Take a fresh look at your lifestyle.

అపరిమితమైన స్వేచ్ఛ ఎవరికీ లేదు

జర్నలిస్టులకు సాధారణ పౌరులకు ఉండే స్వేచ్చే ఉంది, అంతకు మించి అపరిమితమైన స్వేచ్ఛ లేదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌జోసెఫ్‌ ‌స్పష్టం చేశారు. ప్రైవేటు టెలివిజన్‌ ‌చానల్స్ ‌లో ప్రసారం చేసే టీవీ షోలలో ప్రత్యేకంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలను ప్రసారం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రైవేటు టెలివిజన్‌ ‌చానల్‌ ‌లో యూపీఎస్సీ ప్రసారం చేసిన ‘ జిహాద్‌ ‘‌షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ ‌ను పురస్కరించుకుని ఆయన ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉత్తరాదినే కాదు., దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో టెలివిజన్‌ ‌చానల్స్ ‌కొందరిని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా, ఉగ్రవాదం విషయంలో ఒక మతాన్నీ, వర్గాన్ని లక్ష్యం చేసుకోవడం సరికాదని జస్టిస్‌ ‌జోసెఫ్‌ ‌స్పష్టం చేశారు. తమకు నచ్చని, లేదా ప్రత్యర్ధులు ప్రాతినిధ్యం వహించే కార్యక్రమాలపై బురదజల్లడం సరికాదని కూడా స్పష్టం చేశారు. తెలుగునాట టెలివిజన్‌ ‌చానల్స్ ‌మధ్య పోటీ ఎక్కువ కావడంతో వర్గాల వారీగా ప్రసార సాధనాలు పునరేకీకరణ అయ్యాయి. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, వర్గ ప్రయోజనాల కోసం ఆ ప్రసార సాధనాలు నిరంతరం అవే అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వార్త ప్రామాణికతను గురించి ఆలోచించకుండా, వార్త విశ్వసనీయతను సరిచూసుకోకుండా ప్రసారం చేస్తున్నాయి. బాలీవుడ్‌ ‌లో డ్రగ్స్ ‌కలకలం కూడా ఆ కోవకు చెందినదే. బాలీవుడ్‌ ‌లో డ్రగ్స్ ‌సంచలనం కొత్త వార్త కాదు.అయినప్పటికీ, ఇద్దరు వ్యక్తులను, లేదా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని వార్తలు అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. అవినీతి కుంభకోణాల విషయంలోనూ అంతే,.రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడటానికి బదులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఈ నేపధ్యంలో ప్రజా ప్రయోజనాలు, సమస్యలు వెనక్కి వెళ్తున్నాయి. జస్టిస్‌ ‌జోసెఫ్‌ ‌చేసిన వ్యాఖ్యల సారాంశం ఇదే. ఏ ఒక్క వర్గాన్నీ టార్గెట్‌ ‌చేసుకుని ప్రసారాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. అమెరికాలో మాదిరిగా జర్నలిస్టులకు ప్రత్యేక స్వేచ్ఛ మన దేశంలో లేదని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్యాప్తులో ఒక కోణం గురించే మీడియా తరచూ ప్రసారం చేస్తోందనీ, సంఘటన పూర్వాపరాలతో పాటు రెండు పార్శ్వాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ప్రసారసాధనాలపై ఉందని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్‌ ‌మీడియా ప్రమాణాలను నిర్దేశించేందుకు ఐదుగురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ధర్నాసనం సూచించింది. సమాజ హితమే వార్తా ప్రసార, ప్రచార సాధనాల లక్ష్యం కావాలనీ, ఏ ఒక్క వర్గాన్నీ కించపర్చడం కానీ, వాటిపై బురద జల్లడం కానీ లక్ష్యంగా పెట్టుకోరాదని బెంచ్‌ ‌స్పష్టం చేసింది. వార్తా ప్రసార సాధనాలు స్వయం నియంత్రణ పాటించాలని కూడా సూచించింది. సమాజంలో వివిధ వర్గాల ప్రజలు సామరస్యంతో జీవించే వాతావరణానికి ఎవరు భంగం కలిగించినా అది సహించరాని విషయమేనని స్పష్టం చేసింది. అయితే, జర్నలిస్టులకు ప్రమాణాలు, మార్గదర్శకాలు మాత్రమే ఉంటాయనీ, స్వయం నియంత్రణతోనే వార్తా విశ్లేషణలు జరగాలని సుప్రీంకోర్టు బెంచ్‌ ‌పేర్కొంది. తెలుగులోనే కాకుండా, వివిధ భాషల్లో చానల్స్ ‌చేసే ప్రసారాల్లో సమాజ హితం కన్నా, ఆయా వర్గాల ప్రయోజనాలే ఎక్కువ గా ఉంటున్నాయి. బాలీవుడ్‌ ‌నటుడు సుశాంత్‌ ‌సింగ్‌ ‌రాజ్‌ ‌పుత్‌ ఆత్మహత్య తర్వాత మీడియా కనబరుస్తున్న అత్యుత్సాహం కూడా అటువంటిదే.

