కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటుకు సమర్పించిన 2020-21 సాధారణ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంతవరకూ ఇంత పేలవమైన, పనికిరాని బడ్జెట్‌ను చూడలేదని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. అందుకు కారణాలు లేకపోలేదు … ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజల చేతుల్లో డబ్బు పుష్కలంగా ఉండేట్టు చర్యలు తీసుకుని ఉండాల్సింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల రంగాల్లో తగినన్ని నిదులు ఖర్చుచేయడానికి వీలుగా చర్యలు కనిపించలేదు. ప్రభుత్వం స్థూల జాతీయోత్పత్తి వృద్ది రేటు పది శాతం లక్ష్యంగా చూపినప్పటికీ, అందుకు తగిన విధంగా నిధులు కేటాయించి ఉండాల్సింది. ముఖ్యంగా, విద్య, ఆరోగ్య రంగాలకు కేవలం ఆరు శాతం నిదులు కేటాయించడం సహేతుకంగా కనిపించడం లేదు. ఉద్యోగాల సృష్టి విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్‌ను బట్టి స్పష్టం అవుతుంది. ఆదాయం పన్ను మినహాయింపుకు సెక్షన్ 80 సిసి మరియు 80 ఈఈ తీసివేయడం దేశ భవిష్యత్‌కు మంచిది కాదు. దీంతో ప్రజల్లో పొదుపరితనం కొరవడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్ళకు వడ్డీపై ఆదాయం పన్ను మినహాయింపు వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇది ప్రోత్సహించదు. అందరూ ఊహించినట్లు, ఆశించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన 2020 ఆర్థిక బడ్జెట్లో ఏ రంగానికి కూడా ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు లభించలేదు. పెట్టుబడిదారుల మనోభావాలను గుర్తించడంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలు విఫలమయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 11,650 మార్క్‌కు దిగజారింది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనం నుండి బయటపడటానికి ఆశించిన డిమాండ్‌ను సృష్టించడంలో విఫలమయిందనే చెప్పాలి.
ఆటో లేదా రియల్ రంగంలో అదే పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్‌లో కూడా గందరగోళం నెలకొంది. సెక్షన్ 80 సి కింద అన్ని రకాల మినహాయింపులను తొలగించడంతో కొంత నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. అలాగే, పాత మరియు కొత్త ఆదాయ పన్నుల విధానాలను నిర్ణయించుకునే అవకాశం ఇవ్వడం, ఈ విధానం మరింత సంక్లిష్టంగా మారింది. తక్కువ పన్ను రేట్లతో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, సెక్షన్ 80 సి, మరియు ఇతర మినహాయింపులను తొలగించడం వల్ల ప్రత్యక్ష పన్నులు చెల్లించే వారికి ప్రయోజనాలు తగ్గుతాయి. పాత, కొత్త ఆదాయ పన్ను స్లాబులను ఎంచుకునే గందరగోళంలో రిటర్ను దాఖలు చేయడం క్లిష్టంగా మారుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టిసిడి) కు ఆర్థికమంత్రి కొన్ని మార్పులు చేస్తారని మార్కెట్ ఎక్కువగా ఆశించింది. కానీ అలాంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం ఈక్విటీల కోసం పన్నును రద్దు చేయాలని లేదా కాల పరిమితిని ఒకటి లేదా రెండు సంవత్సరాలకు పొడిగిస్తారని పెట్టుబడిదారులు ఆశించారు.14 సంవత్సరాల విరామం తరువాత ప్రభుత్వం 2018లో ‘ఎల్టిసిజి’ ని తిరిగి ప్రవేశపెట్టింది. పన్నుల వసూళ్ళలో పెరుగుదలపై స్పష్టమైన వైఖరి/ఆలోచన లేకపోవడం గందరగోళం కిందికి వస్తుంది. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయం బడ్జెట్ లక్ష్యం రూ।। 1.55 లక్షల కోట్లు, కానీ ఇది చాలా తక్కువగా ఉండే అవకాశముంది. ఎల్ఐసి వాటా అమ్మకం నుంచి ఎక్కువ ఆశిస్తున్నప్పటికి వార్షిక సం।। 2021కి రూ।। 2.10 లక్షల కోట్ల లక్ష్యం కాస్త ఎక్కువే..! ఆర్థికమంత్రి సీతారామన్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్(డిడిటి)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా వచ్చే 25 వేల కోట్ల రాబడిని కోల్పోవలసి వస్తుంది. ఈ విధానం వల్ల డివిడెండ్ గ్రహీత పన్ను చెల్లించాల్సివొస్తుంది.
డిడిటి రద్దు మరియు డివిడెండ్ గ్రహీత పన్ను చెల్లించడంతో రిటైల్ పెట్టుబడిదారులు అధిక పన్ను చెల్లించాల్సివస్తుంది. ఇప్పుడు డిడిటి 20.35 శాతం ఉంది(సర్‌చార్జ్ మరియు సెస్‌తో సహా). దానికి అదనంగా 20 శాతం పన్ను చెల్లించవలిసి రావడంతో దాన్ని ఈక్విటీ మార్కెట్ ప్రతికూలంగా తీసుకుంటాయి. మొత్తం మీద ఈ బడ్జెట్లో పేదవారికి మేలు చేసే అంశాలేవీ లేవు. అయితే, డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే ఉపయోగ పడుతుంది. ఇది భవిష్యత్‌కు మంచిది కాదు. సామాన్యుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రాయితీలన్నీ కంటితుడుపు చర్యలే. ప్రభుత్వం రాజకీయ, మతపరమైన విషయాల్లో చూపుతున్న శ్రద్ధ ఆర్థికాభివృద్ధి విషయంలో చూపడం లేదు. స్థూలంగా గత ఆరు సంవత్సరాల ఎన్డిఏ ప్రభుత్వం దేశ ఆర్థిక రంగంలో సృష్టించిన చిక్కుముడులను విప్పే ప్రయత్నంగా బడ్జెట్ 2020 కనపడింది.
Also Read: లోక్ సభలో కేంద్ర బడ్జెట్… ముఖ్యాంశాలు