దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర పోరాటం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులకు ఏడు సంవత్సరాల తర్వాత ఊరట లభించింది. ఎట్టకేలకు పాటియాల హౌస్ కోర్టు గతంలో ఢిల్లీకోర్టు దోషులపై జారీచేసిన డెత్‌వారంట్‌ను ఈ జనవరి 22న అమలు చేయాలని ఆదేశించడంతో ఏడేళ్ళగా నిర్భయ తల్లిదండ్రులు చేస్తున్న నిర్విరామ పోరాటం ఫలించినట్లైంది. దీంతో నిందితులకు అన్నిమార్గాలు మూసుకుపోయినట్లైంది. అయినా చావు నుండి తప్పించుకునేందుకు మరోసారి సుప్రీమ్‌కోర్టు తలుపులు తట్టనున్నట్లు దోషుల తరఫు న్యాయవాది చెబుతున్నప్పటికీ దోషులు ఉరి నుండి ఎట్టిపరిస్థితిలో తప్పించుకోలేరన్నది స్పష్టమవుతున్నది. ఎందుకంటే గతంలోనే సుప్రీమ్‌కోర్టు ఈ కేసుకు సంబంధించిన రివ్యూ పిటీషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఉరిశిక్ష అమలు ఖాయమని తెలుస్తున్నది. కేవలం ఉరిశిక్ష అమలులో కావాలనిజాప్యం చేయడం కోసమే దోషులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దారుణ అత్యాచారానికి గురైన తమ కూతురు మృత్యువుతో పోరాడి చనిపోయిన కేసులో ఏడు సంవత్సరాలుగా కాలుకు బలపం కట్టుకుని తిరిగాల్సి వొచ్చిందని,, కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా శిక్షను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంపై నిర్భయ తల్లి ఆశాదేవి అనేకమార్లు ఆవేదన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దిశ కేసులో తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండు రోజు) వ్యవధిలోనే ఆమె కుటుంబానికి న్యాయం చేసిందని, అలాంటి న్యాయాన్ని తమకు కలిగించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె వేడుకున్న విషయం తెలియంది కాదు. వాస్తవంగా 2012 డిసెంబర్ 16న అత్యాచారానికి గురైన నిర్భయ పదమూడు రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది.
ఈ కేసులో వాస్తవంగా ఆరుగురు నిందితులు కాగా 2013 సెప్టెంబర్ 13న నలుగురు దోషులకు న్యాయస్థానం ఉరిశిక్షను ఖరారు చేసింది. మిగితా ఇద్దరిలో ఒకరు జైల్లోనే మరణించగా, మరోవ్యక్తి మైనర్ కావడంతో మూడు సంవత్సరాల స్వల్ప జైలు శిక్ష అనంతరం విడిచిపెట్టారు. కాగా, చట్టాల్లోని కొన్ని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి దోషులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న కారణంగా ఏడేళ్ళుగా ఉరి నుండి తప్పించుకోగలిగారు. తాజాగా పాటియాల హౌస్‌కోర్టు గతంలో ఢిల్లీ కోర్టు ఇచ్చిన మరణశిక్షను ఖరారు చేస్తూ దోషులైన ముఖేష్, పవన్‌గుప్తా, అక్షయ్‌కుమార్, వినయ్‌శర్మలకు డెత్ వారెంట్‌ను జారీచేసింది. వీరిని ఈ నెల 22న ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాల్సిందిగా ఆదేశించింది. ఇప్పటికే తీహార్‌జైల్లో ఉన్న ఈ నలుగురిని ఒకేసారి ఉరితీసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇలా నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలుచేయడమన్నది దేశ చరిత్రలో ఇదే మొదటి సారంటున్నారు. ఆలస్యమైనా చట్టం నలుగురికి ఉరిశిక్ష విధించడంపట్ల పలువురు హర్హం వ్యక్తంచేస్తున్నారు. నిర్భయ విషయంలో వారి తల్లిదండ్రులకు ఈ తీర్పు న్యాయం చేసిందనేకన్నా సంతృప్తిని కలిగించిందని చెప్పవచ్చు.
తీర్పు వెలువడిన వెంటనే అదే విషయాన్ని ఆశాదేవి చెబుతూ, నేరాలకు పాల్పడేవారు ఈ తీర్పును చూసైనా వణికిపోవాలంటూ, భారత న్యాయవవస్థపై దీనితో ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడు తుందంటూ తీర్పు పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే పాటియాల హౌజ్ కోర్టు దోషుల శిక్షకు పద్నాలుగు రోజుల వ్యవధిని ఇచ్చింది. దోషుల తరఫు న్యాయవాది చెబుతున్నట్లు ఈ వ్యవధిలో సుప్రీమ్‌కోర్టులో క్యూరేటివ్ పిటీషన్ వేసు కోవడం కాని, రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసు విషయంలో సుప్రీమ్‌కోర్టు ఇంతకు ముందే ఒక దోషి పిటిషన్‌ను తోసివేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది స్పష్టంగా చెప ్పలేకపోయినా ఇంత దారుణానికి పాల్పడిన వారిని క్షమించే అవకాశాలుండకపోవచ్చను కుంటున్నారు. ఇదిలా ఉంటే మరో విచిత్రకర విషయమేమంటే న్యాయమూర్తి డెత్ వారెంట్ డిక్లేర్ చేసిన వెంటనే తన కుమారుడిని క్షమించి వదిలేయమని నిందితుడిలో ఒకడైన ముఖేష్ సింగ్ తల్లి, నిర్భయ తల్లి ముందు కొంగుచాపి వేడుకోవడం… నీ కొడుకులాగానే నాకూ కూతురు ఉంది. ఆమె పరిస్థితి ఏమైంది. తానుకూతురుకు జరిగిన అన్యాయంపై ఏడేళ్ళుగా పోరాటం చేస్తున్నానంటూ ఆ నిందితుడి తల్లికి చెప్పడం ఈ కేసులో చివరి ఘట్టం.
Tags: death warrant, nirbhaya, Guilty, delhi gang rape