చానల్స్ ‌రేటింగ్‌ ‌పెంచుకోవడానికి వార్తా కథనాల ప్రసారం హద్దులు మీరుతోందన్న ఆరోపణలు ఇప్పటికే వొచ్చాయి. బాలీవుడ్‌ ‌నటి కంగనా రనౌత్‌, ‌మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, చివరికి ముంబాయిలో ఆమె కార్యాలయాన్ని కూల్చడానికి దారి తీసింది. ఆమె కూడా కొంత అతిని ప్రదర్శిస్తున్నారు. బాలీవుడ్‌ ‌లో కొందరికి డ్రగ్స్ అలవాటు ఉన్న మాట పాత విషయమే, కానీ, ఆమె ఎవరినో లక్ష్యంగా చేసుకుని మొత్తం అందరిపైనా బురద జల్లే ప్రయత్నం చేయడం వల్ల ఆవేశకావేశాలు పెరిగి ఆమె కార్యాలయాన్ని నేలమట్టం చేసే స్థితికి చేరుకున్నాయి. ఇలాంటి దురదృష్టకర సంఘటనలను ఖండించాల్సిందే. న్యాయస్థానాలు ఇలాంటి సందర్భాల్లో చొరవ తీసుకుని ఏది సమాజ హితమో దానిని గురించి స్పష్టం చేస్తుంటాయి. కులం, మతం, ప్రాంత విభేదాలను రెచ్చగొట్టే ధోరణులను అణచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాలు విఫలమైతే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి.ఇప్పుడే కాదు, గతంలో కూడా న్యాయస్థానాలు ప్రజా పక్షం వైపు నిలిచి తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నాయి. ఒక సామాజిక వర్గం సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌లోకి చొచ్చుకుని వస్తోందంటూ ఒక టెలివిజన్‌ ‌షోలో ఒక యాంకర్‌ ‌చేసిన వ్యాఖ్యపై పిటిషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అభ్యంతరకరమైనదేనని జస్టిస్‌ ‌చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌జోసెప్‌ ‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కులాలు, మతాలు ఇప్పుడు రాజకీయ నాయకుల బహిరంగ ప్రసంగాల్లో, ఆరోపణల్లో ప్రధాన అంశాలు అవుతున్నాయి. టీవీ షోల్లో చర్చల్లో పాల్గొనే వారు కూడా సంయమనాన్ని కోల్పోయి వర్గ, కుల,మత ప్రాతిపదికపై వ్యాఖ్యలు చేయడం ఈ మధ్య కాలంలో అలవాటైంది. ఇలాంటి ధోరణులను దృష్టిలో ఉంచుకునే ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానిపై విశ్లేషణ చేసేటప్పుడు వర్గ వైషమ్యాలకు తావు లేకుండా చూసుకోవల్సిన బాధ్యత టీవీ షోలను నిర్వహించేవారిపైనే కాకుండా, వాటిల్లో పాల్గొనే వారిపై కూడా ఉందన్న ధర్మాసనం స్పష్టీకరణలో నిజం ఎంతో ఉంది.

Leave a Reply