Take a fresh look at your lifestyle.

నిష్ఠ ! ఒక విఫల ప్రయోగ శిక్షణ!!

”నిష్ఠ నాల్గవ విడత జాతీయ శిక్షణ కార్యక్రమం ఈ నెల 27న ప్రారంభమై 31న ముగుస్తున్న సందర్బంగా…తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో విద్యారంగంపై జరిగిన పునర్నిర్మాణ చర్చలో నాటి ఉద్యమ నాయకుడు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ‘కామన్‌ ‌స్కూల్‌’ ఏర్పాటు తన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు కుల, మత రహిత స్టేట్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటన ఆచరణ రూపం దాల్చి ప్రభుత్వ పాఠశాలలను అలా మార్చితే ఎంతబాగుండూ! దేశవ్యాప్తంగా ఈ శిక్షణపై పెడుతున్న ఖర్చును వెచ్చిస్తే ఒక రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కనీస వసతుల కల్పన జరిగేది. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులకు విశ్వాసం కలిగి ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందుతాయి, పనికిరాని శిక్షణల తంతు ఇదే విధంగా కొనసాగితే స్వల్పకాలంలో నిర్జీవం కావడం ఖాయం!”

'Fourth national Nista training program

తమగ్ర శిక్షణ ప్రాయోజిత పథకం కింద ఇంటిగ్రేటెడ్‌ ‌టీచర్‌ ‌ట్రైనింగ్‌ ‌ప్రొగ్రామ్‌ ‌ద్వారా ప్రభుత్వ బడులలో పనిచేసే ఉపాధ్యా యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులందరిలో సామర్థ్యాలను పెంపొందించి, పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరుచడం కోసం, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించుటకు ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా భారతదేశ వ్యాప్తంగా 42 లక్షల మందికి 33120 మంది కీరిసోర్స్ ‌పర్సన్స్‌తో డిసెంబర్‌ ‌నెల 17 నుండి నిష్ఠ (నేషనల్‌ ఇన్షియేటివ్‌ ‌ఫర్‌ ‌స్కూల్‌ ‌హెడ్స్ అం‌డ్‌ ‌టీచర్స్ ‌హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌) ‌పేరుతో నాలుగు విడతల శిక్షణ కార్యక్రమానికి మానవ వనరుల మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ(ఎన్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి) సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే మూడు విడతలు పూర్తికాగా నాల్గవ విడత జనవరి 27 నుండి 31 వరకు జరిగి ఈ శిక్షణ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే విద్యాశాఖ పరిధిలో నిర్ణయాలు జరిగి శిక్షణాకార్యక్రమాలు జరిగినప్పటికి, ఇది మాత్రం ఒకేసారి దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద, భారీ శిక్షణా కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో ఈ శిక్షణ ఇచ్చే కీ రిసోర్స్ ‌పర్సన్స్‌కు టి.ఎస్‌. ఐపార్డ్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను ఒక శిబిరంగా, హైస్కూల్స్ ‌స్థాయిలో ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను కలిపి వేరొక శిబిరంగా ఏర్పరిచి శిక్షణ ఇస్తున్నారు. జెనరిక్‌ ‌మరియు పెడగాజికల్స్‌కు సంబంధించిన పద్దెనిమిది అంశాలలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.

