Take a fresh look at your lifestyle.

స్పష్టమైన కవితాస్వరానికి దక్కిన నోబెల్‌

“ఈ ‌సంవత్సరానికి గాను నోబెల్‌ ‌సాహిత్య బహుమతి పొందిన లూయిస్‌ ‌గ్లక్‌ ‌తనకు వచ్చిన ప్రశంసలపై తనకే చాలాకాలంగా అనుమానంగా ఉందని ఎప్పుడో వ్యాఖ్యానించారు. తనను పెద్ద సంఖ్యలో అభిమానించే పాఠకులున్నారని విన్నప్పుడు, ‘ఓహ్‌ ‌గ్రేట్‌, ‌నేను లాంగ్‌ ‌ఫెలోగా మారబోతున్నాను అని అనుకుంటున్నాను. ఎవరైనా అర్థం చేసుకోవడం సులభం, ఇష్టపడటం సులభం, ఈ రకమైన పలుచని అనుభవం చాలా మందికి అందుబాటులో ఉంది. నేను లాంగ్‌ ‌ఫెలో అవ్వాలనుకోవడం లేదు, క్షమించండి. నేను ప్రశంసలను పొందే స్థాయిలో లేను’ అని ఆమె వినయంగా చేసిన వ్యాఖ్యానం సాహిత్య ప్రియులను అబ్బురపరిచింది.”

‘‘‌నాలోని పిల్లవాడు ఆనందంగా ఉన్నాడు. కాని, నాలోని పెద్దవాడికి మాత్రం అనుమానంగానే
ఉంది.’’  1976లో కెనె డాకు చెందిన సాల్‌ ‌బెలో, సాహిత్యంలో తనకు నోబెల్‌ ‌బహు మతిని ప్రకటించినప్పుడు చేసిన వ్యాఖ్యానం నోబెల్‌ ‌సాహిత్య బహుమతి విషయంలో ఎప్పుడూ అనుమానపు ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంది. ‘‘ఈ శతాబ్దపు గొప్ప రచయితలలో చాలామంది నోబెల్‌ను పొందలేదు’’ అనే వాస్తవాన్ని బెలో ‘‘రహస్య అవమానం’’గా పరిగణించాడు. ఈ సంవత్సరానికి గాను నోబెల్‌ ‌సాహిత్య బహుమతి పొందిన లూయిస్‌ ‌గ్లక్‌ ‌తనకు వచ్చిన ప్రశంసలపై తనకే చాలాకాలంగా అనుమానంగా ఉందని ఎప్పుడో వ్యాఖ్యానించారు. తనను పెద్ద సంఖ్యలో అభిమానించే పాఠకులున్నారని విన్నప్పుడు, ‘ఓహ్‌ ‌గ్రేట్‌, ‌నేను లాంగ్‌ ‌ఫెలోగా మారబోతున్నాను అని అనుకుంటున్నాను. ఎవరైనా అర్థం చేసుకోవడం సులభం, ఇష్టపడటం సులభం, ఈ రకమైన పలుచని అనుభవం చాలా మందికి అందుబాటులో ఉంది. నేను లాంగ్‌ ‌ఫెలో అవ్వాలనుకోవడం లేదు, క్షమించండి. నేను ప్రశంసలను పొందే స్థాయిలో లేను’ అని ఆమే వినయంగా చేసిన వ్యాఖ్యానం సాహిత్య ప్రియులను అబ్బురపరిచింది. తాను లాంగ్‌ ‌ఫెలో కాకపోవచ్చు. కాని, ఆమె కవితలు సాపేక్షంగా సులువుగా ఉంటాయి. ఐనప్పటికినీ కొన్నిసార్లు వాటిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడం అసాధ్యం. ప్రతి పదానికి ప్రతిధ్వనించే అర్థాలు స్పూరించేలా, వాటితో చాలా కాలం పాటు మనలని సహజీవనం చేసేలా చేస్తాయి. ఆమె కవితలల్లో అనేక భావోద్వేగ అంశాలు నిబిడీకృతమై ఉన్నప్పటికినీ అంతలోనే క్రూరంగా ఉండటానికి భయపడకపోవడం ఆమే కవిత్వంలోని అతిగొప్ప అంశం.

