Take a fresh look at your lifestyle.

తెలంగాణలో బిజేపి బలపడకుండా ఎవరూ ఆపలేరు

  • కాశ్మీర్‌లో బలవంతపు మత మార్పిడులు తప్పు
  • ఎన్నికల తర్వాత వెస్ట్ ‌బెంగాల్లో 7 వేల మంది మహిళపై దాడులు ..
  • మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి.

తెలంగాణలో బిజేపి బలోపేతం కావటానికి చేపడుతున్న చర్యల్ని ఎవరూ ఆపలేరని కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఆ దిశలో రోజు రోజుకు పార్టీ బలపడుతుందన్నారు. తెలంగాణలో తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. బాధపడ్డా, కాదన్నా రాష్ట్రంలో తాము చేపట్టిన చర్యలను ఎవరూ ఆపలేరన్నారు. మంగళవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన తెలంగాణతో పాటు, జమ్మూ కాశ్మీర్‌, ‌వెస్ట్ ‌బెంగాల్‌లకు చెందిన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.

జమ్మూ కాశ్మీర్‌లో మహిళలకు రక్షణ కల్పిస్తామనీ..జమ్మూ కాశ్మీర్‌లో కొంత మంది సంఘ విద్రోహ శక్తులు మహిళలను కిడ్నాప్‌ ‌చేసి, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నట్లు తనకు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. సిక్కు మహిళలను తుపాకులతో బెదిరించి, బలవంతపు మత మార్పిడిలు చేస్తున్నట్లుగా కిషన్‌ ‌రెడ్డి మీడియాకి చెప్పారు. వారికి రక్షణ కల్పిస్తామని మంత్రి కిషన్‌ ‌రెడ్డి భరోసా ఇస్తూ కేంద్రం, జమ్మూ కాశ్మీర్‌ ‌ప్రభుత్వాలు సిక్కు అమ్మాయిలపై జరుగుతున్న మత మార్పిడుల నుంచి రక్షణ కల్పించే విషయంలో అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం అన్ని విధాల చర్యలు చేపడుతుందన్నారు. గతంలో కాశ్మీర్‌ ‌పండితులపై కూడా ఇలాంటి దాడులే జరిగాయని, దీంతో లక్షలాది మంది పండితులు లోయ వదిలి వెళ్లిపోయారన్నారు. కానీ, సిక్కు సమాజం సున్నితమైన పాక్‌ ‌సరిహద్దుల్లో విద్రోహ శక్తుల దుర్మార్గాలను ఎదుర్కుంటూ నిలిచిందన్నారు. ఇప్పటికీ వారిని భయాందోళనకు గురి చేసేందుకు బలవంతపు మతమార్పిడి చేస్తున్నారని అన్నారు. అయినా సిక్కు సమాజం ఈ దాడులను తిప్పి కొడుతుందని మంత్రి ప్రకటించారు.

కాశ్మీర్‌ ‌మహిళలకు రక్షణ కల్పిస్తామని ప్రకటనలు చేసిన అనంతరం బెంగాల్‌ ‌మీద మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకు పడ్డారు. ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ ‌బెంగాల్లో, ఏడు వేల మంది మహిళలపై రాజకీయ దాడులు జరగడం ఏ మాత్రం సమంజసం కాదని మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. వెస్ట్ ‌బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుమారు 15 వేల హింసాత్మక సంఘటనలు జరిగినట్లు ‘కాల్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌’ అనే సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. 16 జిల్లాల్లో దాదాపు 25 మంది చనిపోయినట్లు, ఏడు వేల మంది మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. మాజీ న్యాయమూర్తులు, మాజీ డీజీపీలు, మాజీ సీఎస్‌లు, ప్రముఖులతో కూడిన ఈ సంస్థ ఈ నివేదికను సిద్ధం చేసిందన్నారు. వందలాది గ్రామాల్లో, వేలాది మంది గ్రామస్తులను కలిసిన ‘కాల్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌’ ‌బృందం… వీడియోలతో సహా కేంద్రానికి సమగ్రమైన నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఈ నివేదికను కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షాకు అందించనున్నట్లు తెలిపారు.

ఈ హింసాత్మక ఘటనలపై కేంద్రం చట్టపరంగా, రాజ్యాంగ బద్ధమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారంలోకి వొచ్చిన టీఎంసీకి వోటు వేయని వారిని టార్గెట్‌ ‌చేసి దాడులు చేశారని ఆరోపించారు. దళితులు, మహిళలు, పేదలైన వారిని గుర్తించి అత్యాచారం, ఇండ్లను తగలబెట్టడం, తాగు నీరు నిలిపేయడం వంటి దుర్మార్గాలు చేస్తున్నట్టు నివేదికలో ఉన్నట్లు కిషన్‌ ‌రెడ్డి మీడియాకి తెలిపారు. చివరకు కేంద్రం పేదలకు అందించే బియ్యాన్ని కూడా రాజకీయ దృక్పథంతో అడ్డుకోవడం న్యాయం కాదన్నారు. ఈ ఘటనలతో చాలా మంది సొంత ఇండ్లు, గ్రామాలను వదిలి అస్సాం, జార్ఖండ్‌, ఒడిషాకు వలస వెళ్లారన్నారు. వివిధ క్యాంపుల్లో శరనార్థులుగా ఉంటున్నట్లు తెలిపారు. సిఎంగా మమత ప్రజలకు ధైర్యం కల్పించే దిశలో, నిష్ఫక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. ఆ ప్రయత్నం గవర్నర్‌ ‌చేస్తే, గవర్నర్‌ని కూడా ఆమె టార్గెట్‌ ‌చేశారన్నారు. గవర్నర్‌ని అనేక రకాలుగా అవమానించారని..గవర్నర్‌కి వ్యతిరేకంగా మమత విష ప్రచారం చేస్తున్నట్లు మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు.

Leave a Reply