Take a fresh look at your lifestyle.

కేంద్ర బడ్జెట్‌ ‌లో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌సోమవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2021-22 సంవత్సరం వార్షిక బడ్జెట్‌ ‌మధ్యతరగతి వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. కేంద్ర బడ్జెట్‌ ‌వస్తోందంటే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ‌మీడియాల్లో పుంఖానుపుంఖంగా ఎన్నో వ్యాసాలు, అంచనాలు వెలువడుతాయి. ఇవన్నీ ప్రజలను ఊరించేవే. ఈసారి కూడా అలాంటి కథనాలే వెలువడ్డాయి. అవి చూసి ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా వేతన జీవులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ‌లో ప్రధాని నరేంద్రమోడీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాల సారాంశమే ఈ బడ్జెట్‌. ‌కోవిడ్‌-19 ‌సృష్టించిన విషవలయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి పరిశ్రమలకూ, కార్పొరేట్‌ ‌రంగాలకు ఉద్దీపనలు అవసరమే కానీ, మధ్యతరగతిని కూడా ఎంతో కొంత సంతృప్తి పరుస్తారని అనుకుంటే అటువంటిదేమీ లేకుండానే నిర్మల తన ప్రసంగాన్ని ముగించేశారు. ముఖ్యంగా, వేతన జీవులు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారేమోనని గంపెడాశలతో ఎదురు చూశారు.కానీ, నిర్మలగారి ప్రసంగంలో ఆ ఊసే లేదు. పెన్షనర్లలో 75 ఏళ్ళు దాటిన వారికి ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు.అలా పెన్షన్‌ ‌తీసుకునే వారు ఆ వయసు వారు ఎంత మంది ఉంటారనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. ఏదో చేశామన్న మొక్కుబడిగా తప్ప దాని వల్ల ప్రయోజనం చాలా పరిమితమని చాలా మంది అభిప్రాయం.

ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంచితే నిజంగానే మధ్యతరగతికి మేలు జరిగి ఉండేది. పన్నుల భారం వల్ల వేతన జీవులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. కార్పొరేట్‌, ‌వ్యాపార, పారిశ్రామిక రంగాలవారికి ఇస్తున్న రాయితీలతో పోలిస్తే ఈ మినహాయింపు చాలా తక్కువే. కానీ ఈసారి అది కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ‌లేదా యూపీఏ హయాంలో బీజేపీ నాయకులు తాము అధికారంలోకి వస్తే ఈ మినహాయింపును గరిష్టం పెంచుతామంటూ చేసిన వాగ్దానాలు ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలను రెట్టింపు చేయడం మంచిదే కానీ, ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీ ఇరవై లక్షల కోట్ల రూపాయిలలో కూడా ఈ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.అవి సక్రమంగా అసలైన లబ్ధిదారులకు చేరాయో లేదో పర్యవేక్షణ లేదు. కోవిడ్‌-19 ‌విరుచుకుని పడినప్పుడు మన దేశంలోని హాస్పిటల్స్ డొల్లతనం, వైద్య సేవల డొల్లతనం బహిర్గతం అయింది.దానిని దృష్టిలో ఉంచుకుని ఈ రంగానికి ఈసారి ఎక్కువ నిధులు కేటాయించారు. అలాగే, ఢిల్లీ శివార్లలో రైతులు రెండు నెలలు పైగా సాగిస్తున్న పోరాటం ఫలితంగా, ఈసారి వ్యవసాయ రంగానికి కూడా కేటాయింపులు పెంచారు. ఇది మంచి పరిణామమే. అయితే, సోయా, సన్‌ ‌ఫ్లవర్‌ , ‌పామ్‌ ఆయిల్‌ ‌ధరలను పెంచడం వల్ల భారం పడేది మధ్యతరగతి పైనే,ఈ ఆయిల్స్ ‌ను ఎక్కువగా వినియోగించేది ఈ వర్గాల వారే. మొబై ల్‌ ‌ఫోన్లు, కార్ల విడిభాగాలపైనా, లెదర్‌ ఉత్పత్తులపైనా సుంకాలను పెంచడం వల్ల ఎక్కువ గా భారం పడేది కూడా మధ్యతరగతిపైనే . మోడీ ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీ కి ఎక్కువగా మద్దతు ఇస్తున్నది ఈ వర్గాలేనన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. అయోధ్యలో ఈ రామజన్మభూమిలో రామాలయం నిర్మాణానికి చందాలు ఎక్కువగా ఇస్తున్నది కూడా ఈ వర్గాలే. అయినప్పటికీ కనికరం లేకుండా ఈ వర్గాలపై కేంద్రం భారం మోపింది.

