- తీహార్ జైలు 3వగదిలో వేకువ జామున శిక్ష
- రాత్రంతా నిద్రపోకుండా గడిపిన దోషులు
- ఉరి అమలును ధృవీకరించిన జైలు అధికారి సందీప్ గోయల్
- దీన్‌దయాల్ దవాఖానాలో పోస్ట్ మార్టమ్ ..
ఒక అంకం ముగిసింది. ఎనిమిదేళ్లుగా చట్టం కోరల నుంచి తప్పించుకునే యత్నం చేసిన దుర్మార్గుల చరిత్ర ముగిసింది. తెల్లవారుతున్న వేళ వారి బతుకు చీకట్లో కలిసిపోయింది. ఎంతోకాలంగా మృత్యువు వెన్నాడుతున్నా ..నిర్భయంగా బతికేసిన వారు ఇక బతక్కుండా చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులు నలుగురికి ఏకకాలంలో మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో రట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాల్ ప్రత్యేకంగా తెప్పించిన మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఉరిశిక్షను తప్పించుకునేందుకు చివరి వరకు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేయడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు.
తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు. ఇకపోతే గురువారం రాత్రి వరకు హైడ్రామా నడిచింది. వారి ఉరిని ఆపేందుకు దోషుల తరఫున వకాల్తా పుచ్చుకున్న లాయర్ ఎపి సింగ్ ప్రయత్నించారు. రాత్రి 11గంటల వరకు ఆయన కోర్టు తలుపుతట్టి , స్టే తెచ్చే ప్రయత్నం సినిమాను తలపించింది. అయితే డెత్ వారెంట్ ఫైనల్ అని కోర్టు ఖరాఖండిగా చెప్పడంతో ఉరితీతకు ఉన్న దారులు మూసుకుపోయాయి. దీంతో జైలు అధికారులు ప్రత్యేక భద్రత మధ్య తెల్లవారు జామున ప్రత్యేక భద్తర మధ్య.. తీహార్ జైలు 3వ నంబర్ గదిలో నలుగురు దోషులకు ఏకకాలంలో ఉరి అమలు చేశారు. ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని తెలిపారు. గత రాత్రి భోజనం చేయలేదని, ఉరి తీసే గంట ముందు బ్రేక్ ఫాస్ట్‌కు నిరాకరించారని పేర్కొన్నారు. ఉరి అమలు ముందు గురువారం రాత్రి వారిని విడివిగా ప్రత్యేక గదుల్లో ఉంచామని తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు వారు నిద్ర లేచారని, అప్పటికే సుప్రీం కోర్టు వారి చివరి పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపారు.
దోషులను స్నానం చేయాలని కోరగా.. ఎవరూ అంగీకరించలేదని అన్నారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసినట్లు వెల్లడించారు. సరిగ్గా 5:30 గంటలకు నిర్భయ దోషులను ఉరితీశామని తీహార్ జైలు అధికారి సందీప్ గోయల్ చెప్పారు. ఇకపోతే ఉరికి ముందు దోషులను నిర్భయ కుటుంబ సభ్యులకు చూపించామని జైలు అధికారులు చెప్పారు. ఉరి అమలు నేపథ్యంలో జైలంతా లాక్డౌన్లో ఉంచామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కారాగార సమయంలో పవన్, వినయ్, ముఖేష్ జైల్లో పనిచేశారని, వారు సంపాదించిన మొత్తం ఆయా కుంటుంబాలకు అందిస్తామని జైలు అధికారులు చెప్పారు. నిబంధనల మేరకు తలారి పవన్ జల్లాద్ దోషులను 30 నిముషాలపాటు ఉరికి వేలాడదీశాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
ఉరితీయొద్దని వేడుకున్న వినయ్:
ఇదిలాఉండగా.. ఉరి అమలుకు ముందు వినయ్ కుమార్ ఉరి తీయొద్దని పోలీసులను వేడుకున్నట్టు తెలిసింది. ఉరి భయాల నేపథ్యంలో అతను గత ఫిబ్రవరిలో గోడకు తల బాదుకున్నట్టు సమాచారం. అయితే నిర్భయ దోశులకు ఈ రోజు ఉరిశిక్ష విధిస్తున్న సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది.. వారికి జీవితంపై ఆశలు ఉన్నాయా? మరికాసేపట్లో మరణిస్తామన్న సంగతి తెలిస్తే ఎవరికైనా ఎలా ఉంటుందో అన్న విషయం రకరకాల చర్చలు సోషల్ డియాలో సాగుతున్నాయి. అయితే నిర్భయ దోషులకు మాత్రం తమ మరణం తథ్యమని తెలుసు. దాన్ని సాధ్యమైనంత వరకూ వాయిదా వేయిద్దామని చూసి, విఫలమయ్యారు. చివరి క్షణాలు వచ్చేసరికి వారిలో మరణ భయం స్పష్టంగా కనిపించిందని జైలు అధికారి ఒకరు తెలిపారు.
ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర పోలేదట.. వారిని ఉరికంబానికి తీసుకు వెళ్తన్న సమయంలో మాత్రం తనను క్షమించాలని ముఖేశ్ సింగ్ పదేపదే జైలు అధికారులను వేడుకున్నాడని తెలుస్తోంది.తనను ఉరి తీయవద్దని అడుగుతూ ఉంటే, అధికారులు మాత్రం అతని వ్యాఖ్యలను పట్టించుకోకుండా, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అయితే ఉరిశిక్ష అమలు పరిచే సమయంలో అక్కడ ఐదుగురు మాత్రమే ఉన్నారట. జైల్లో ఉన్న సమయంలో అక్షయ్ ఏ పని చేయలేదట.. కానీ పవన్, వినయ్, ముఖేశ్ కూలీ పని చేస్తూ కొంత డబ్బు సంపాదించారట. ఆ సొమ్ము వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.
నిర్భయ దోషులు మరణించారని డాక్టర్ల ధ్రువీకరణ
తీహార్ జైలు, న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార కేసులో నలుగురు దోషులకు ఉరి తీసిన అనంతరం వైద్యులు పరిశీలించి వారు మరణించారని ధ్రువీకరించారు. శుక్రవారం ఉదయం నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్(32), వినయ్ శర్మ(26), అక్షయ్ ఠాకూర్ సింగ్(31), పవన్ గుప్తా(25) లకు ఉరివేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలా ఉరికంబాలపై ఉంచారు. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని
వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించారని తేలింది.
మహిళలకు ఊరట
దేశంలో ఓ ఆడపడుచుకి ఇన్నాళ్లకు న్యాయం జరిగింది.. కన్నూ న్నూ కానకుండా కామంతో రగిలిపోయి.. అన్యాయంగా ఓ యువతి పై అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ పార్టస్ ని దారుణంగా హింసించి ఆమె మరణానికి కారణం అయిన నింధితులకు ఉరిశిక్ష విధించారు. ఎంతో భవిష్యత్ ఊహించుకొని పారామెడిస్ చేస్తున్న ఓ యువతి జీవితాన్ని ఛిత్రం చేసి భూలోకంలోనే యమలోకాన్ని చూపించిన నిర్భయ నింధితులకు ఉరిశిక్ష పడటంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎంతో మంది నింధితులు ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్న నిర్భయ నింధితులకు ఉరిపడ్డట్టే వారికి కఠిన శిక్ష
అమలు చేయాలని మహిళాలో లోకం కోరుకుంటుంది.