ఆత్మకథా కవయిత్రిగా అభివర్ణింపబడే గ్లక్‌ ‌న్యూయార్క్‌లో జన్మించి, లాంగ్‌ ఐలాండ్‌లో పెరిగారు. ఆమె తన రచనల్లో భావోద్వేగ తీవ్రతకు, వ్యక్తిగత అనుభవాలకు పెద్ద పీట వేస్తూనే, కాల్పనిక సాహిత్యం వైపు దృష్టి పెట్టారు. చార్లెస్‌ ‌హెర్టజ్ ‌జూనియర్‌తో జరిగిన వివాహం విడాకులతో ముగిసినప్పటికినీ, ఆ బాధ నుంచి తేరుకున్న గ్లక్‌ 1968‌లో తన మొదటి కవితా సంకలనం, ‘ఫస్ట్‌బోర్న్’‌ను ప్రచురించింది. అయితే 1975లో రాసిన ఆమె రెండవ పుస్తకం, ‘ది హౌస్‌ ఆన్‌ ‌మార్ష్ ‌ల్యాండ్‌’ ‌విమర్షకుల ప్రశంసలు పొందడం తన రచనా వ్యాసాంగానికి ప్రోత్సాహకరంగా భావించింది. 1980లో గ్లౌక్‌ ‌కవిత సంకలనం ‘డిసెండింగ్‌ ‌ఫిగర్‌’’ ‌పాఠకుల అభిమానాన్ని పొందినప్పటికినీ, అందులోని ‘‘ది డ్రోన్డ్ ‌చిల్డ్రన్‌’’ ‌కవిత ఆమేలోని రాక్షస కోణాన్ని బయటపెట్టిందని, ప్రముఖ కవి గ్రేగ్‌ ‌కుజ్మా ఆమెను ‘‘పిల్లల ద్వేషి’’ గా అభివర్ణించాడు. ఆమె సారా లారెన్స్ ‌కాలేజీ, కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివారు, కాని ఎక్కడ కూడా పట్టా తీసుకోలేదు. దేశంలోని ప్రధాన సాహిత్య బహుమతులను గెలుచుకోవడమే పెద్ద డిగ్రీలుగా ఆమే భావించారు. తన తండ్రి మరణాంతరం 1990లో ఆమే రాసిన ‘‘అరారత్‌’’ ‌కవితా సంకలనం ఆమేలోని వైరాగ్య భావ సంఘర్షణలను బయటపెట్టింది. బైబిల్‌లోని జెనెసిస్‌లో పేర్కొనబడిన మహావరద కథనంలోని పర్వతం పేరు అది. ‘‘నేను జీవించాను / నాపై నేనే ప్రతీకారం తీర్చుకోవటానికి / నా తండ్రికి వ్యతిరేకంగా, అతను / అతను ఎవరో కాదు / నేనే’’ అంటూ తాను పెరిగేటప్పుడు అనుభవించిన మానసిక వేదన తనకు ప్రియమైనది కాదని ఆమె తేల్చి చెప్పింది. గత 25 సంవత్సరాలలో వెలువడిన అమెరికన్‌ ‌రచనలలో అత్యంత క్రూరమైన దుఖఃభరిత కవితా సంకలనమని ఈ పుస్తకం విమర్శించబడింది. 1993లో తనకు పులిట్జర్‌ అవార్డు సంపాదించి పెట్టిన ‘‘ది వైల్డ్ ఐరిస్‌’’‌తో తనపై వచ్చిన విమర్శనలన్నింటికి సమాధానం చెప్పారు. దురదృష్టవశాత్తు, గ్లక్‌ ‌రెండు వివాహాలు విఫలం కావడం వేధనను మిగిల్చినప్పటికినీ, ఆ విషాద అనుభవాలనే తన విజయాలకు స్పూర్థిగా అనేక రచనలు చేయడం విశేషం. ‘‘ది ట్రయంఫ్‌ ఆఫ్‌ అకిలెస్‌’’‌లో శృంగారం, ప్రేమ సంబంధాలే ప్రధాన ఇతివృత్తాలుగా కవిత సాగుతుంది. 1994లో ‘‘ప్రూఫ్స్ & ‌థియరీస్‌ : ఎస్సేస్‌ ఆన్‌ ‌పోయెట్రీ’’ అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. అంతేకాకుండా మీడోలాండ్స్, ‌వీటా నోవా, ది సెవెన్‌ ఏజెస్‌ ‌వంటి అత్యుత్తమ సాహిత్యాన్ని అందించారు.

