Take a fresh look at your lifestyle.

ప్రశ్నించలేని స్వాతంత్య్రం..!

“తాను బతకాలంటే… ముందు ప్రకృతి బతకాలనే ఇంగిత జ్ఞానం ప్రతి మనిషిలో ఉండాలి. పాలకుల్లో మరీ ఎక్కువగా ఉండాలి. అందుకే ‘‘పడవ నీటిలో ఉండవచ్చుగానీ, నీరు పడవలో ఉండకూదనే’’ సత్యాన్ని మరువరాదు. ప్రకృతి ద్వారా ఉచితంగా లభించే సంపదలను  పాలకులు వ్యాపారీకరణ చేయడంతో ఆ స్వార్థశక్తుల దోపిడి మూలంగా ప్రకృతి కూడా మహోగ్ర రూపం దాలుస్తుంది. ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తే, ప్రకృతి అంతగా సిరిసంపదలను అందిస్తుంది. దానికి తోడు మానవాళిలో ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. కార్పొరేటు పెట్టుబడి దారులు చేసే విధ్వంసం భవిష్యత్తులోని అనేక తరాలకు శాపంగా మారుతుందని మరువరాదు.”

నేడు మన దేశంలో స్వాతంత్య్ర వేడుక లు కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ నిరాడం బరంగా జరుపుకునే పరిస్థితులు చూస్తున్నాము. కొరోనా వైరస్‌ ‌దెబ్బకు ప్రపంచం అంచనాలు తలకిందులైనాయి. ప్రకృతి సమ్మిళిత విరుద్ద జీవనం, అగ్రరాజ్య ఆధిపత్యంలో కొందరు స్వార్థపరుల విధానాలు వెరసి సంక్షోభంగా మారింది. ఆధికార ఆధిపత్యం, అహంకారం, అణిచివేత ప్రపంచదేశాల్లో రూపాలు వేరైనా బలిపశువులు మాత్రం పేద, మధ్య తరగతి, అల్ప సంఖ్యాక వర్గాలే ననేది కాదనలేని నిజం. ఇన్నాళ్లా స్వాతంత్య్ర దేశంలో ప్రజాపాలకుల స్వార్థ ప్రయోజనాల కారణంగా ప్రణాళికల క్యాలెండర్‌ ‌తారుమారై పోయింది. వీరికి ప్రశ్నించే స్వేచ్ఛను అరచేతిలో పెట్టి మోచేతితో తీసి(వాడు) కొమ్మన్నట్టు ఉంటుంది. మన దేశంలో స్వాతంత్య్రానంతరం అభివృద్ధి జరగలేదని కాదు, కానీ ‘‘అభివృద్ధి గోరంత – అవినీతి కొండంత’’గా పెరిగిపోయింది. అవినీతి వటవృక్షానికి తల్లివేరు రాజకీయ అవినీతేనని అనేక అధ్యయనాలు తెల్పినాయి, నాడు 1857 సిపాయిల తిరుగుబాటు నుండి అంచలంచలుగా దక్షిణాఫ్రికాలో రైలులో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణిస్తున్న గాంధీని శ్వేత జాతీయుడు అహంకారంతో అతి ధోరణి ప్రవర్తనే భారత స్వాతంత్య్ర పోరాట జ్వాలలకు ఆజ్యంపోశాయి. నిరక్షరాస్యత, అజ్ఞానం, అసంఘటితంగా ఉన్న భారతజాతి స్వేచ్ఛ కోసం ఎందరెందరో మహానీయులు పోరాట మార్గాలు వేరుగా ఎంచుకున్న గమ్యాన్ని ముద్దాడిండ్లు. అహంకారం అశాస్త్రీయ తత్వమని మానసిక నిపుణుల అభిప్రాయం, నడమంత్రపు అధికారాలు, ఐశ్యర్యాలు శాశ్వతమని నమ్మి పాలకు(మనుషు)లు విర్రవీగుతారు.

