భారత పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్ఆర్ఐసీ) తయారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మంగళవారం రాజ్యసభలో ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. జాతీయ పౌరసత్వ చట్ట సవరణతో పాటు ఎన్ఆర్ఐసీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు ఈ విషయమై ఆందోళన చేశాయి.
ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో ఉభయసభల్లో గందరగోళం చెలరేగింది. మంగళవారం సభలోనూ ఈ పరిస్థితి కొనసాగింది. దీంతో మంత్రి నిత్యానందరాయ్ ఈ విషయమై లిఖితపూర్వక ప్రకటన చేస్తూ, ఎన్ఆర్ఐసీ రూపకల్పనపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదని వివరించారు.