Take a fresh look at your lifestyle.

తెలంగాణలో నైట్‌ ‌కర్ఫ్యూ

  • మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అమలులోకి
  • మే 1 వరకు కొనసాగింపు
  • అత్యవసర సేవలు, అంతర్రాష్ట రవాణాకు మినహాయింపు
  • హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌వేళల్లో మార్పులు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ 19 ‌నియంత్రణ చర్యలలో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అమలులోకి వచ్చింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి మే 1 వరకూ కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. కొరోనా కేసులు రోజరోజుకూ భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ లేదా వారాంతపు లాక్‌డైన్‌ ‌విధించే అంశంపై 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే, అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, షాపింగ్‌ ‌మాల్స్ ‌నిర్వహణకు అనుమతించింది. అదే విధంగా మీడియా, పెట్రోల్‌ ‌బంక్‌లు, ఐటీ సేవలకు కూడా అనుమతించింది. ఇక కోల్డ్ ‌స్టోరేజ్‌లు, వేర్‌ ‌హౌసింగ్‌, ‌విద్యుత్‌ ‌సేవలు యధాతథంగా కొనసాగుతాయనీ, స్థానిక, అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అదే విధంగా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ప్రత్యేకమైన పాసులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చిన సర్వీసులు : ఇ కామర్స్ ‌వస్తువుల డెలివరీ, పెట్రోల్‌ ‌పంపులు, ఎల్పీజీ, సిఎన్‌జి, గ్యాస్‌ అవుట్‌లెట్లు, శక్తి ఉత్పాదన, పంపిణీ, నీటి సరఫరా, పారిశుధ్యం, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, ప్రొడక్షన్‌ ‌యూనిట్లు యధావిధిగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఈ సంస్థలలో పనిచేసే వారు తప్పనిసరిగా ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు కూడా కర్ఫ్యూ విధించిన సమయంలో బయటికి వచ్చిన పక్షంలో ఐడీ కార్డు చూపించి ప్రయాణాలు చేయవచ్చు. అలాగే, వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ ‌సిబ్బంది, గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైన వారు మాత్రమే బయటికి రావాలని ప్రభుత్వం నిర్దేశించింది. నైట్‌ ‌కర్ఫ్యూ నిబందనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం పోలీసు శాఖకు  ఉందని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు, హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఎప్పటిలాగే ప్రతీ రోజూ ఉదయం 6 30కు సర్వీసులు ప్రారంభమవుతాయనీ, రాత్రి 7 45 గంటలకు చివరి రైలు ఉంటుందని మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు.

Leave a Reply