Take a fresh look at your lifestyle.

ఉపశమన చర్యలు లేవు… ఊరడింపులు మాత్రమే

కొరోనా నేపథ్యంలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయింది. ఇలాంటి సమయంలో తమను ఆదుకోవడానికి కేంద్రం ఉపశమన చర్యలను ప్రకటిస్తుందేమోనని అంతా ఎదురు చూశారు. వస్తు సేవా పన్ను(జిఎస్‌టి) మండలి 41వ సమావేశాన్ని ఆ ఊసే లేకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అయిందని అనిపించేసారు. పేదలకు మేలు చేసే నిర్ణయాలు ఒక్కటి కూడా లేవు. సామాన్యులపై  పెట్రోల్‌ ‌భారం రోజురోజుకీ పెరుగుతోంది. దానిని గురించి అసలు పట్టించుకోలేదు. జిఎస్‌టి బకాయిల గురించి రాష్ట్రాల అభ్యర్థన అరణ్య రోదన అయింది. పేదలు, మధ్యతరగతి ప్రజల  ప్రయోజనాల కంటే బడా పారిశ్రామిక వేత్తలు, వారికి  అందాల్సిన పెట్టుబడులు, ఇతర సదుపాయాల గురించి చర్చించేందుకే ఈ సమావేశంలో   ఎక్కువ సమయాన్ని కేటాయించినట్టుగా కనిపిస్తోంది. లాక్‌ ‌డౌన్‌లు విధించిన కేంద్రం మొక్కుబడిగా ప్యాకేజీలను ప్రకటించినా వాటి ఫలితాలు పేదలకు అందలేదు. ప్రభుత్వ పథకాల సొమ్ము ప్రతిసారీ ఎక్కడికి చేరుతోందో ప్యాకేజీల సొమ్ము  అక్కడికే చేరుతోంది. ఈ ప్యాకేజీల  అమలుపై పర్యవేక్షణ లేదు.  క్షేత్ర స్థాయిలో  సాధారణ ప్రజలకు  ఉపశమనం కల్పించాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి పెట్టలేదు. రాష్ట్రాలేమో కేంద్రం వైపు, కేంద్రమేమో రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం.

తెలంగాణకు జిఎస్‌టి పరిహారం కింద 5,420 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కనీసం 2,700 కోట్లయినా ఇవ్వండని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్‌ ‌రావు కేంద్ర మంత్రిని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీతోనే రాష్ట్రాలు జిఎస్‌టి పరిధిలో చేరాయనీ, దీంతో  60 నుంచి 70 శాతం ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోయాయని ఆయన గుర్తు చేశారు. జిఎస్‌టి ఆదాయంలో లోటు ఏర్పడితే రాష్ట్రాలకు ఏదో విధంగా సర్దుబాటు చేస్తామన్న కేంద్రం హామీని కూడా ఆయన గుర్తు చేశారు. ఇంతవరకూ తెలంగాణ రాష్ట్రం జిఎస్‌టి రూపంలో కేంద్రానికి 18,032 కోట్లు చెల్లించగా, రాష్ట్రానికి ఈ పద్దులో కేంద్రం నుంచి వచ్చింది మూడు వేల కోట్లు మాత్రమేనని కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తెచ్చారు. అయితే, కేంద్ర మంత్రి ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తే, వైపరీత్యాలు సంభవించినప్పుడు తగ్గే ఆదాయనికి పరిహారం ఈ పద్దు కింద చెల్లించడం కుదరదని స్పష్టం చేశారు. కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వైపరీత్యాలు సంభవించినప్పుడు వివిధ రంగాలకు వాటిల్లిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయకపోయినా, ఎంతో కొంత సాయాన్ని అందించాలన్నది దశాబ్దాలుగా పాటిస్తున్న సూత్రం. అయితే, మోడీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గత రెండు మాసాలుగా పెట్రోలియం ఉత్పత్తుల ధరల ప్రభావం కూడా ప్రజలపై తీవ్రంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో  ముడి చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గతంలో పదిహేను రోజులకో, నెలకో ఒకే సారి పెంచే వారు.ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ ‌ధరలతో లింక్‌ ‌పేరిట రోజుకి పది నుంచి 90 పైసల వరకూ పెట్రోల్‌, ‌డీజెల్‌పై ధరలు పెంచుతున్నారు. కొరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసే ఉద్యోగులు తమ ఆఫీసులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనాలే  దిక్కు. ఆఫీసర్లు, కంపెనీల యజమానులకు తప్ప మామూలు వారికి కార్లు ఉండవు. అలాగే, శివారు ప్రాంతాల్లో సొంత ఇళ్ళల్లో ఉండి మహానగరాలకు ఉద్యోగాల కోసం వచ్చే ఉద్యోగుల ప్రయాణాలపై ఇప్పుడు అదనపు భారం పడుతోంది. ప్రైవేటు యాజమాన్యాలు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. వారిపై  ప్రభుత్వ శాఖలకు అదుపు లేదు. పేద, మధ్య తరగతి వేతన జీవుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. పెట్రోలియం ఉత్పత్తులపై ధరల గురించి ఈ సమావేశంలో చర్చించి స్థూలంగా నిర్ణయం తీసుకుంటారేమోననుకున్న వారికి నిరాశ ఎదురైంది. కేంద్రం, రాష్ట్రాలూ ఎవరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు ప్రతిపాదనలూ, సూచనలు చేశారు. కేంద్ర మంత్రి రాష్ట్రాలకు చేసిన సూచన ఏదంటే అవసరమైతే రిజర్వు బ్యాంకు నుంచి అదనంగా రుణాలు తీసుకోమని. రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు అంత తేలిగ్గా లభించవని కేంద్ర మంత్రికి తెలియవని అనుకోలేం. కొరోనా వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా  క్షీణించాయి. పారిశ్రామికవేత్తల ప్రయోజనాల గురించే కేంద్ర మంత్రి ఎక్కువగా మాట్లాడారు. వారి వల్లనే ఉపాధి లభిస్తోందన్నది పరోక్షంగా ఆమె చెప్పిన మాటల సారాంశం.

కొరోనా కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలు  దృష్టిని కేంద్రీకరించాయి. మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఆ పని మీదే మనసు లగ్నం చేశారు. రెవిన్యూ శాఖ అవినితిలో కూరుకుని పోయింది. పౌర సరఫరాల శాఖపై ఉన్నతాధికారులకు అజమాయిషీ లేదు. కేంద్రం పంపే బియ్యం నిల్వలు ఇతర రాష్ట్రాల దారి పడుతున్నాయి. రాష్ట్రాల సరిహద్దులలో ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం నిల్వలు పట్టుబడినట్టు వార్తలు ఇటీవల తరచూ వస్తున్నాయి. దీనిపై తదుపరి చర్యలు లేవు. దీనికి తోడు రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోంది. వీటిపై  పోలీసులు, ఇతర అధికారులు దృష్టిని  కేంద్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులు, పేద ప్రజల  గోడును పట్టించుకునేదెవరు.  కొరోనా వల్ల ప్రజలు పనులు మానుకుని ఇప్పటికే ఇళ్ళకు పరిమితం అవుతున్నారు. ఉపాధి, ఉద్యోగాలకు ఇప్పుడిప్పుడే హాజరవుతున్నారు. గడిచిన రెండు మాసాలుపైగా కూర్చుని తినడం వల్ల అప్పుల భారం పెరిగిపోయి, రుణాలిచ్చిన వారి నుంచి ఒత్తిళ్ళు పెరిగిపోవడంతో వాటిని తట్టుకోలేక సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రిజర్వు బ్యాంకు వద్ద రుణాలు తీసుకోమన్నారు. మంచిదే, కానీ, రాష్ట్రాలు ఇప్పటికే పరిమితులకు మించి రుణాలు తీసుకున్నాయి. వీటిని ఎలా సర్దుబాటు చేస్తారు. ఈ విషయం ఆర్థిక మంత్రికి తెలుసు. అయినప్పటికీ రాష్ట్రాల అభ్యర్దనకు ఏదో సమాధానం చెప్పాలి కనుక చెప్పినట్టున్నారు. ఈ పరిస్థితులలో  సామాన్యుల గోడును ఆ దేవుడే పట్టించుకోవాలి.

Leave a Reply