Take a fresh look at your lifestyle.

సమ్మక్క సారలమ్మపై ఎలాంటి అల్ప వ్యాఖ్యలు చేయలేదు

  • 20 ఏళ్ల క్రితం ప్రసంగంలో ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారం
  • దీనివెనక అన్య ప్రయోజనాలు ఉన్నాయేమో
  • మైక్‌ ‌దొరికింది కదాని కొందరు ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు
  • ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు
  • సమాజానికి మేలు చేయడమే మా కర్తవ్యం
  • యాదాద్రికి పిలిస్తే వెళతాం..లేకుంటే చూసి ఆనందిస్తాం
  • రాజకీయాలకు మేం దూరం..పూసుకుని తిరిగే అలవాటు లేదు
  • మాంసాహారంపై చేసిన ఉద్ఘాటనతో సామాన్యులకు సంబంధం లేదు
  • మీడియా సమావేశంలో వివాదంపై చినజీయర్‌ ‌ప్రకటన

అమరావతి, మార్చి 18 : మేడారం సమ్మక్క సారలమ్మపై తాను తూలనాడినట్లుగా కొందరు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని చిన్నజీయర్‌ ‌స్వామి వివరణ ఇచ్చారు. తాము బాధ్యతగల వ్యక్తులుగా ఎవరిని కూడా కించపరిచే చర్యలకు దిగమని అన్నారు. కానీ తాను 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యల పూర్వా పరాలను పక్కన పెట్టి కేవలం ఒక వాక్యాన్ని తీసుకుని తనను విమర్శించే వారు నిజాలు గ్రహించాలన్నారు. విమర్శలు చేసిన వారు తను సంప్రదించకుండా లేదా..దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా చేస్తున్న ప్రయత్నాలు సమాజ హితానికి పనికి రావని గమనించాలన్నారు. ఎపిలోని తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల చెలరేగగిన వివాదంపై చినజీయర్‌ ‌స్వామి వివరణ ఇచ్చారు. ఆదివాసీలయినా, హరిజనులయినా అందరినీ సమానంగా ఆదరించాలన్నదే రామానుజ సిద్ధాంతమని అన్నారు. మనలో జ్ఞానవంతులయిన మహిళలు చదువు లేకున్నా పైకి వొచ్చి వారు దేవతలుగా కొలువుతీరారని, అలాంటి వారిలో సమ్మక్క సారక్కలు ఉన్నారని అన్నారు.

వారెవ్వరూ స్వర్గం నుంచి దిగిరాలేదని, వారంతా మనలోంచి వొచ్చిన వారేనని అంటూ..అలాంటి వారిని అడ్డంపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలు చేయొద్దని మాత్రమే తాము ఆనాడు సూచించామని అన్నారు. అయినా ఆదివాసీల అభివృద్ధికి తమ వికాసతరంగిణి చేస్తున్న కార్యక్రమాలు అనేకం ఉన్నాయన్నారు. ఇకపోతే మహిళల్ని ఆదరించాలని భావించేవాడిని తానని, మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు అన్నారు. పూర్వాపరాలు చూడాలి. మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం అని చినజీయర్‌ ‌స్వామి అన్నారు. ‘ఇవాళ లక్ష్మీ దేవీ పుట్టిన రోజు. ఆగమ గ్రంథాలు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవంగా చెప్పాలి. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రపంచంలోని మహిళలందరికీ మంగళాశాసనాలు తెలియ చేస్తున్నాం. ఎవరికి జ్ఞానం విలక్షణంగా ఉంటే.. వారిని ఆరాధ్య స్థానం కల్పించాలని రామానుజాచార్యులు సూచించారు. జ్ఞానులైన ఆదివాసీలను గౌరవించే సంప్రదాయం ఉండాలని రామానుజాచార్యులు సూచించారు. రామానుజ పరంపరలో సామాజిక, ఆధ్యాత్మిక విప్లవం సృష్టించారు. 1938లోనే తూ.గో. జిల్లాలోని అత్తలూరులో శ్రీమన్నారాయణ హరిజన కాలనీ నిర్మాణం జరిగింది. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ఆదివాసీల కోసం స్కూలును 2004లో ప్రారంభించాం. అవకాశం లేకే ఆదివాసీలు వెనకబడ్డారు. అవకాశం ఉంటే ఆదివాసీల్లో అద్భుతమైన ప్రగతి ఉంటుంది’ అన్నారు చినజీయర్‌ ‌స్వామి. సమాజం అనే వేదిక మీద అంతా కలిసి ముందుకు సాగాలి. ఒక వేదిక దొరికిందని కొందరు రకరకాలుగా మాట్లాడడం మంచిది కాదు.