'Fourth national Nista training programఇప్పటి వరకు ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌బోర్డ్(ఓబిబి), ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రాథమిక విద్యా పథకం(ఎపెప్‌), ‌జిల్లా ప్రాథమిక విద్యా పథకం(డి.పి.ఇ.పి), సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌.ఎస్‌.ఏ ‌లేక రాజీవ్‌ ‌విద్యామిషన్‌)‌ల ఆధ్వర్యంలో అనేక శిక్షణలతో పాటు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో బోధనలోని అంశాలపైన శిక్షణల మీద శిక్షణలను ఇచ్చి ప్రయోగాల మీద ప్రయోగాలు జరిపారు. బోధనతో పాటు పరీక్షలలో సంస్కరణలు అవసరమని నిరంతర సమగ్ర మూల్యాంకనం (సి.సి.ఇ)ని కూడా ప్రవేశపెట్టారు. అప్పులు తెచ్చి, అందమైన పేర్లు పెట్టిన ఈ పథకాలన్నీ విద్యార్థుల సంఖ్య పడిపోవడానికి కారణమవడమేకాక, పాఠశాలల్ని ప్రజలకు దూరం చేసి, మూసివేత దశకు తెచ్చిన వీటిపై సమీక్ష చేసిన నాథుడులేడు, ప్రభుత్వమూ లేదు. పైన పేర్కొన్న అన్ని పథకాలలోని ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణల కంటే నిష్ఠ భిన్నమైన శిక్షణ అని, ఈ శిక్షణ అనంతరం పాఠశాలల్లో ఆమూలాగ్రంగా మార్పు వస్తుందని ప్రారంభంలో పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చాయి. పతనం అంచున నిలబడ్డ పాఠశాలల బాగు కోసం బ్రహ్మపదార్థం ఏదో దొరికిందని చాలా మందిని భ్రమపెడుతుంటే, 10వ తరగతి విద్యార్థులను పబ్లిక్‌ ‌పరీక్షలకు సంసిద్ధులను చేస్తూ పాఠ్యాంశాల బోధనలో చివరి దశలో ఉన్న తరుణంలో ఈ శిక్షణ ఏంటంటూ విసుక్కుంటూనే ఆ నిశాచర బ్రహ్మపదార్థాన్ని ఆకలింపు చేసుకుందామని భ్రమపడి ఆవురావురుమంటూ వెళ్ళారు. మొదటి సెషన్‌ అం‌తా రిజిస్ట్రేషన్‌ ‌పని. తరగతి గదులలో మొబైల్స్ ‌వాడవద్దంటూనే మొదటిసారిగా ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌లకు పనికల్పించారు. ఈ శిక్షణ కోసం ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్‌ ‌చేసుకోవాలంటే తప్పకుండా ఆండ్రాయిడ్‌ ‌ఫోన్‌ ఉం‌డాల్సిందే. ప్రారంభ, ముగింపు పరీక్షలతోపాటు ప్రతి సెషన్‌ ‌ముగిసిన వెంటనే తప్పకుండా శిక్షకులు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఐదు రోజుల శిక్షణలో మళ్ళీ అదే పాత కథ. ఇప్పటి వరకు జరిగిన శిక్షణల్లో సింగర్‌గా, యాక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా, డాక్టర్‌గా, ఇంజనీర్‌గా చెబితే ఉపాధ్యాయులను బహురూపులోడిగా చెబితే ఇందులో లీడర్‌గా మార్చారు. రెండు, మూడు రోజులు గడిచేటప్పటికే నిష్ఠ శిక్షణ మొత్తం కొత్త సీసాలో పాత సారా తప్ప పాఠశాలలను బాగుపరిచే మరే బ్రహ్మపదార్థం ఇందులో లేదని, పుండొకచోట ఉంటే మందొకచోట పెడుతున్నారని అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఉన్న సర్వశిక్ష అభియాన్‌ ‌పథకం సమగ్ర శిక్షగా మారబోతున్నదని, సిసిఇ నుండి స్కూల్‌ ‌బేస్డ్ అసెస్‌మెంట్‌లోకి విద్యావ్యవస్థను మార్చబోతున్నామని తెలుపడం కోసమే ఈ ఐదు రోజుల శిక్షణను ఏర్పరిచారా? 