ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ: మూడేండ్లలో ఆంధ్రాకి మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అని స్పష్టం చేసింది కేంద్రం. దేశంలో గత మూడేండ్లలో మొత్తం 90 నూతన మెడికల్ కళాశాలల ఏర్పాటు జరిగిందని కేందప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో భాగంగా 60ః40 నిష్పత్తిలో మూడు దశల్లో 157 నూతన మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. అందులో 3 కాలేజీలు ఆంధప్రదేశ్‌లో ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కే.ఆర్ సురేశ్ రెడ్డి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అంతేగాక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 562 మెడికల్ కాలేజీలు ఉన్నాయని మంత్రి డా.హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో 31, తెలంగాణలో 34 మెడికల్ కాలేజీలు ఉన్నాయని వివరించారు. అత్యధికంగా కర్ణాటకలో 61, మహారాష్ట్రలో 60 మెడికల్ కాలేజీలు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర ప్రాయోజిత పథకం మూడో దశలో భాగంగా ఆంధప్రదేశ్‌లో పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంల్లో ఒక్కొక్క కళాశాలకు 325 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో మంజూరు చేశామన్నారు. అయితే ఇందులో ఒక్కొక్క కళాశాల వ్యయంలో 195 కోట్ల రూపాయలు కేంద్ర వాటా అని మంత్రి డా.హర్షవర్ధన్ వెల్లడించారు.
ధాన్య సేకరణ కేంద్రాలను మూసి వేయటం లేదు
తెలంగాణలో ధాన్య సేకరణ కేంద్రాలను మూసి వేయటం లేదు అని కేంద్రం స్పష్టం చేసింది.ఇటీవల తెలంగాణలో ధాన్య సేకరణ కేంద్రాలను మూసివేస్తున్నారు అంటూ వివాదాస్పదమైన అంశంపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. తెలంగాణలో ధాన్య సేకరణ కేంద్రాలు మూసివేస్తున్నట్టు రాష్టప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. తెలంగాణలోని ఐకెపి స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహిస్తున్న సేకరణ కేంద్రాల ద్వారా 2020-21 ఖరీఫ్ సీజన్లో సుమారు 8.84 లక్షలమంది రైతుల నుంచి 4.75 కోట్ల క్వింటాళ్ళ ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ కేంద్రాలు మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా… నూతన వ్యవసాయ చట్టాల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందా అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైతులు కనీస మద్దతు ధర కంటే మంచి ధర ఎక్కడైనా లభిస్తే అక్కడ తమ పంటను అమ్ముకొనే అవకాశం ఉందని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టంచేశారు.