Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌లు వద్దు … కొరోనా నియమ నిబంధనలే ముద్దు

(తొలి లాక్‌డౌన్‌ ‌విధించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా)
25 మార్చి 2020న తొలి కరోనా లాక్‌డౌన్‌ను భారత కేంద్ర ప్రభుత్వం విధించిన కల్లోల అకాలాన్ని మనందరం ఇంకా మరిచిపోలేదు. కరోనా విజృంభనను అరికట్టే ప్రయత్నంలో భాగంగా మన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన లాక్‌డౌన్‌ ‌ప్రకటనను అన్ని వర్గాల ప్రజలు అంగీకరించి లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా విజయవంతం చేశారు. అధిక జనాభా కలిగిన భారత్‌లో కోవిడ్‌-19 ‌ప్రళయంలో లక్షల, కోట్ల మరణాలు జరుగవచ్చని నిపుణులు చేసిన అంచనాలను ప్రజలు వమ్ముచేయడం హర్షదాయకం. కరోనా కట్టడికి ఎలాంటి ఆయుధాలు/ఔషధాలు లేని దయనీయ నిస్సహాయ స్థితిని ప్రపంచం అనుభవించింది.

నేడు డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, మైక్రోబయాలజిస్టులు, వైరాలజిస్టులు మరియు ఇతర నిపుణులు పటిస్తున్న ఏకైక మంత్రంగా అర్హులు టీకా తీసుకోవడం, సామాజిక దూరాలు, మాస్కుల ధారణలు, సానిటైజర్ల వినియోగాలు, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం లాంటి కొరోనా నియమనిబంధనలను మాత్రమే జపించడం చూస్తున్నాం. పిపిఈ కిట్లు, ఐసియు సౌకర్యాలు, వెంటిలేటర్లు, ఫేస్‌ ‌మాస్కులు, ఆక్సీజన్‌ ‌కొరత లాంటి అత్యవసరాల కొరత మనల్ని ఎంతగానో కలవరపరిచింది. భారత్‌లో ప్రభుత్వాలు, సంస్థలు, సంఘాల చొరవతో పిపిఈ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లు మరియు టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి చేరడం సంతోషదాయకం. కనీసం 70 శాతం మంది మాస్కులు వాడినా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలుస్తున్నది. ఇండియాలోని హైదరాబాద్‌? ‌లాంటి మహానగరాల్లో 50 శాతానికి పైగా ప్రజలు వ్యాధినిరోధకశక్తిని పొంది ‘హెర్డ్ఇమ్యూనిటీ’ సాధించే దశకు చేరువైనారని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.

కొరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు పరిష్కారంకాదని, కరోనా విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ, జనజీవనం సాగేలా, ప్రగతి రథం కదిలేలా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. టీకాలు తీసుకోవడం, కరోనా జీవనశైలిని పాటించడం, కరోనాతో సహజీవనం చేయడం మనకు అలవాటు కావాలి. మహమ్మారి వైరస్‌ ‌మన మధ్యనే ఉంటుంది. మనం తీసుకోవలసిన జాగ్రత్తల్ని మనమే తీసుకుంటూ, కరోనాకు తగిన గుణపాఠం నేర్పాలి. మన దేశంలో దాదాపు 99 శాతం ప్రజలకు మాస్కుల ఉపయోగం తెలిసినప్పటికీ 44 శాతం మంది మాత్రమే వాడుతున్నారని తేలింది. ఆస్ట్రేలియాలో ఒక చదరపు కిమీకు జనసాంద్రత 3.3 మరియు న్యూజిలాండ్‌ ‌జనసాంద్రత 18 ఉన్నందున లాక్‌డౌన్‌ ‌మరియు సామాజిక దూరాలతో కట్టడి చేయడంలో ఆ దేశాలు సఫలం అవుతున్నారు. ఇండియాలోని న్యూఢిల్లీ గాంధీనగర్‌లో జనసాంద్రత 89,185 మరియు ముంబాయి మురికివాడ ధారవిలో 2 లక్షల జనసాంద్రత ఉన్నది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా కట్టడి సమస్యగా మారుతున్నది.