- Advertisement -

మొండి బకాయిల విషయమై కేంద్ర మంత్రి ప్రస్తావించి వీటి పరిష్కారానికి బ్యాడ్‌ ‌బ్యాంక్‌ ‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.ఈ ప్రతిపాదనను రెండుమూడేళ్ళ క్రితమే రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ‌దువ్వూరి సుబ్బారావు సూచించారు. మొండి బకాయిల ఖాతాలను ఒక వ్యవస్థకు బదిలీ చేసి నెమ్మదిగా ఆ బకాయిలు వసూలు చేసే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలన్నది ప్రతిపాదన. మామూలు బ్యాంకుల కార్యకలాపాలు పెరగడం, వాటికి స్థానికంగా మొహమాటాలు ఉండటం వల్లఇలాంటి సంస్థ ద్వారా మొండి బకాయిల వసూళ్ళు సక్రమంగానూ, నిష్పాక్షికంగా జరుగుతుందనీ, మలేసియాలో ఇటువంటి బ్యాంకు బాగా పని చేస్తోందని సుబ్బారావు చెప్పారు. మన దేశమే కాకుండా, పొరుగుదేశాలు, వర్దమాన దేశాలలో ఈ మొండి బకాయిల సమస్యను తీవ్రంగానే ఉంది. పాకిస్తాన్‌ ‌లో అయితే చెప్పనవసరం లేదు. పాకిస్తాన్‌ ‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఈ ‌బకాయిల విషయమై చాలా సార్లు హెచ్చరించింది.

పాకిస్తాన్‌ ‌లో ఉగ్రవాద సంస్థలకు ఉదారంగా ఇచ్చిన రుణాలు ఎప్పటికీ వసూలు కాకపోవడంతో ఈ జాబితా కొల్లేటి చాంతాడులా పెరిగిపోతోంది. అలాగే, బంగ్లాదేశ్‌ ‌కూడా మొండి బకాయిల సమస్యను ఎదుర్కొంటోంది. కోవిడ్‌ ‌నేపధ్యంలో ఈ సమస్యను ప్రభుత్వం ప్రధానంగా చూపుతోంది.మన దేశంలో కూడా ఈ సమస్య యూపీఏ హయాం నుంచి ఉంది. విజయ్‌ ‌మాల్యా, మెహుల్‌ ‌చోక్సీ , నీరవ్‌ ‌మోడీ వంటి ఎగవేతదారులంతా ప్రభుత్వాల ప్రాపకంతోనే బ్యాంకులరుణాలను ఎగవేసి విదేశాలకు చల్లగా జారుకున్నారు. వీరి పాపాల్లో పాలకులకు కూడా తిలా పాపంలా వాటా ఉంది.అయితే,ఎవరి మటుకువారు ఎదుటివారిని దుమ్మెత్తు పోస్తూ అధికారంలో కొనసాగుతుండటం మన దేశంలో చూస్తున్న వైచిత్య్రం. మన బ్యాంకులకు బకాయిలు పడి దర్జాగా తిరుగుతున్న వారు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఉన్నారు. వారంతా రాజకీయ రంగంలో ప్రముఖులు.వారిపై చర్య తీసుకోవల్సి వస్తుందని బ్యాడ్‌ ‌బ్యాంక్‌ ‌ప్రతిపాదనతో ఆర్థిక మంత్రి సరిపెట్టారు. మొత్తం మీద నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌సామాన్య , మధ్యతరగతి వర్గాలకు ఒరగ బెట్టిందేమీ లేదు.

Leave a Reply