ఏటా లక్షల్లో జరిగే వ్యాపారం ఈ ఏడాది ఇప్పటికి విక్రయాలే మొదలుకాలేదు. మార్కెట్లో చాలా వ్యాపారాలు డీలాపడి పోయాయి. వినియోగదారులు లేక మాల్స్, పెద్ద దుకాణాలు వెలవెలబోతున్నాయి. మామూలుగా నగరాల్లో దీపావళి సందడి అంతా ఇంతా కాదు. గల్లీగల్లీలో వెలుగులు విరజిమ్ముతూ నింగికెగసే తారా జువ్వలు.. కాకరపువ్వొత్తుల కాంతులు, బాంబుల మోతలు వెరసి దీపావళి రంగుల కేళీగా కనిపిస్తుంది. కానీ ఈ సారి సామాన్య ప్రజల సంతోషాన్ని కొరోనా దిగమింగింది. నిజానికి నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందనేది కొందరు వ్యాపారుల వాదన. గత ఏడాది దీపావళికి ఇదే పరిస్థితి. జనం దగ్గర డబ్బులు లేక దీపావళి పండుగను ఏదో మామూలుగా జరిపేశారు.
దేశవ్యాప్తంగా గడచిన మార్చి నుంచీ కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతోంది. లక్షలాదిమంది వైరస్ కు గురై అనారోగ్యం పాలుకాగా, అనూహ్య సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు ఉపాధులు కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఇంత భయంకర పరిస్థితులు ఈ శతాబ్దంలో ఎవరూ చూడలేదు. తగ్గుముఖం పట్టినట్లనిపించినా మళ్ళీ దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. మధ్యతరగతి ప్రజలు, సాధారణ వ్యాపారులు ఆర్ధికంగా చితికిపోయిన వారు దీపావళిపట్ల ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పటికీ ప్రజలు ఆ భయం నుంచీ కోలుకోలేదు.. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని కొంతమంది అంటున్నారు. ఎలక్ట్రానిక్, బట్టల దుకాణాలు, లోకల్ బజార్స్, మాల్స్, … ఇలా ఎక్కడ చూసినా జనాల తాకిడి అంతగా కనిపించడం లేదు.
ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా కరోనా విజృంభిస్తున్న వేళ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దీపావళి సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి సూచించింది. వాయు కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఈ నెల 7 నుంచి 30 వరకు టపాసులు కాల్చడంపై నిషేధించం విధించాలన్న ఆలోచనపై ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతోపాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరింది ఎన్జీటీ. కేంద్ర ప్రభుత్వంతోపాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, ఢిల్లీ పోలీసు కమిషనర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీపావళికి టపాసులు కాల్చొద్దని మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, బెంగాల్, ఒడిష మరికొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసాయి. ఎంపిక చేసిన బహిరంగ ప్రాంతాల్లోనే టపాసులు కాల్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతులివ్వగా, మరికొన్ని రాష్ట్రాలు దిగుమతి చేసుకున్న టపాసులను నిషేధించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు అమ్మకాలపై, టపాసులు కాల్చే సమయాలను రెండుగంటలకు మాత్రమే పరిమితి చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసాయి. ఈ దారిలో నడవడానికి మిగిలిన రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయని సమాచారం. పెరిగిన బాణాసంచా ధరలు ఏడెనిమిది నెలల కొరోనా కాటువలన ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా పూర్తిగా బలహీనమైన సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
కొవిడ్-19 మహమ్మారి తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా గాలి నాణ్యత క్షిణించిందని, ఇలాంటి సమయంలో టపాసులు కాల్పడం మరింత వాయు కాలుష్యాన్ని పెంచుతుందని, దీనివలన వేర్వేరు వ్యాధులతో ప్రబలడానికి కారణమౌతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కేవలం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యే బాణసంచా కాల్చాలన్న నిబంధనలతో అమ్మకాలు మరింత తగ్గిపోయాయని అంటున్నారు. బాణాసంచా తయారీకి కేంద్రంగా విరాజిల్లుతున్న తమిళనాడు మరింత దిగాలు పడింది. బాణాచంచా తయారీ వల్ల తమిళనాడులో వేలాది కుటుంబాలకు జీవనోపాధి నడుస్తుండగా కొరోనా విజృభించిన కారణంగా కార్మికుల కుటుంబాల స్థితి మరింత దయనీయంగా తయారైందని, ఆ కారణంగా కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఇటీవల ప్రధానికి విజ్ఞప్తి చేసారు. మరోవైపు హరిత దీపావళికి ప్రాధాన్యత పెరుగుతోంది. కాలుష్య రహిత దీపావళి చేసుకుందాం అని మీడియాలో ప్రచారం పెరుగుతోంది.