10వ తరగతి పబ్లిక్‌ ‌పరీక్షలు సమీపిస్తున్న సందర్భంలో 4 విడతలుగా నెల పదిహేనురోజుల కీలక సమయాన్ని వృథా చేసారేమో అనిపిస్తుంది! ఇటువంటి పథకాలు, శిక్షణలు కొందరికి ప్రధాన ఆదాయ వనరులుగా, మరికొందరికి పదవులు పదికాలాల పాటు కాపాడుకోవడానికి మినహా ఎందుకూ పనికిరావు. అన్ని పథకాలు, శిక్షణలలాగే నిష్ఠను కూడా ఏదో ఒక దేశం నుండి కాపీ చేసి మాడ్యూల్స్‌ను రూపొందించారని వాటిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది! అభివృద్ధి చెందిన దేశాల నమూనాలు, పథకాలు, శిక్షణలు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పనికిరావు అని గత అనుభవాలు చెబుతున్నా, విఫలమైనా, విద్యాశాఖ తన ప్రయోగాలను ఏమాత్రం ఆపకుండా, ప్రపంచం అంతా ఒకవైపు ప్రయాణం చేస్తూంటే విద్యాశాఖ మరొక వైపు ప్రయాణం చేస్తున్నది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల కుటుంబాలను, పరిసరాలను, ప్రాపంచిక మార్పులను అర్థంచేసుకొని వారికి తగ్గట్టుగా విద్యావిధానం, పథకాలు, శిక్షణలను రూపొందించుకోవాల్సి ఉండగా గత 30 సంవత్సరాలుగా ప్రయోగాల మీద ప్రయోగాలు పాఠశాల విద్యపై చేస్తూనే ఉన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచినా, కమిటీల మీద కమిటీలు వేసి నివేదికల మీద నివేదికలు వచ్చినా ఒక స్వతంత్ర విద్యావిధానం రూపొందించుకొనే స్థితిలో ఈ దేశ రాజకీయ వ్యవస్థ లేకపోవడం ఎంత దురదృష్టకరం?! గ్లోబలైజేషన్‌లో కంప్యూటర్‌ ‌విద్యకు పెరిగిన ప్రాధాన్యతను గుర్తించి పాఠశాలల్లో కంప్యూటర్‌ ‌ప్రయోగశాలలను ఏర్పరచలేదు, వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబడ్డ చోట మూతపడి ముచ్చటగా మూడు సంవత్సరాలైన, అధికార యంత్రాంగానికి, పాలకులకు ఈ విషయం తెలిసినా ఇప్పటి వరకు వాటిని తెరిపించడానికి, బోధకులను నియమించడానికి ఏ ప్రయత్నం చేయకుండా బోధన, అభ్యసన మరియు మదింపులకు ఐ.సి.టి (ఇన్‌ఫర్‌మేషన్‌ అం‌డ్‌ ‌కమ్యూనికేషన్‌ ‌టెక్నాలజీ) ద్వారా సాంకేతికను జోడించాలనే అంశంపై శిక్షణ ఇవ్వడం దేనికి సంకేతం? ఈ శిక్షణలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సంబంధించిన అంశంపై శిక్షణ ఇవ్వడాన్ని బట్టి చూస్తూంటే భవిష్యత్తులో వారి పాఠశాలలను ఎత్తివేయబోతున్నారా అనే అనుమానం వస్తున్నది. ఇద్దరేసి ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో దీని అమలు సాధ్యమా? బ్రెయిలీ లిపిని, సంజ్ఞలను వారికి సరిపోయే స్థాయిలో నేర్పగలరా? దేశంలోని 60 శాతం పాఠశాలల్లో కనీస వసతులు లేని కడు దయనీయ పరిస్థితులలో ఉన్నప్పుడు వాటిలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలకు దారితీసే కళను బోధనగా ఉపయోగించడం ఎలా సాధ్యం? సమగ్ర తరగతి విధానంపై, వాటిని సుసంపన్నం చేయడంపై శిక్షణ ఇవ్వడం ఏం ప్రయోజనం? ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన పాఠశాల వాతావరణాన్ని ఉపాధ్యాయుడు ఎలా సృష్టించగలడు? సిసిఇ విధానంతో క్షణం తీరికలేని విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇప్పుడు నీటి వసతి, ప్రహరీగోడ, గేట్లు లేకుండానే కిచెన్‌ ‌గార్డెన్‌లు కూడా పెంచాలట! వాటిని కాపాడుకోవడానికి అడవులు పోయి, పర్యావరణం ధ్వంసమై గ్రామాల్లోకి వచ్చిన కోతుల కాపలాపై కూడా భవిష్యత్తులో శిక్షణ ఇచ్చి, కట్టె పట్టుకుంటే సస్పెండ్‌ ‌చేస్తారు కాబోలు! విద్యార్థుల సంఖ్య పెరగాలన్నా, తల్లిదండ్రులకు విశ్వాసం కలగాలన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టడంతో పాటుగా ప్రతి తరగతి గదికో ఉపాధ్యాయున్ని నియమించి, గ్లోబలైజేషన్‌లో తల్లిదండ్రుల డిమాండ్‌కు అనుకూలంగా పాఠశాలలను ఇంగ్లీష్‌ ‌మీడియం పాఠశాలలుగా మార్చి, తరగతి గదులను డిజిటలైజ్‌ ‌చేయడంతో పాటుగా ఢిల్లీ ప్రభుత్వంలాగా పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకొని సకల సౌకర్యాలను కల్పించి అన్ని హంగులతో అందంగా తీర్చిదిద్దాలి.