గ్లక్‌ ‌బాల్యంలో అనోరెక్సియా నెర్వోసా అనే వ్యాధితో బాధపడింది. ఆమె ఈ విషయాన్ని ఎక్కడా నేరుగా ప్రస్తావించకున్నప్పటీనీ, తన ‘‘డెడికేషన్‌ ‌టు హంగర్‌’’ ‌కవితలో లీలగా స్పృషించింది. ఆకలికి అంకితం…,/ కొందరు ఆడపిల్లలలో ఇది నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది./ మరణభయం దాని రూపాన్ని సంతరించుకుంటుంది. ఆకలికి అంకితం….,/ ఎందుకంటే స్త్రీ శరీరం ఒక సమాధి. / అది దేనినైనా అంగీకరిస్తుంది. తన జీవితక్రమంలో ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్ని తన కవితా వస్తువుగా మార్చుకోవడం ఆమేకే చెల్లింది. ఆమె వృద్ధాప్యం గురించి లోతైన, చమత్కారమైన కవితలు అల్లేది. మనసును మెలిపెట్టే వృద్ధాప్యపు హృద్య కవితలను ‘‘అవెర్నో’ లో చూడవచ్చు. నేను గదిలో లేనప్పుడు వారు ఏమి చెబుతారో నాకు తెలుసు./ నేను ఎవరినైనా చూస్తున్నాననో.., నిరాశకు కొత్త మందు ఏమైనా తీసుకుంటున్నాననో.., నేను వారి గుసగుసలను వినగలను./ ఖర్చును ఎలా తగ్గించాలో ప్రణాళిక చేస్తున్నాను. వారంతా చెడ్డవారు.. నన్ను విడదీయడానికి చూస్తున్నారు. వారంతా చెడ్డవారు.. వారు అదే కలలో జీవిస్తున్నారు., / నేను దెయ్యంగా మరడానికి సిద్ధమవుతున్నాను.

గ్లక్‌ ‌స్వేచ్చాయుత కవిత్వం ఖచ్చితమైన అలంకారిక కావ్య సృజనకు ప్రతీక. మనిషిని జీవితాంతం పెనవేసుకుని ఉండే వాస్తవ వేదనలైన కుటుంబం, బాల్యం, ప్రేమ, సెక్స్, ‌మరణం, ప్రకృతి, జంతువులు ప్రాధాన్యంగా ప్రకృతి నేపథ్యంలో ఆమె చేసిన శాస్త్రీయ సూచనలు జ్ఞానభరితం. ఆమె ఆకలిని కవితావస్తువుగా కవితలు రాసింది. ఆమె ఆహారం గురించి స్పష్టంగా వ్రాసినప్పటికీ, అదే సమయంలో ఇతర విషయాల గురించి కూడా రాసింది. ‘‘బాస్కెట్స్’’ ‌కవితలోని పంక్తులు పాఠకులను ఆలోచనలో పడేస్తాయి… నేను నా బుట్టను ఇత్తడి మార్కెట్‌కు, సమావేశ స్థలానికి తీసుకువెళతాను, నేను మిమ్మల్ని అడుగుతున్నా / ఎంత అందం ఒక వ్యక్తి భరించగలడు? అది వికారం కన్నా బరువైనది, / ఏ బరువైనా దాని ముందు దిగదుడుపే. గుడ్లు, బొప్పాయి, పసుపు నిమ్మకాయల బస్తాలు -/ నేను బలమైన స్త్రీని కాదు. ఇంత భారీ బుట్టతో అంత దూరం నడవడం / అంత సులభం కాదు.