అశ్వాశ్వతమైన వీటి కోసం స్వార్థం పెచ్చరిల్లి సత్యం, ధర్మం, నైతిక విలువలకు తిలోదకాలిస్తూ అమానవీయ ప్రవర్తన పలితమే నేడు కొరోనా రూపంలో మనిషికి ప్రాణ భయం పట్టుకుంది. ప్రకృతి, పంచభూతాలకు హాని తలపెట్టకుండా సమ్మిళిత అభివృద్ధికి బాటలు పరచాలి. సంపద కేంద్రీకృతాన్ని విడనాడాలి. ఎంత సంపాదించినా చివరకు కనీస అంతిమ సంస్కారాలకు నోచుకోని దుర్బరంగా పూడ్చిపడేస్తున్న కరోనా రోగుల మరణాలనుండైనా పాలకు(పాలితు) లు స్వార్థం వీడి సార్థకత చేకూర్చేలా జీవితాలను గడుపాలని గుణపాఠం నేర్చుకోవాలి. చివరకు కరోనా బారిన పడ్డవారికి వారి బంధువులు, బంధాలను కూడా విడనాడుతున్న తీరును చూస్తుంటే విస్మయం కలుగుతుంది. అదేవేళ… పారిశుద్య కార్మికులు, వైద్యులు, పోలీసులు తదితరులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా చేస్తున్న సేవ వెలకట్టలేనిది. అదే ‘‘మానవత్వం’’ దీనిలో స్వార్థం లేదు, నిస్వార్థ్యర్థ సేవ నెరతే, తార్కాణం కదా ! పాలకులు నేటి స్వాతంత్య్ర దినోత్సవ వేళ అమలుకు నోచుకోని ఊకదంపుడు ఉపన్యాసాలు మానాలి. ఈ విపత్కర కరోనా మహమ్మారి మరణమృదంగానికి పాలకుల విధానాలే ముమ్మాటికి కారణమని గమనించండి. దీనిని కట్టడి చేసినా చిన్న చిన్న దేశాలు, క్యూబా, వియత్నాం, మనదేశంలోని కేరళ రాష్ట్రం సోషలిస్టు ‘‘భావజాల(దృక్పద)ంతో కరోనా కట్టడి చేస్తున్న విధానాలను యు.ఎన్‌.ఓ. అభినందించిన దాని నుండి  స్ఫూర్తి పొంది విద్య, వైద్యం, పెట్టుబడిదారీ కార్పోరేటు శక్తుల చేతుల్లో పెట్టకుండా  ప్రభుత్వాధీనంలోకి తీసుకొని కొరోనానే కాదు మునుముందు రాబోయే విపత్కర పరిణామాలను తట్టుకునేలా విధానాల అమలుకు పూనుకోవాలి. లాభాపేక్ష ధ్యేయంగా వ్యాపార దోరణి గల పెట్టుబడి దారి విధానం మన దేశానికి ముమ్మాటికి పనికిరాదు. సమ్మిళిత అభివృద్ధికి సాదించిన నాడే దేశ ప్రజలు వసుదైక కుటుంబంగా జీవించగలరు. దేశ సంపద కొన్ని కుటుంబాల జేబులు నింపటానికి నాటి స్వాతంత్య్రోధ్యమనాయకులు ప్రాణాలను ఫణంగా పెట్టలేదని గమనించండి.

దేశానికి రాజకీయ స్వాతంత్య్ర వచ్చింది కానీ ప్రజలకు ఆర్థిక సామాజిక స్వాతంత్య్ర రాలేదనే వాస్తవాన్ని జరుగుచున్న సంఘటనలే నిదర్శనం.
భారతదేశంలో అసమానతలు ‘‘ఆక్స్‌ఫామ్‌’’ ‌చేసిన సర్వే ప్రకారం ‘‘దేశ సంపదలో 73 శాతం, ఒక్క శాతం మంది వద్దే’’ పోగుబడి వుంది. ఈ స్థాయి అసమానతల మూలంగా కోట్లాది మంది భారతీయులు దారిద్రరేఖకు దిగువన ఉన్నారు. కొరోనా ప్రభావంతో ఓపైపు పేదరికం మరోవైపు నిరుద్యోగం రేటు నానాటికి పెరిగిపోయి ప్రపంచంలోనే ఎక్కువ బీదవారు గల దేశంగా చతికిల పడిపోయింది వాస్తవం కాదా ! కొరోనా సంక్షోభాన్ని పరిష్కరించడంలో సఫలం కానీ ప్రభుత్వం సంక్షోభ సమయంలో నాడు ‘‘క్విట్‌ ఇం‌డియా అంటూ’’ బ్రిటిష్‌ ‌వారిని తరిమి నేడు ‘‘వెల్‌కమ్‌ ఇం‌డియా అంటూ’’ ఆర్థిక స్వావలంబన పేరుతో దేశంలోని ప్రధాన రంగాలను బొగ్గు, గనులు, విమానయానం, రక్షణ రంగం, విద్యుత్తు, సామాజిక మౌళిక వసతులు, అంతరిక్ష రంగం, అణుశక్తి మొదలగు రంగాలను ప్రైవేటు పథంలో విదేశీ పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. ప్రజలను అసంఘటిత పరుస్తూ, సంస్థలను ప్రైవేట్‌ ‌పరం చేస్తూ విపత్తును కూడా పాలకుల ప్రయోజనాలకు, భావజాల వ్యాప్తికి  వాడుకోవడం అప్రజాస్వామ్యం కాదా ! ఆర్థిక వ్యవస్థనే ప్రైవేట్‌కు కట్టబెట్టడం భావ్యమా ! మనవాళ్ళు రెండు శతాబ్ధాలు దేశానికి స్వాతంత్య్రం రావాలని నిద్రాహారాలు మాని వారి తలలను తృణపాయంగా తాకట్టుపెట్టి, ఉరికొయ్యలను ముద్దాడింది ఇందుకోసమేనా ? అని భారత జాతి నేడు బాధపడుతుంది. బ్రిటిష్‌ ‌వాళ్ళు నాడు భారత జాతికి ప్రశ్నించే స్వేచ్ఛ ఉండడం వల్లనే జాతి ఒకతాటిపైకి వచ్చారని గమనించండి. స్వతంత్ర ఉద్యమ ఉదృతిని తట్టుకోలేక బ్రిటీష్‌ ‌వాళ్లు ఇండియాను వదిలి వెళ్ళారు.

ఉప్పుపై పన్నువేస్తే వాళ్లకు పన్నుల చెల్లించరాదని… దండి ఉప్పుపోరాటం వారి చట్టాలకు సహాయనిరాకరణ చేస్తూ, విదేశీ వస్తు(వస్త్ర) బహిష్కరణ ఇలా అనేక ఉద్యమాలకు ఊపిరిపోసి స్వేచ్ఛ స్వాతంత్య్రాలను సాధించిన జాతి, నేడు మన ప్రజాపాలనలో ఆ స్వేచ్ఛ కరువైంది. ఏదైనా విమర్శిస్తే, ప్రశ్నిస్తే దానిని కుట్రగా భావించే పరిస్థితులు దేశంలోనే ఉత్పన్నమౌతున్నాయి. ఎన్నో ప్రజా సంఘాలు ప్రజల పక్షాన  నిలిచిన వారికి స్వేచ్ఛలేని విధానాలే చూస్తున్నాము. కార్పోరేటు పెట్టుబడి దారీ విధానాలతో ధనవంతులకు మేలు జరిగే ఎజెండాను ఏకపక్షంగా అమలుచేస్తూ, ప్రజా ఆరోగ్యం, వైద్యం, విద్యఉపాధి, నిరుద్యోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగంలో రాసుకున్న ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలన్న మౌళిక నియమా(విలువ)లకు తిలోదకాలివ్వడం ప్రజా ప్రభుత్వాలకు భావ్యమా ! అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల కనీస అవసరాలు తీరక అర్థాకలితో కఠిక దారిధ్య్రంలో, అనారోగ్యాలతో జీవనాన్ని గడుపుతున్న వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగు పడడానికి ఇంకేన్నాళ్లు పడుతుంది ? రాజ్యాంగం ద్వారా డా।। అంబేద్కర్‌ ‌ప్రసాదించిన ఓటుతో పార్టీ(నాయకు)లను మార్చి మార్చి ప్రజలని విసిగెత్తినారు. అందరు వంతుల వారిగా దేశ సంపదను దంచుకు తింటున్నారు. అందరు ఆతాను ముక్కలే ! అందరు ఎర్రగురివింద నీతినే అవలంబిస్తున్నారని ఆవేధన వెళ్లిబుచ్చుతున్నారు. అయినా మనది ఘనమైన స్వతంత్ర దేశం… ప్రజాస్వామ్యంగా వర్థిల్లుతున్న గణతంత్ర దేశంగా పేరొందాంలంటే మేడిపండు విధానాలు మాని సమ్మిళిత అభివృద్ధి, సమసమాజ స్థాపనే ధ్యేయంగా కదలాలి…

భూమి అవసరానికి ఆకాశం అమృత జాలాన్ని వర్షిస్తుంది. సముద్రజలాలు ఆవిరులై, మేఘాలుగా పైకి పయనమైతవి. పరస్పర సహకార జీవన సరళి ప్రవర్తనా శైలికావాలి. శుభ్రంగా లేని పాత్రలో వండిన వంటలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. పాలకులు విధానాల రూపకల్పన అమలు లోపాలతో క్షేత్రస్థాయిలో అసమానతల ఆగాధం పెరిగిపోతుంది. ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు సమంగా పంచబడకపోతే వైశమ్యాలు చెలరేగుతాయి. అదే జరుగితే ఆపడం ఏ సైన్యం వల్లకాదని గత అనుభవాల నుండి తెలుసుకోవాలి. తాను బతకాలంటే… ముందు ప్రకృతి బతకాలనే ఇంగిత జ్ఞానం ప్రతి మనిషిలో ఉండాలి. పాలకుల్లో మరీ ఎక్కువగా ఉండాలి. అందుకే ‘‘పడవ నీటిలో ఉండవచ్చుగానీ, నీరు పడవలో ఉండకూదనే’’ సత్యాన్ని మరువరాదు. ప్రకృతి ద్వారా ఉచితంగా లభించే సంపదలను  పాలకులు వ్యాపారీకరణ చేయడంతో ఆ స్వార్థశక్తుల దోపిడి మూలంగా ప్రకృతి కూడా మహోగ్ర రూపం దాలుస్తుంది. ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తే, ప్రకృతి అంతగా సిరిసంపదలను అందిస్తుంది. దానికి తోడు మానవాళిలో ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. కార్పోరేటు పెట్టుబడి దారులు చేసే విధ్వంసం భవిష్యత్తులోని అనేక తరాలకు శాపంగా మారుతుందని మరువరాదు. విశ్వపరిమాణంలో మనిషి అత్యల్పుడే కావచ్చు… కానీ అతడికి పరిమాణ రహితమైన మనసుంది. మేధ ఉంది. నిజంగా ఆత్మవిశ్వాసంతో సంకల్పిస్తే బాగు చేసుకోవడం సాధ్యమే. నాటి నిస్వార్థ అమరుల త్యాగాలకు సార్థకత చేకూరేలా దృడ సంకల్పం పట్టుదల చిత్తశుద్ధితో ముందుకెళితే  మహమ్మారుల నిర్మూలించగలం. సమసమాజాన్ని ఏర్పరచగలం. పాలకులు స్వార్థం వీడి ప్రజాశ్రేయస్సు కాంక్షిస్తే అసమాన ఆగాధం తొలగిపోతుంది .

మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌ ‌సెల్‌: 9573666650

Leave a Reply