- రాజ రాజ నరేంద్ర గ్రంథాలయానికి తాళం వేసిన వైనం ..
- కవులు, రచయితలు, కళాకారుల నిరసన
రాష్ట్రంలో అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిర్భంద వ్యతిరేక సభను హన్మకొండ పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం రాజరాజనరేంద్ర భాషా నిలయంలో కవులు, రచయితలు, అధ్యాపకుల ఆధ్వర్యంలో గ్రంథాలయంలో ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా సాయంత్రం 6గంటలకు పోలీసులు గ్రంథాలయాన్ని సభ జరుగకుండా మూసివేయించారు. లైబ్రేరియన్‌ను సదానందంను పోలీసులు సభకు అనుమతి లేదని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎ.బాసిత్, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, మెట్టు రవీందర్, బ్రహ్మచారి, నల్లెల్ల రాజయ్య, కోడం కుమార్, అనిశెట్టి రజిత, తంగెళ్ల సుదర్శనం తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ వరంగల్‌లో ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ, సభా హక్కు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. హాల్ మీటింగులను అడ్డుకోవడం సబబుకాదన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించి ప్రొఫెసర్ కాశీంను అక్రమంగా అరెస్టు చేశారని ఖండించారు.
దళిత పేద కుటుంబం నుంచి వచ్చి సమాజం కోసం మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ను అక్రమ కేసులతో నిర్భందించడం తగదన్నారు. భేషరతుగా విడుదల చేయాలన్నారు. చెలిమె సాహిత్య వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ మాట్లాడుతూ ఏడాదిగా విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను నిర్భందం చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడడం పోలీసులు నేరంగా చూడవద్దన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన ప్రొఫెసర్ కాశీం, భీమాకోరేగాం కేసులో జైలులో ఉన్న వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను విడుదల చేయాలని దేశంలో ప్రజామేధావులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని కవులు, రచయితలు, కళాకారులు, అధ్యాపకులు, హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేశారు. టిపిఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, సిఎంఎస్ నాయకురాలు రమాదేవి, సిఎల్సి నాయకులు దాడబోయిన రంజిత్, ప్రవీణ్, కవులు అన్వర్, విరసం సభ్యులు బ్రహ్మచారి, శాఖమూరి రవి తదితరులు పాల్గొన్నారు.