సమర్పించారు. కాంట్రాక్టర్‌ ‌తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని నివేదికలో పేర్కొన్నారని స్పష్టం చేశారు. అయితే, ఈ నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాంట్రాక్టర్‌ అ‌క్రమాలకు పాల్పడ్డాడని నివేదిక వచ్చినప్పటికీ గాంధీ, చాతీ దవాఖానాలలోనూ ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. కాంట్రాక్టర్‌పై రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, కాంట్రాక్టర్‌పై తీసుకున్న చర్యల వివరాలతో సెప్టెంబర్‌ 16‌లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply