- పంపిణీలో తెలంగాణ ముందంజ
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
- చార్మినార్ యునాని హాస్పిటల్‌లో బూస్టర్ డోసు పంపిణీ
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి : కొరోనా టీకా విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. టీకా పంపిణీలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. సోమవారం చార్మినార్ యునాని దవాఖానాలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో కలసి హరీష్ రావు బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిరీకీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నదనీ, మొదటి డోస్ సమయంలో ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తోడ్పాడు అందించారని చెప్పారు. టీనేజర్లకు కేవలం వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోసు పూర్తయిందని చెప్పారు. ముందుగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు వేస్తున్నామనీ, గతంలో తీసుకున్న వారికి అదే రిజిస్ట్రేషన్‌తో టీకా వేస్తున్నట్లు చెప్పారు.
రెండో డోసు తీసుకున్న 9 నెలలు పూర్తయిన వారితో పాటు 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారంతా బూస్టర్ డోసు తీసుకోవాలన్నారు. యునానీ హాస్పిటల్‌లో నెలకొన్న సమస్యలపై చర్చించామనీ త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిధుల అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామనీ, త్వరితగతిన మంజూరయ్యేందుకు కృషి చేస్తామన్నారు. హాస్పిటల్‌లో ఖాళీలను పూరించేందుకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రోగులకు ఇక్కడే సేవలు అందించాలనీ, తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఉస్మానియాకు రిఫర్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ముందంజలో ఉన్న వైద్యారోగ్య శాఖకు అభినందనలు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలనీ, దాంతో పాటు టీకా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగానిర్వహిస్తున్నామనీ, మొదటి డోసుకు సహకరించిన విధంగానే ప్రజాప్రతినిధులు రెండో డోసు వేయించడంలో సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కోరారు.