Take a fresh look at your lifestyle.

బీఆర్‌ఎస్‌ అవినీతి పై చర్య లేవి..

బీజేపీ లో అసంతృప్తి నేతలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీలో చేరికలు నిలిచి పోయాయా అంటే అవుననేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై బిజెపికిచెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు మూకుమ్మడిగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపినేనన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్‌ అధికారపార్టీని ఎదుర్కునే స్థాయిని దిగజార్చుకోవడమే అందుకు కారణమైంది. దీంతో కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్‌లో ఆసంతృప్తిగాఉన్న పలువురు సీనియర్‌ ‌నాయకులు కాషాయ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో బిజెపికి ఇక్కడ మరింత బలపడే అవకాశం లభించినట్లైంది. దీంతో కాంగ్రెస్‌ను తోసి, ఆ స్థానాన్ని బిజెపి దక్కించుకుంది. ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యమ్నాయమని ఢంకా బజాయించి చెబుతోంది బిజెపి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తమ ప్రభుత్వమే అధికారంలోకి వొస్తుందని బిజెపి చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ తమకు కాంగ్రెస్‌తోనే పోటీ ఉంటుందని బిఆర్‌ఎస్‌ ‌నేతలంటున్నారు. బిజెపి ఇక్కడ చూపిస్తున్నదంతా తుంపిర్ల బలమేగాని, గ్రౌండ్‌ ‌రియాల్టీలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కామెంట్స్ ‌కూడా వినిపిస్తున్నాయి.

సింహం సింగిల్‌గానే వొస్తుందని బిజెపి నాయకులు తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తున్నా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో  నిలబెట్టేందుకు నేటికీ వారికి సరైన అభ్యర్థుల కొరత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తృతం చేసుకునే క్రమంలో తెలంగాణనే ప్రధాన ద్వారంగా ఆ పార్టీ మొదటినుండీ చెబుతూ వొచ్చింది. అయితే అనుకోకుండా దక్షిణాదికే  చెందిన కర్ణాటక ఎన్నికలు మార్గాన్ని సులభతరం చేస్తామని ఆ పార్టీ భావించింది. కాని వారి ఆలోచన తలకిందులైంది. గతంలో రాజకీయ ఎత్తుగడలతో కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌చేతిలో చిత్తుగా   ఓడిపోయింది. దక్షిణాదిలో విస్తృతించాలనుకున్న ఆ పార్టీకి ఇది తీవ్ర విఘాతాన్ని కలిగించింది. అక్కడ విజయం సాధిస్తే ఆ తర్వాత జరిగే తెలంగాణ, ఆ తదుపరి రాష్ట్రాల్లో కాషాయ జండాను ఎగురవేసే బిజెపి ఆలోచనకు ఒక విధంగా బ్రేక్‌ ‌పడింది. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణలో రానున్న ఎన్నికలకు ఇప్పటినుండీ ఆ పార్టీ తీవ్ర కసరత్తు మొదలు పెట్టింది. నరేంద్రమోదీ ప్రధానిగా పదవి చేపట్టి తొమ్మిదేళ్ళు కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈనెల 30 నుంచి వొచ్చే నెల 30వరకు విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలన్న సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో నాలుగు భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది. ఇదిలా ఉంటే వాస్తవంగా ఆ పార్టీలో ఇప్పుడు కొత్తగా చేరేవిషయంలో నాయకులు ఆలోచనలో పడ్డారు. వివిధ రాష్ట్రాల్లో దూకుడుగా ముందుకు దూసుకు పోతున్న బిజెపికి కర్ణాటక ఫలితాలు బ్రేక్‌ ‌వేసినట్లైంది. వివిధ పార్టీలనుండి చాలా మంది రాజకీయ నాయకులు కాషాయ కండువ కప్పుకోవాలని ఉత్సాహ పడుతున్నవారిని ఈ ఫలితాలు పునరాలోచనలో పడవేసాయి.  బిఆర్‌ఎస్‌ ‌ప్రత్యమ్నాయం కాంగ్రెసే అన్న భావన వారిలో బయలు దేరింది. దానికి తగినట్లు అత్యంత క్రమశిక్షణ గల పార్టీగా మొదటినుండీ పేరున్న బిజెపిలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్న విధానంకూడా కొత్తగా చేరాలనుకునేవారిని ఒక అడుగు వెనక్కు లాగుతోంది.

తాజాగా బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నుండి ఆ పార్టీలోకి వెళ్ళిన సీనియర్‌ ‌నాయకులు ఆ పార్టీలో ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నాడని, తమకు పెద్దగా ప్రాధాన్యత లేదని వారు వాపోతున్నట్లు తెలుస్తున్నది. వీరిలో కొందరు ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు వినికిడి. ఈ పరిణామాలు పార్టీలో చేరికలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చాలన్న ప్రతిపాదనలు  బలంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపైన కేంద్రానికి కూడా సమాచారం ఉందని తెలుస్తున్నది. ఒక వేళ నిజంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినట్లైతే ఆ పదవిని చేపట్టేందుకు చాలా మంది ఉత్సాహపడుతున్నట్లు కూడా తెలుస్తున్నది. వారిలో మాజీ ఎంపి జీ. వివేక్‌ ‌వెంకటస్వామి, తాజాగా ఆ పార్టీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే  కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి.కె. అరుణతో పాటు హుజురాబాద్‌ ఎమ్మెల్యే  ఈటల  రాజేందర్‌ ‌కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.  ఇటీవల దిల్లీకి  వెళ్లిన ఈటల రాజేందర్‌ ‌రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కేంద్ర నాయకత్వానికి వివరించేందుకు వెళ్ళి ఉంటాడన్న ఊహాగానాలు వినవొస్తున్నాయి.

అంతేగాక చేర్పుల కమిటీ చైర్మన్‌ ‌గా  ఆయన ఇటీవల కాలంలో బడా నాయకులెవరిని బిజెపిలో చేర్పించలేకపోయాడు. కొత్తగా చేరేవారు పెడుతున్న డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు హామీ ఇవ్వకపోవడం కూడా ఒక కారణంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే కేంద్రనుండి వొచ్చిన ప్రతీ బిజెపి నాయకుడు కెసిఆర్‌ అవినీతి గురించి పిట్ట కథలాగే చెప్పేవాడేగాని, దానిపై తీసుకుంటున్న చర్యలేవీ లేవన్న అపవాదకూడా ఆ పార్టీకి ఉంది. లిక్కర్‌ ‌స్కామ్‌లో కవిత పాత్ర ఉన్నదని చెబుతూ, ఆమెను ఆరెస్టు చేయకపోవడం, కెసిఆర్‌ ‌భూ దందా పైన, ప్రాజెక్టుల అవినీతిపైన, మాజీ ప్రధాన కార్యదర్శి అవినీతిపైన కేవలం ఆరోపణలతోనే సరిపుచ్చుతున్నారని, దర్యాప్తు సంస్థలన్నీ తమ ఆధీనంలో  ఉన్నా చర్యలు ఎందుకు చేపట్టడంలేదన్న వాదనలు వినవస్తున్నాయి. ఈ ఆరోపణలతోపాటు కర్ణాటక ఫలితాల రీత్యా ఆ పార్టీలో చేరే విషయంలో వెనుకాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా పార్టీ వ్యవహారం ఉందని స్వయంగా ఆ పార్టీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కామెంట్‌ ఆ ‌పార్టీ ద్వంద్వ విధానాన్ని చెప్పకనే చెబుతున్నది. ఆ విధానంవల్లే తెలంగాణలో బిజెపి దూకుడుకు బ్రేక్‌ ‌పడిందన్న ఆయన మాటలు ఇప్పుడా పార్టీలో సంచలనాత్మకంగా మారాయి. అందుకే తాజాగా బిఆర్‌ఎస్‌ ‌నుండి వెలివేయడిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ ‌నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావులు ఎటు దూకాలో తేల్చుకోలేక ఆలోచనలో పడ్డారు.. కాంగ్రెస్‌, ‌బిజెపిలో వారిని తమపార్టీలోకి తీసుకోవడానికి అనేక ఆఫర్లను చూపించినప్పటికీ వారు ఎటువైపు మొగ్గేది ఇప్పుడప్పుడే తేలేట్లు లేదు. ఇలానే మరికొందరు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply