Take a fresh look at your lifestyle.

నిర్మలమ్మ ‘ఉక్కు’ పిడుగులు..!

కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానులు తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని అన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనీ, వంద శాతం వాటాలను అమ్మేయాలని నిర్ణయించామని ప్రకటించి తెలుగువారిపై ఉక్కు పిడుగులు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇంతకుముందే ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో ప్రభుత్వానికీ ఎటువంటి సెంటిమెంట్లు లేవనీ, నష్టాలు వస్తుంటే అమ్మివేయడమే మార్గమంటూ గత నెలలోనే స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వానికి ప్రజాపోరాటాల చరిత్ర కలిగిన ప్రాజెక్టుల గురించి సెంటిమెంట్లు ఉండవు కానీ, గుజరాత్‌ ‌లో సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌భారీ విగ్రహాన్ని మూడువేల కోట్ల రూపాయిలు పైగా వెచ్చిం నిర్మించడానికి సెంటిమెంట్లు ఉంటాయి.అదే పటేల్‌ ‌గారి పేరిట ఉన్న అహ్మదాబాద్‌ ‌లోని మోతేరా స్టేడియంకు ఆయన పేరు తీసేసి తన పేరు పెట్టించుకోవడంలో ఎటువంటి సెంటిమెంట్లు అడ్డు రావు .

గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీని కాపాడిన బీజేపీ కురువృద్ధులు ఎల్‌ ‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ ‌జోషిలకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా చేయడంలో కూడా మోడీకి ఎటువంటి సెంటిమెంట్‌ ‌ను పాటించలేదు. ఆంధప్రదేశ్‌ ‌ప్రజలు ఐదు దశాబ్దాల క్రితం పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి సెంటిమెంట్‌ ఏమీ ఆయనకు కనిపించలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజల మనోభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌లేఖల ద్వారా తెలియజేసినా పట్టించుకోవడం లేదు. పైగా, ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క శాతం వాటా కూడా లేనందున రాష్ట్రానికి సంబంధం లేదంటూ నిర్మలా సీతారామన్‌ ‌చేసిన ప్రకటన తెలుగువారిని కవ్వించేట్టుగా ఉంది.ఆమెకు తెలుగువారితో సంబంధాలున్నా, ఇక్కడ మాత్రం అధికార హోదాలో మాత్రం ప్రకటన చేసేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై రగిలిన చిచ్చు ఆంధప్రదేశ్‌ ‌లో ప్రస్తుతం విశాఖ నగరానికే పరిమితం అయింది.

త్వరలోనే రాష్ట్రమంతటా వ్యాపించవచ్చు. ఢిల్లీ లో కూడా ర్యాలీ నిర్వహిస్తామని మాజీ మంత్రి, శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అంతే కాకుండా ఈ సమస్యపై రాష్ట్రంలోని ఎంపీలంతా రాజీనామా చేస్తే, తిరిగి ఎన్నికలు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టబోదని ఆయన ప్రకటించారు.నిజానికి ఈ ప్రకటన చేయాల్సిన ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పటివరకూ ఉక్కుఫ్యాక్టరీపై నోరు మెదపలేదు.ఆయన ఇదంతా ముఖ్యమంత్రి అసమర్ధత వల్లే జరిగిందంటూ తన అనుచరులచేత చెప్పిస్తున్నారు.అసలు ఈ ప్రతిపాదన 2016లోనే జరిగిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది బాబుగారే.అంతేకాకుండా మోడీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన కాలం కూడా. రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ, తెలుగుదేశం పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రజల గురించి ఆలోచించే సమయం , శ్రద్ధ ఈ రెండింటిలో ఏ ఒక్క పార్టీకీ లేదని స్పష్టం అవుతోంది.

విశాఖలో మాత్రం ఆందోళన తారస్థాయికి చేరుతోంది. మంగళవారం నాడు స్టీల్‌ ‌ఫ్యాక్టరీ ఆర్థిక వ్యవహారాల డైరక్టర్‌ ‌వేణుగోపాల్‌ ‌కారును ఫ్యాక్టరీ గేటు వద్ద ఆరు గంటల సేపు నిలిపివేశారు. దేశంలో 35 ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి 2016లోనే కేంద్రం ఆమోద ముద్ర వేసిందని కేంద్రమంత్రి నిర్మల చెబుతున్నారు. వీటిలో 8 సంస్థల విక్రయం పూర్తి అయిందనీ, 66,712 కోట్ల రూపాయిల ఆదాయం వొచ్చిందని ఆమె చెప్పారు. 21-22లో 1.75 కోట్ల విలువైన సంస్థలను విక్రయానికి పెట్టినట్టు కూడా ఆమె చెప్పారు. విశాఖ ఉక్కు విక్రయం ద్వారా 32 వేల కోట్లు ఆదాయం వొస్తుందని అంచనా వేస్తున్నట్టు ఆమె వివరించారు. నాలుగు రంగాల్లో మినహా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా విక్రయించేందుకు నిర్ణయించినట్టు పార్లమెంటు వేదికగా ప్రధాని గత నెలలోనే ప్రకటించారు. నష్టాల్లో వొస్తున్న పరిశ్రమలు, ప్రాజెక్టులను నడపలేమనీ, వాటిని బతికించుకోవడానికే ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నామని ఆయన ప్రకటించారు.

ఈ నేపధ్యంలో ఆలోచిస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఎంతో తెలుగుదేశం వారే చెప్పాలి. వారికి పార్టీని బతికించుకోవడానికి ఇప్పుడు ఇది ఒక ఆయుధంగా దొరికింది. అయితే, విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి వ్యతిరేకత తెలుపుతున్న ఆ పార్టీకీ విశాఖ ఉక్కుప్రేమ ఎంతో వెల్లడవుతోందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనే కాకుండా కేంద్రం లో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం వల్ల అంబానీ, ఆదానీ వంటి కుబేరులకు మాత్రమే ప్రయోజనం కలుగుతోందన్న ఆరోపణల్లో అసత్యం లేదని గణాంకాలు తెలుపుతున్నాయి. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు యావ తప్ప మోడీ, అమిత్‌ ‌షాలు దేశం కోసం చేస్తున్నది ఏమీ లేదని ప్రాజెక్టుల విక్రయాల్లో తేటతెల్లం అవుతోంది.

Leave a Reply