‘‘గ్లక్‌ ‌తన స్పష్టమైన కవితా స్వరానికి గుర్తింపు పొందింది. గడుసైన అందంతో వ్యక్తిగత ఉనికిని విశ్వవ్యాప్తం చేసిందని’’ స్వీడిష్‌ అకాడమీ పేర్కొనడం ఆమే అసాధారణ వ్యక్తిత్వానికి లభించిన గుర్తింపు. నిజానికి నోబెల్‌ ‌బహుమతి తనను వరిస్తుందని ఆమె ఎప్పుడూ భావించి ఉండరు. ఒడిదొడుకుల జీవితపు అనుభవ పాఠాల నుంచి ఆమె సృష్టించిన కవితా శిల్పాలు కొందరిని ఆకట్టుకొలేకపోయి ఉండవచ్చు. అయితే ఆ సాహిత్యమే మరెందరినో సాంత్వన పరచడం ఆమేకు సంతృప్తినిచ్చేది. 2010 నుండి నొబెల్‌ ‌సాహిత్య బహుమతిని గెలుచుకున్న నాల్గవ మహిళ మాత్రమే కాదు, 1901లో సాహిత్యంలో నోబెల్‌ ‌బహుమతి ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ అవార్డు పొందిన 16వ మహిళ గ్లక్‌. ‌పులిట్జర్‌ ‌బహుమతితో పాటు, నేషనల్‌ ‌బుక్‌ అవార్డు, బోలింగెన్‌ ‌బహుమతి, వాలెస్‌ ‌స్టీవెన్స్ అవార్డు, నేషనల్‌ ‌హ్యుమానిటీస్‌ ‌మెడల్‌ ఆమే ప్రతిభకు నిదర్శనాలు. గ్రీకు పురాణాలలో తరచుగా ద్రోహానికి గురయే పెర్సెఫోన్‌, ‌యూరిడైస్‌ ‌వంటి పాత్రల నుండి కూడా ఆమె ప్రేరణ పొందింది. అవెర్నో ఒక అద్భుతమైన కవితా సంకలనం. మృత్యుదేవుడైన హెడీస్‌ ‌బందీఖానాలో ఉన్న అతని రాణి పెర్సెపోన్‌ ‌వ్యధభరిత గాథను తన కవితలలో ప్రస్తావించేది. సొంత దేశంలో కూడా కొద్దిమంది కవులు మాత్రమే తమ జీవితకాలంలో ప్రజలలో నిజమైన ఖ్యాతిని సాధిస్తారు. ఎప్పుడు కూడా ఇతరులతో కలవని ప్రైవేటు వ్యక్తి ఆమె. ప్రజా జీవితంలో తనకు పెద్దగా ఆసక్తి లేదని, ఏవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు కలవాలనుకునే వ్యక్తిని కాదని ఆమె పలుమార్లు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

నోబెల్‌ ‌ప్రైజులల్లో శాంతి, సాహిత్య రంగాలలో ఇచ్చే బహుమతులు తరచుగా వివాదాస్పదమవుతాయి. గత సంవత్సరం నోబెల్‌ ‌సాహిత్య బహుమతి ఆస్ట్రియా రచయిత పీటర్‌ ‌హ్యాండ్కేకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 1990 నాటి యుగోస్లావ్‌ ‌యుద్ధంలో హ్యాండ్కే సెర్బులకు మద్దతు తెలపడమే కాకుండా, ఘోర మారణహోమం, యుద్ధ నేరాలకు పాల్పడిన మాజీ సెర్బ్ ‌నాయకుడు స్లోబోడాన్‌ ‌మిలోసెవిక్‌ అం‌త్యక్రియల్లో ప్రసంగించాడు. లైంగిక వేధింపుల కుంభకోణం, ఆర్థిక దుష్ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో పోలిష్‌ ‌రచయిత్రి ఓల్గా టోకార్జుక్‌ను ఒక సంవత్సరం పాటు సస్పెండ్‌ ‌చేసిన తరువాత 2018 నోబెల్‌ ‌సాహిత్య బహుమతి విజేతగా గత సంవత్సరం ప్రకటించారు. నిజానికి గ్లక్‌ ‌పేరు ఈ సంవత్సరం నోబెల్‌ ‌గ్రహీతగా పెద్దగా ప్రచారం చేయబడలేదు. ఇప్పటివరకు ఆమె రచనలు అమెరికా అవతల పెద్దగా పరిచయం లేదు. లూయిస్‌ ‌గ్లక్‌కు ఒక అమెరికన్‌ ‌కవి ఆశించే అన్ని రకాల బహుమతులను ప్రదానం చేశారు. ఇది గ్లక్‌ అపారమైన తెలివితేటలు, సాహిత్య సేవకు, లోతైన అనుభవానికి దక్కిన గుర్తింపు. గతంలో స్వీడిష్‌ అకాడమీ చేసిన పేలవమైన ఎంపికలపై వ్యాఖ్యానిస్తూ.., స్కాండినేవియన్‌ ‌తెలివిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దని అమెరికా రచయిత గోరే విడాల్‌ ఒకసారి సలహా ఇచ్చాడు. లూయిస్‌ ‌గ్లక్‌ ‌విషయంలో ఈ వ్యాఖ్య ఖచ్చితంగా సరిపోతుంది.

Jayaprakash Ankam
జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply