Take a fresh look at your lifestyle.

చీకటి సూర్యులకు రక్షణ ఏది

“నిత్యం మృత్యువుతో పోరాడుతూ భూమిలోని పొరలను చీల్చుతూ విలువైన బొగ్గు గనులను వెలికి తీస్తూ జనజీవనంలో వెలుగులు నింపుతున్న నల్ల కార్మికులకు సమాజమే దాసోహం అని చెప్పవచ్చు. ఉదయం ఇంటి నుండి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తాడో లేదో చెప్పలేము. భూ గర్భం లోకి వెళ్ళినప్పుడు ఏ పెచ్చు ఎటునుంచి మీద పడుతుందో చెప్పలేము, వరద రూపంలో నీరు ఏ క్షణం కబళిస్తుందో ఊహించలేని పరిస్థితి.”

నిత్యం మృత్యువుతో పోరాడుతూ భూమిలోని పొరలను చీల్చుతూ విలువైన బొగ్గు గనులను వెలికి తీస్తూ జనజీవనంలో వెలుగులు నింపుతున్న నల్ల కార్మికులకు సమాజమే దాసోహం అని చెప్పవచ్చు. ఉదయం ఇంటి నుండి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తాడో లేదో చెప్పలేము. భూ గర్భం లోకి వెళ్ళినప్పుడు ఏ పెచ్చు ఎటునుంచి మీద పడుతుందో చెప్పలేము, వరద రూపంలో నీరు ఏ క్షణం కబళిస్తుందో ఊహించలేని పరిస్థితి. వీటికి తోడు దుమ్ము ధూళి వంటి కాలుష్య వాతావరణంలో పనిచేస్తూ తన సగటు ఆయుష్షును తగ్గించుకొని ఇటు ప్రజలకు అటు రాష్ట్ర , దేశ ఆర్థికవ్యవస్థకు జీవం పోస్తున్నాడు గని కార్మికుడు. జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాదపుటంచుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ దేశ రక్షణకోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనేది సత్యం. కార్మికులు తమ కఠోర శ్రమతో భూగర్భంలోంచి బొగ్గును తవ్వితీస్తున్నారు. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల త్యాగాలను, సాధించిన విజయాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం మే4న బొగ్గు కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.

తెలంగాణకు తలమానికం సింగరేణి. సింగరేణి అభివృద్ధికి మూలం వేల మంది కార్మికుల శ్రమ. తెలంగాణ నేలగర్భంలో 10,528 మిలియన్‌ ‌టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికి 1249 మిలియన్‌ ‌టన్నుల బొగ్గును వెలికితీశారు. మరో శతాబ్దకాలం వరకు ఉత్పత్తిని కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి కావడం మన రాష్ట్రానికి గర్వకారణం. సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతో మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల థర్మల్‌ ‌విద్యుత్‌ అవసరాలు తీరుతున్నాయి. ప్రతి సంవత్సరం 600 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో 78.71 శాతం బొగ్గు ద్వారా థర్మల్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్రానికి దేశానికి సింగరేణి విద్యుత్‌ ‌వెలుగులు అందిస్తున్నది.

అయితే, ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కార్మిక రక్షణ తక్కువే అని చెప్పవచ్చు. విదేశాలలోని సౌకర్యాలను పరిశీలనకు వెళ్లే అధికార బృందాలు అక్కడి వసతులు ఇక్కడ కల్పించడంలో విఫలమవుతున్నారు, దీనికి గనులలో తరచుగా సంభవించే ప్రమాదాలే ఉదాహరణ. ఇప్పటికైనా భూగర్భ గని పొరలు కూలిపోకుండా ఇనుప కడ్డీలను చుట్టూ అమర్చడంతో పాటు దాని లోపల జాలిని ఏర్పాటు చెయ్యాలి ఎందుకంటే మన సింగరేణిలోని పైకప్పునకు ఎలాంటి ఆధారం ఉండదు. కేవలం రూఫ్‌బోల్టులపైనే ఆధారపడి ఉండాలి. ఇది ఎక్కడో పని స్థలంలో కాదు. జంక్షన్‌ ఉన్న ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉంది. అందుకే,ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో ఇదే పరిస్థితి. . విదేశీ గనుల్లో ప్రమాదం జరిగి కార్మికుడు మృతి చెందితే ఆ గనిని మూసివేసే చట్టం అక్కడ అమలవుతోంది. అదే విధంగా సంబంధిత గని బాధ్యులపై జైలు శిక్షలు అమలు చేస్తున్నట్లు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన కార్మిక సంఘాల నాయకులే వెల్లడించారు.

కానీ ఇక్కడ మాత్రం కార్మికుల భద్రతను గాలికి వదిలేసి బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తున్న యాజమాన్యంపై మాత్రం ఒత్తిడి తీసుకురాలేక పోతున్నారు. పోలండ్‌లోని భూగర్భ బొగ్గుగనుల్లో,కార్మికులు మ్యాన్‌రైడింగ్‌ ‌ద్వారా ఉపరితలానికి చేరుకోవడానికి ఏర్పాటు చేసిన జంక్షన్‌ ‌విశాలంగా ఉన్న ప్రాంతంలో మ్యాన్‌రైడింగ్‌ ‌వరకు చేరుకుని కార్మికులు అందులో ఎక్కి ఉపరితలానికి చేరుకుంటారు. ఇక్కడ ఇరుకుగా ఉన్న ప్రాంతంలో మ్యాన్‌రైడింగ్‌ ‌జంక్షన్‌ ఏర్పాటు చేస్తారు. కార్మికులు దానిలోకి ఎక్కాలంటే ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ రావాల్సిందే. విశాలమైన ప్రాంతం ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు అసౌకర్యంగానే ఇక్కడికి చేరుకుంటారు. విదేశాలలోని గనులలో ఉన్న క్యాంటిన్‌ ‌లకు ఇక్కడి క్యాంటిన్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది, అల్పాహారం, నీరు ఇతర సౌకర్యాల విషయంలో కూడా మనం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది.

వీటితో పాటు వీరి సమస్యలైన గనుల ప్రయివేటీకరణ, డిపెండెంట్‌ ‌జాబ్స్, ఉద్యోగ భద్రత, లాభాలలో గరిష్ట వాటా వంటి సమస్యలను పరిష్కరించాలి.బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు నల్లబంగారాన్ని వెలికితీస్తూ గొప్ప సంపదను సృష్టిస్తున్న కార్మికలోకాన్నీ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాద్యత అటు యాజమాన్యాలపై, ఇటు ప్రభుత్వాలపై ఉంది.

Leave a Reply