Take a fresh look at your lifestyle.

నాలుగు నెలల దాకా పెళ్లిళ్లు లేనట్లే

  • మళ్లీ మే మాసంలోనే మంచి రోజులు
  • మరో వారంలో ముగియనున్న పెళ్లిళ్ల సీజన్‌
  • ‌గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి వెనువెంటనే రావడమే కారణం

‌కొత్త సంవత్సరం వచ్చిందని యువత కేరింతలు కొడుతున్న వేళ….ఈ ఏడాది వివాహాలకు శుభ ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్న మాటలు పెళ్లీడుకొచ్చిన వారికి నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. మరో వారంలో పెళ్లిళ్ల సీజన్‌ ‌ముగియనుండగా, పెళ్లి పీటలు ఎక్కాలంటే మరో 4 నెలలు వేచి ఉండక తప్పదని సిద్ధాంతులు పేర్కొంటున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి కూడా వెంటవెంటనే రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేస్తున్నారు. పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈనెల 8 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలున్నాయి. ఆ తరువాత మే నెల వరకూ పెళ్లి చేసుకోవాలనుకుంటే వేచి ఉండక తప్పదని పేర్కొంటున్నారు.

మే 14న బలమైన ముహూర్తం
ఈనెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడనుంది. తిరిగి ఈ ఏడాది మే 14న మాత్రమే మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌ ‌ప్రారంభం కానుందనీ, జనవరి 14న ప్రారంభమైన శూన్య మాసం ఫిబ్రవరి నెల 12 వరకూ కొనసాగుతుంది. శూన్య మాసం అసలు ఎలాంటి శుభ కార్యాలకు పనికి రాదనీ ముఖ్యమంగా వివాహాలకు ఈ మాసం అసలు మంచిది కాదని పండితులు పేర్కొంటున్నారు. గత నెల 15న గురు మౌఢ్యమి ప్రారంభం కాగా, అది సుమారు నెల రోజుల పాటు కొనసాగి అంటే ఫిబ్రవరి 12తో అంటే దాదాపు నెల రోజులకు ముగుస్తుంది.

pelli muhurham

- Advertisement -

ఈ నెల రోజుల పాటు ఎలాంటి వివాహాలు జరగడానికి శాస్త్రం వొప్పుకోదని పేర్కొంటున్నారు. అలాగే, ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ తదియ నుంచి మొదలుకుని మే నెల 4వ తేదీ అష్టమి వరకూ అంటే దాదాపు 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి కొనసాగుతుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తరువాత శుభ దినాలు ప్రారంభం అవుతున్నప్పటికీ 10 రోజుల పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని పేర్కొంటున్నారు. ఆ తరువాత మళ్లీ మంచి ముహూర్తం కావాలంటే మే నెల 14 వరకు ఆగక తప్పదని స్పష్టం చేస్తున్నారు.

జూలై 4 నుంచి ఆషాఢం ప్రారంభం
ఈ ఏడాది 14 తరువాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజులు మాత్రమేనని పండితులు చెబుతున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు నెల 11తో ముగియనుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు శుభ ముహూర్తాలు లేవని పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడాది అంటే 2021లో వివాహాలకు బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉందని అంటున్నారు. ఇన్నాళ్లు కోవిడ్‌ ‌మూలంగా యువతీయువకులు వివాహ శుభ ఘడియలకు దూరం కాగా, ఆ పరిస్థితి సద్దుమణికి కాస్త ఉపశమనం కలిగిన వేళ మంచి ముహూర్తాలు లేకపోవడం వారిని నిరాశకు గురి చేస్తున్నది.

రెండు మూఢాలు రావడం అరుదు : ఏవీ నరసింహాచార్యులు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి రెండూ కలసి రావడం చాలా అరుదుగా జరుగుతుందనీ, ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడానికి అంత మంచి రోజులు కావని కదిరి ఖాద్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఏవీ నరసింహాచార్యులు పేర్కొన్నారు. చెడు జరుగుతుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేని కారణంగా ఈ రోజుల్లో పెళ్లిళ్లు జరిపించవచ్చని కొందరు సిద్ధాంతులు చెబుతున్నప్పటికీ జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం కాబట్టి మంచి ముహూర్తంలో చేసుకోవడమే శ్రేయస్కరమని ఆయన స్పష్టం చేశారు.

వివాహ శుభ ముహూర్తాల రోజుల్లోనే మూఢాలు: ఉమామహేశ్వర సిద్ధాంతి
ప్రతీ ఏడాది వివాహాలు జరుపుకోవడానికి శుభ ముహూర్తాలు ఉండే మాసాల్లోనే ఈ యేడాది మూఢాలు వచ్చాయనీ, ఈ కారణంగా పెళ్లిళ్లకు మంచి రోజులు చాలా తక్కువగా వచ్చాయని ప్రముఖ సిద్ధాంతి ఉమామహేశ్వర శర్మ పేర్కొన్నారు. సాధారణంగా మాఘ, ఫాల్గుణ, చైత్ర మాసాలు వివాహాది శుభ కార్యాలకు అత్యంత అనువైన నెలలనీ, ఈ నెలల్లో వివాహ శుభ కార్యాలకు ఎక్కువగా మంచి రోజుల ఉంటాయన్నారు. అయితే ఈనెలల్లోనే వరుసగా గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి వచ్చిన కారణంగా వివాహాలకు కొద్ది రోజులు మాత్రమే అవకాశం దొరికిందని ఆయన వివరించారు.

Leave a Reply