Take a fresh look at your lifestyle.

నిజాముద్దీన్‌ ‌వెళ్లివచ్చిన వారితో పెరిగిన కేసులు

  • కొరోనా పాజిటివ్‌ ‌కేసుల్లో అగ్రభాగాన గ్రేటర్‌
  • ‌కమ్యూనిటీ పోలీసింగ్‌తో కొరోనా ఫ్రీ సిటీగా చేసే యత్నాలు

రాష్ట్రంలో నమోదైన కొరోనా పాజిటివ్‌ ‌కేసుల్లో అగ్రభాగాన గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఉం‌ది. మరణాల్లో కూడా ఎక్కువ భాగం ఇక్కడివే ఉన్నాయి. ఖైరతాబాద్‌లో ఓ వృద్ధుడు మరణించాక పరీక్షలు నిర్వహించడంతో అది కొరోనా అని తేలింది. ఇదే మొదటి కరోనా మృతిగా నమోదైంది. తర్వాత యూసుఫ్‌గూడ, న్యూమలక్‌పేట, దారుషిఫా చంచల్‌గూడ, కుత్బుల్లాపూర్‌కు చెందినవారు కొరోనాతో మరణించారు. తాజాగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మరణించగా ఇందులో సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 27కు పెరిగింది. దీంతో నగరంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 74కు చేరింది. మేడ్చల్‌,‌రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 20 పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే 75 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. అందులో గ్రేటర్‌లోనే 60 శాతం కేసులు ఉండడం నగర వాసులను భయపెడుతోంది. బాధితుల్లో అత్యధికం మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. మార్చి 28న నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. తర్వాత సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. అనుకున్న స్థాయిలో వైరస్‌ ‌లేదని వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌ప్రార్థనకు వెళ్లొచ్చిన వారిలో కరోనా అధికంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు.నిజాముద్దీన్‌కు వెళ్లిన వారిని క్వారంటైన్‌ ‌చేశారు.నిజామియా ఆస్పత్రిలో 213 మంది, సరోజినీ అస్పత్రిలో 39 మంది, నేచర్‌ ‌క్యూర్‌ అస్పత్రిలో 210మందిని నిజాముద్దీన్‌ ‌వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్‌ ‌చేశారు. వీరిలో అనారోగ్యం బారినపడిన వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. వీటిల్లో కొన్ని ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఫలితాలన్నీ ఒకేసారి రావడం వల్ల పాజిటివ్‌ ‌కేసులు ఒకేరోజు పెరిగి ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఫలితాలు రెండు రోజుల్లో రానున్నాయి. దీంతో ఎక్కువ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం సుమారు 75 మంది నమూనాలు పరీక్షల నిమిత్తం పంపించారు. వీరిలో 24 మందికి పాజిటివ్‌ అని తేలింది. రాత్రిదాటిన తర్వాత మరో ముగ్గురికి కూడా పాజిటివ్‌ ‌వచ్చినట్టు తెలిసింది. వీరందరినీ గాంధీ ఐసొలేషన్‌ ‌వార్డుకు తరలించారు. వీరితో ఉన్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు కూడా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు.కరోనా కట్టడిలో పోలీసులకు కమ్యూనిటీ పోలీసింగ్‌ ఎం‌తగానో సహకరిస్తున్నది.

ఢిల్లీ నిజాముద్దీన్‌ ‌ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని గుర్తించడంలో పోలీసులకు కమ్యూనిటీ పోలీసింగ్‌ ‌నుంచి సమాచారం వస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ఢిల్లీకి వెళ్లొచ్చిన వారందరినీ దాదాపుగా గుర్తించారు. ఇతర విభాగాల సమన్వయంతో ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వివరాలు తీసుకొని, స్థానిక పోలీస్‌స్టేషన్‌ ‌సిబ్బందికి కరోనా అనుమానితులను గుర్తించే బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇప్పటికే నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న వారందరినీ గుర్తించి, వారి లింక్‌లను కూడా గుర్తించారు. కరోనా ఫ్రీ సిటీగా గుర్తించే పనిని విజయవంతం చేసేందుకు నగర పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో కమ్యూనిటీ పోలీసింగ్‌ ‌సేవలను ఉపయోగిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ‌గ్రూప్‌లను తయారు చేసి ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సెక్టార్ల వారీగా ప్రజా సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. దీంతో పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే దాదాపుగా హైదరాబాద్‌లో ఇతర దేశాలు, రాష్టాల్రకు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించే పని పూర్తయ్యిందనుకున్న సమయంలోనే ఢిల్లీ నిజాముద్దీన్‌ ‌ఘటన అందరినీ ఖంగుతిన్పించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే మొదట్లో ఆందోళనకు గురైనా.. ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితిని పోలీసులు చక్కబెట్టారు. ఇతర దేశాలు, రాష్టాల్రకు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరించి… వారందరికీ పరీక్షలు నిర్వహించారు. కరోనా అనుమానితులను క్వారంటైన్‌ ‌చేసి, పాజిటివ్‌ ‌వచ్చిన వారిని ఆయా దవాఖానలకు తరలించారు. ఇంకా ఎవరైనా ఉంటే… వారి సమాచారాన్ని కమ్యూనిటీ పోలీసింగ్‌ ‌సభ్యులు పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. నగర పోలీస్‌ ‌కమిషనర్‌తో పాటు డయల్‌ 100‌కు, స్థానిక పోలీసులకు ఈ సమాచారం వస్తుంది.

దీంతో వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులు రంగంలోకి దిగి… అలాంటివారిపై నిఘా పెడుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారితో పాటు వారెవరిని కలిశారనే విషయంలో స్పష్టత వస్తున్నా.. మరింత స్పష్టత కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. దీనిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ ‌సేవలను పోలీసులు ఉపయోగించుకుంటున్నారు.

Leave a Reply