ప్రజల్ని రెచ్చగొట్టడం తాత్కాలిక ప్రయోజనాల కోసమే. పబ్లిసిటీ కోసం మాట్లాడకూడదు. అమాయకులను రెచ్చగొట్టడం సులభం. సమాజ హితం కాంక్షించేవారు కూర్చుని ఆలోచించాలి. అంతా కలిసి చర్చించాలి. నారీమణులందరికీ మంగళాశాసనాలు చేస్తున్నామన్నారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరంగం క్షేత్రంలో అమ్మవారు, అయ్యవారు కలిసి వుంటారు. అమ్మకలిసి వుండగానే మనం అయ్యవారిని ఆశ్రయించాలి. పూజించాలి. ఈరోజు విలక్షణమయిన రోజు. అందరినీ సమానంగా చూద్దాం. చెట్టుపుట్టగట్టుని అంతా గౌరవించాలి. ప్రతి పండుగకు అది పాటిస్తున్నాం. ఒక జంతువు, పక్షి, ఆకు, మనం తినే ఆహారం కలిసి వుంటుంది. దసరా నాడు జమ్మిచెట్టుని పూజిస్తాం. మనం ప్రకృతిని, ప్రాణికోటిని పూజిస్తాం. అందరికీ మంచిని నేర్పుదాం అని చినజీయర్‌ ‌స్వామి అన్నారు.

గ్రామసీమల్లో వుండే వ్యక్తులు సమ్మక్కసారలమ్మ, ఆదివాసీలు అయితే నాలెడ్జ్ ‌పరంగా వారిని ఉత్తములుగా భావించాలి. వారి ప్రతిభ ఆరాధ్య అర్హత పొందారు. అసాంఘిక కార్యక్రమాన్ని ప్రోత్సహించవద్దు.సమతామూర్తి విగ్రహం చూడడానికి టికెట్‌ ‌పెట్టాం. దాని నిర్వహణ కోసం పెట్టాం. అంతేగానీ అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవు. మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగవద్దు. విషయం తెలుసుకోకుండా ప్రశ్నలు అడగవద్దన్నారు చినజీయర్‌ ‌స్వామి. పనిగట్టుకుని వివాదం చేసి టీవీల్లో వాళ్ల వాళ్ల ముఖాలను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్‌ ‌హడావుడి తగ్గడంతో ఈ ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. తాము ఎప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.

తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే..వారిపై జాలిపడాల్సి వొస్తుందన్నారు. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని తప్పుబట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లిం, క్రిస్టియన్స్ ‌కూడా వొస్తుంటారని తెలిపారు. తమకు కులం, మతం అనే తేడా లేదని చెప్పారు. అందరిని గౌరవించాలనేది తమ విధానమని ప్రకటించారు. మహిళలను చిన్నచూపు చూసేవారిని ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని సమస్యగా మారుస్తున్నారని, సమాజ హితం లేనివారే ఇలాంటి అల్పప్రచారం చేస్తున్నారని జీయర్‌స్వామి ఆక్షేపించారు. ఇకపోతే మాంసాహారంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఓ విలేఖరి ప్రశ్నించగా దానికి కూడా తిరుగులేని సమాధానం ఇచ్చారు. ఇకపోతే యాదాద్రికి ఆహ్వానంపై స్పందిస్తూ ఆహ్వానిస్తే వెళతాం..లేదంటే చూసి ఆనందిస్తామని అన్నారు. తమకు ఎవరితోనూ గ్యాప్‌ ‌లేదన్నారు. ఆలాగే తమకు రాజకీయ ఆలోచనలు లేవన్నారు. రాజకీయంగా పూసుకుని తిరిగేందుకు తాము ఎప్పుడూ దూరంగా ఉంటామన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మపై త్రిదండి చినజీయర్‌ ‌స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే.

Leave a Reply