‘‘నేటికి జార్జ్ మరణించి 51 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చెరగనిముద్రగా ఉన్నాయంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు..’’
తాను ఈలోకంలో భౌతికంగా లేకపోవచ్చు కాని తన ఇచ్చిన నినాదం తన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. రెండు పదుల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్, మతోన్మాద గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా వణుకు పుట్టించిన పోరాటయోధుడు జార్జ్.
అతనొక నిత్య నూతన చైతన్యం దివిటి,ఐన్ స్టీన్ ఆలోచనలు, చేగువేరా ధీరత్వాన్ని కలగలిపిన వ్యక్తిత్వం తనది. అతనిని విద్యార్థి, మేధావులు హైదరాబాద్ చేగువేరా అని పిలుచుకునే వారు. ఉస్మానియా యూనివర్సిటీలో భౌతికశాస్త్రంలో చేరిన జార్జ్ క్యాంపస్ లో భూస్వామ్య, అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండే ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో ఉండి విద్యార్థులపై కులం పేరుతో దూషణ చేస్తూ వారిని అంటరానివారీగా చూస్తూ బలహీనవర్గాల విద్యా ర్థులపై దాడులు, మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని జార్జ్ తీవ్రంగా వ్యతిరేకించి వారికి అండగా నిలిచాడు. మతోన్మాద గుండాలపై ఎదురుతిరిగిన జార్జ్ విద్యార్థులకు బాంధవుడయాడు. క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ప్రశ్నిస్తూ విద్యార్థి పక్షాన నిలబడేవాడు జార్జి రెడ్డి.
ఆ సమయంలో ప్రపంచంలో జరిగిన ఫ్రెంచ్ విద్యార్థుల పోరాటం, వియత్న విప్లవ పోరాటాలు, నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ ప్రతిఘటనోద్యమాలు ఆయన జీవితాన్ని విప్లవొ ద్యమం వైపుగా ఆకర్శించాయి.1971లో జరిగిన విద్యార్థుల క్యాంపస్ ఎన్నికలలో జార్జ్ మిత్రబృందం పోటీచేసిన అన్ని స్థానాలలో గెలుపొందడం వలన మతోన్మాద విద్యార్థి సంఘానికి గుండెల్లో వణుకుపుట్టడం మొదలయింది.జార్జ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన రాసిన ప్రశ్న పత్రాన్ని దిద్దిన బాంబే ప్రొఫెసర్ జార్జిని కలవడానికి హైదరా బాదుకు వచ్చాడంటే ఆయన విషయ పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జార్జి సైన్స్ విద్యార్థి అయినప్పటికీను చరిత్రను కూడా అధ్యయనం చేసి తోటి విద్యార్థులకు విషయ బోధన చేసేవాడు. మార్కస్ ఇజాన్ని ప్రపంచంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలను అధ్యయనం చేసి సాయంత్రం సమయంలో విద్యార్థులతో చర్చించేవాడు.జార్జ్ క్యాంపస్ సమస్యలపై కాకుండా దేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాలపై కూడా తన గళాన్ని వినిపించేవాడు.
జార్జ్ ఉంటే తమ ఆటలు సాగవాని గ్రహించిన మతోన్మాదులు జార్జ్ నీ ఎట్లయినా అంతమోం దించాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు.1972 మార్చ్ 15 తారీకున జరగనున్న విద్యార్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులను కలవ డానికి వెళ్తున్న జార్జిని ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు దూలపేట గుండాలతో కిన్నెర హాస్టల్ దగ్గరకు వచ్చిన అతన్ని హతం చేయాలని మాటు కాసి ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడి 32 కత్తిపోట్లతో జార్జిని హతమోదించారు. ఇదంతా చూస్తూ ఉన్న పోలీసులు కూడా వారిని ఆపకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం వెనుక ఉన్న వైఖరి ఏంటనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
నేటికి జార్జ్ మరణించి 51 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చెరగనిముద్రగా ఉన్నాయంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. నేటికి కూడా సమాజాన్ని చీల్చి, తమ భావజాలాన్ని వ్యాపింప చేసుకోవాలని మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మతోన్మాద శక్తుల కుట్రలను తిప్పికొడుతూ సమాజాన్ని చైతన్య పర్చడం ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అందించే ఘనమైన నివాళి అవుతుంది.
– కామగోని శ్రావణ్, జర్నలిజం విద్యార్థి
కాకతీయ విశ్వవిద్యాలయం, 9640154590