అగ్రదేశాల్లో ట్రిలియన్‌ ‌డాలర్ల ప్రభుత్వ సహాయం, ఉద్యోగులు వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఉద్యోగ ఉపాధుల్లోనే కాకుండా వేతనాల్లో కూడా భారీ కోతలు, పని దొరక్క పోవడంతో కరోనా మరణాల కన్న ఆకలి చావులు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. గత సంవత్సరం కొన్ని మాసాల్లో బెంగుళూరు నగరంలో 24 శాతం కరోనా పరీక్షలు పాజిటివ్‌ ‌రావడం జరిగింది. ఈ అయోమయ స్థితిలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌నిర్ణయం తీసుకోవడం జరిగింది. లాక్‌డౌన్‌తో ప్రజానీకం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్‌ ‌కాలంలో కుటుంబ సంబంధాలు, పోషకాహార లభ్యత, వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌తో వృద్ధుల పట్ల ఆదరణ లాంటివి బలపడ్డాయని సంబుర పడడం ఓ వైపు గృహ హింస, ఆర్థిక సమస్యలు, విడాకులు మరియు మానసిక అనారోగ్యాలు మరో వైపు బయట పడ్డాయి. లాక్‌డౌన్‌ ఎక్కువ సమయం పాటించడం కూడా అనర్థాలకు దారి తీస్తుందని గమనించారు.

ప్రస్తుతం రెండవ కొరోనా వేవ్‌ ‌వ్యాపిస్తూ, ప్రజలను భయకంపితులను చేస్తున్నది. నేడు కరోనా రెండవ వేవ్‌ ‌కేసులు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఢిల్లీల్లో అధికంగా నమోదు కావడం దేశ ప్రజలను కలవరపెడుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మళ్లీ విద్యాసంస్థలను మూసి వేయాలనే నిర్ణయాన్ని 24 మార్చి నుంచి అమలు పరుస్తోంది. నేడు మళ్ళీ లాక్‌డౌన్‌ ‌విధించడం మంచి ఆలోచనకాదని, కరోనాతో సహజీవనం చేస్తూ క్రమశిక్షణగల జీవనశైలితో మానవ జీవనయానం కొనసాగవలసిందే అని నిపుణులు అంటున్నారు. నేడు కరోనా రోగులకు ఆసుపత్రులు సిద్దంగా ఉండడం, వైద్య విధానం ప్రమాణీకరించబడడం, వారియర్లలో ఆత్మవిశ్వాసం పెరగడం, వైద్య వసతులు/పరికరాలు అందుబాటులోకి రావడం, టీకాలు అందుబాటులోకి రావడం లాంటి సదుపాయాలతో రికవరీ రేటు దాదాపు 98 శాతానికి పైగా రికార్డు అవుతున్నాయి. కరోనా వ్యాక్సీన్‌ ‌తయారీలో అగ్రభాగాన ఇండియా ఉండడం మనకు గర్వకారణంగా ఉన్నది.

కరోనా వ్యాప్తిలో 20 – 45 మధ్య వయస్కులు కారణం అవుతున్నారని, దేశ ప్రజలకు రాబోయే ఆరు మాసాల్లో టీకాలు వేసిన యెడల కరోనా కట్టడి సులభం అవుతుందని అంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు అతి విశ్వాసానికి పోకుండా కరోనా కట్టడిలో తమ వంతు బాధ్యతలను నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్‌ ‌సంస్థల మధ్య సమన్వయం కుదిరితే, కరోనాకు అడ్డుకట్ట వేయడం సులభం అవుతుంది. వైరస్‌కు మిత్రులు, శతృవులు లేరు. కరోనాకు అందరూ సమానమే. కరోనా కేసులను చూసి భయపడకుండా, సరళ నియమనిబంధనల ఆకలింపులతో వైరస్‌ ‌వ్యాప్తి కట్టడి చేయడం సులభమని గమనించాలి. కనీసం రోజుకు 35 నిమిషాల శారీరక వ్యాయామం, 10 నిమిషాల ధ్యానం, పోషకాహారం తీసుకోవడం, ఆశావహ దృక్ఫథాన్ని అలవర్చుకోవడం లాంటివి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా శారీరకంగా, మానసికంగా దృఢంగా జీవనం సాగించడమే కరోనా వైరస్‌కు విరుగుడని తెలుసుకుందాం, సురక్షిత జీవితానికి పునాదులు వేసుకుందాం.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply