Take a fresh look at your lifestyle.

నిండా మునిగిన నిర్మల్‌ ‌పట్టణం.. పలు కాలనీలు జలమయం

  • నాటుపడవల ద్వారా ప్రజల తరలింపు
  • కడ్తాల్‌ ‌వద్ద 44వ జాతీయ రహదారిపై పొంగుతున్న వరద
  • వరదప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి పర్యటన
  • వరద పరిస్థితులపై మంత్రికి ఫోన్‌ ‌చేసి ఆరా తీసిన సిఎం కెసిఆర్‌

భారీ వర్షాలకు నిర్మల్‌ ‌జిల్లా పరిసర ప్రాతాలు అతలాకుతలం అవుతున్నాయి. నిర్మల్‌ ‌మొత్తం నీట మునిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా దంచికొట్టిన వానకు పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు పలువురు నీట చిక్కడంతో వారిని నాటు పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం రాత్రి నుండి కురిసిన అతి భారీవర్షానికి నిర్మల్‌ ‌జిల్లా అల్లాడిపోతోంది. నిర్మల్‌ ‌పట్టణం దాదాపుగా వరద నీటిలో మునిగిపోయింది. బైంసా డివిజన్‌లో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నిర్మల్‌ ‌పట్టణంలో జిఎన్‌ఆర్‌ ‌కాలనీ అంతా నీట మునిగింది. కాలనీలో ఫస్ట్ ‌ప్లోర్‌ ‌వరకు వర్షపు నీరు వచ్చి చేరింది. ముంపు కాలనీల్లోని ఇండ్లలో వందలాదిమంది వరదనీటిలో చిక్కుకున్నారు. నాటు పడవల సహాయంతో జనాలను బయటకు రప్పించారు. నిండు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, పిల్లలు … ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలో ఇంకా చిక్కుకునే ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కడ్తాల్‌ ‌వద్ద జాతీయ రహదారి 44 రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో 10కిలో మిటర్ల మేర ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది.

హైదరాబాద్‌-‌నాగ్‌పూర్‌ ‌మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుంది. వాన ఉధృతితో రోడ్లన్నీ చెరువులుగా మారి సరిగా కనపడని పరిస్థితి. ప్రమాదాలకు గురికావాల్సిన పరిస్థితి నెలకొనడంతో వర్షం తగ్గే వరకు వీలైనంత వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నిర్మల్‌ ‌పట్టణంలోని మంజూలా పూర్‌, ‌మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్‌, ‌సోఫీ నగర్‌ ‌కాలనీలను మంత్రి పరిశీలించారు. జోరు వానలోనే పలు కాలనీలలో పర్యటిస్తూ అధికారులకు సూచనలిస్తూ.. మంత్రి ప్రజలకు భరోసా కల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్‌ ‌చరిత్రలో ఎన్నడు కూడా ఇంతటి వర్షం కురవలేదన్నారు. పలు కాలనీలు జలమయ్యాయని, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.

నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు కూడా బాధితులకు సహాయం చేయాలని కోరారు. జిల్లా అధికారులతో మంత్రి కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో సమిక్ష నిర్వహించారు. ఈ వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వర్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్చలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్‌ ‌పట్టణం నీట మునిగినందున వెంటనే అక్కడికి ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలను పంపాలని సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. మరోవైపు నిర్మల్‌లోనే ఉన్న మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డికి సిఎం కెసిఆర్‌ ‌ఫోన్‌ ‌చేసి పరిస్థితిని ఆరా తీసారు. అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు.

Leave a Reply