ప్రస్తుతం పాఠశాల విద్యలో అమలవుతున్న సిసిఇ విధానాన్నిచ దాన్ని ప్రవేశపెట్టిన మాతృసంస్థనే తప్పుబట్టి ఎత్తివేసింది కనుక డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ ‌కోర్సులలో అనుసరించబడుతున్న సెమిస్టర్‌ ‌విధానాన్ని పాఠశాల విద్యలో ప్రవేశపెట్టి నివేదికలు ఎత్తి చూపుతున్న ప్రధానలోపమైన రాయడం, చదవడంపై దృష్టిపెట్టాలి. భారతదేశంలో విద్యార్థి కుటుం• నేపథ్యాన్ని దృష్టియందుంచుకొని మరియు సెల్‌ఫోన్‌, ‌టి.వి ప్రభావం కారణంగా పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక పాఠశాలలను సెమి రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలుగా, అన్ని హైస్కూల్స్‌ను పూర్తి స్థాయి రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలుగా మార్చాలి. ప్రైవేటు, కార్పొరేటు, తెలంగాణ రెసిడెన్షియల్‌, ‌మోడల్‌ ‌స్కూళ్ళ విజయవంతానికి ఈ విధానమే కారణం. ప్రస్తుతం పాఠశాల విద్యారంగంలో పనిచేస్తూన్న ఉపాధ్యాయులలో 90 శాతం మంది తెలుగు మీడియంలో చదివి ఉన్నారు కనుక గతంలో మన ముఖ్యమంత్రి చెప్పిన విధంగా వారికి ఇంగ్లీష్‌ ‌భాషలో ప్రావీణ్యం పెంపుదలకు మరియు కంప్యూటర్లను వినియోగించి బోధన చేయుటకు నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యం పెంచాలని డిమాండ్‌ ఉం‌డగా నిష్ఠ లాంటి శిక్షణలు ఇవ్వడం శుద్ధదండగ. ఎటువంటి పథకాలు, ప్రయోగాలు, శిక్షణలు లేకుండా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు కొనసాగుతున్న విషయాన్ని విద్యాశాఖలోని మేధావులు గుర్తించాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో విద్యారంగంపై జరిగిన పునర్నిర్మాణ చర్చలో నాటి ఉద్యమ నాయకుడు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ‘కామన్‌ ‌స్కూల్‌’ ఏర్పాటు తన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు కుల, మత రహిత స్టేట్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటన ఆచరణ రూపం దాల్చి ప్రభుత్వ పాఠశాలలను అలా మార్చితే ఎంతబాగుండూ! దేశవ్యాప్తంగా ఈ శిక్షణపై పెడుతున్న ఖర్చును వెచ్చిస్తే ఒక రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కనీస వసతుల కల్పన జరిగేది. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులకు విశ్వాసం కలిగి ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందుతాయి, పనికిరాని శిక్షణల తంతు ఇదే విధంగా కొనసాగితే స్వల్పకాలంలో నిర్జీవం కావడం ఖాయం!

dr narasimhuduడాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు,
రాష్ట్ర ప్రధానకార్యదర్శి,
తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌.
  9701007666.
Tags: Nista, failed, launch training,Head of State, Telangana Teachers Union

Leave a Reply