Take a fresh look at your lifestyle.

రాష్ట్ర పథకాలపై నీతి ఆయోగ్‌ సర్వే…గర్వకారణం

Niti Aayog Survey on Telangana State Schemes is Proudతెలంగాణ కోటి ఎకరాల మాగాణ నినాదంతో కాళేశ్వరం ప్రాజెక్టను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదే. ఇప్పుడు పారిశ్రామికరంగంపై ప్రభుత్వం దృష్టిని సాధించింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులెత్తించడా నికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలప్రదం అయ్యాయి. టిఎస్‌ఐ ‌పాస్‌ను కొత్త ఏడాదిలో కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పారిశ్రామికాభివృద్ధికి నీరు, విద్యుత్‌ ‌చాలా అవసరం. నీటికి ఇబ్బంది లేకుండా చేయడం కోసమే కాళేశ్వరాన్ని ఆగమేఘాలపై పరుగులెత్తి స్తున్నారు. విద్యుత్‌ ‌రంగంల • కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా బాగా ముందుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ విద్యుత్‌ ‌కోతలే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి 7,778 మెగావాట్‌లు 2019లో అది 16,506 మెగా వాట్లకు పెరిగింది. వొచ్చే నాలుగు ఐదేళ్ళలో 28,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధించాలన్న లక్ష్యంగా రాష్ట్రంలోని విద్యుత్‌ ‌సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నారు. నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. తక్కువ సమయంలో విద్యుత్‌ ‌రంగంలో తెలంగాణ అద్భుతాలు సాధించిందంటూ ట్రాన్స్ ‌కో ఎండీ దేవులపల్లి ప్రభాకరరావు అన్న మాటల్లో అతి శయోక్తి లేదు. విద్యుత్‌ ‌సంస్థలు బాగా పని చేయడానికి ఆయన తీసుకుంటున్న శ్రద్ధాసక్తులే కారణమన్నది సర్వజన విదితం.

మౌలిక సదుపాయాలకు కేంద్రం పెద్ద పీట వేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. విద్యుత్‌, ‌నీరు వంటి మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు తెరాస ప్రభుత్వం ముందే ప్రణాళికలను రూపొందించి అమలులో పెట్టింది. అవి ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగు పడ్డాయి కనుకనే పారిశ్రామిక రంగం శరవేగంగా పుంజు కుంటోంది. 2019 సంవత్సరం పారిశ్రామిక రంగానికి కలిసొచ్చిన సంవత్సరంగా నమోదు అయింది. పారిశ్రామిక పార్కులలో కార్మికులకు టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇండస్ట్రియల్‌ ‌పార్కులో కార్మికులకు టౌన్‌ ‌షిప్‌ ఏర్పడనుంది. ఇప్పటికే 174 ఎకరాలను కేటాయించారు. మరో నాలుగు వందల ఎకరాలను కేటాయించనున్నారు. మంచినీరు, విద్యుత్‌, ‌కార్మికులకు వసతి వంటి మౌలిక సదుపాయాల ద్వారానే పారిశ్రామికాభివృద్ధి వేగాన్ని పుంజుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి అమలులో పెట్టింది. తెలంగాణలో 50 ఇంస్ట్రియల్‌ ‌పార్కులకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. దుండిగల్‌లో రెండో ఎంఎస్‌ఎంఇ ‌పార్కు ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని రాష్ట్ర ఆవిర్భావానికి దోహదం చేసిన పారిశ్రామిక వేత్తలకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించడం పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస చర్య. అలాగే, భూములు ఇచ్చిన రైతుల ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా పెంచడం ద్వారా ఉపాధి కల్పన రంగంలో ముందడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం మంచిదే. ఆర్థిక మాంద్యంలో కూడా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు లోటు లేకుండా కొనసాగించడం సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ఇండస్ట్రియల్‌ ‌హెల్త్ ‌క్లినిక్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తం దేశమంతా ఎన్‌పిఆర్‌, ‌సిఏఏలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు సాగుతున్న వేళ, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టింది. మరో వంక మునిసిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ రకాల సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ కొత్త సంవత్సరానికి అభివృద్ది అజెండాను ఎంచుకుని ముందుకు సాగడం వల్ల నీతి ఆయోగ్‌ ‌వంటి కేంద్ర సంస్థలు తెలంగాణలో పథకాలపై సర్వే చేయించాలని నిర్ణయించడం తెలంగాణకు గర్వకారణం.

Tags: Niti Aayog Survey, Telangana State, Schemes, Proud, kaleshwaram project

Leave a Reply