Take a fresh look at your lifestyle.

ఒక్క రోజే కొత్తగా నమోదైన పాజిటివ్‌ ‌కేసులు..75,760

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కొరోనా
రాష్ట్రంలో కొత్తగా 2,797 కేసులు..
తెలంగాణ పోలీస్‌ ‌శాఖను కలవరపెడుతున్న కొరోనా

న్యూఢిల్లీ: ‌భారత్‌లో కొరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 75,760 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 1,023 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో  దేశంలో కొరోనా మరణాల సంఖ్య 60,472కు చేరింది. ఇక భారత్‌లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా..మొత్తంగా కొరోనా బాధితుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. వైరస్‌ ‌వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తున్నప్పటికీ రికవరీ రేటు 76.24 శాతానికి చేరడం సానుకూల అంశంగా పరిణమించింది. కాగా దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్‌ ‌కేసుల శాతం 21.93గా ఉండగా..వైరస్‌తో మరణాల 1.83 శాతానికి తగ్గింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన వైరస్‌ ‌నిర్దారణ పరీక్షల సంఖ్య 9,24,998. ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కోవిడ్‌ ‌టెస్టుల సంఖ్య 3,85,76,510గా ఉంది. ఇకపోతే కొరోనా వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు నిష్పక్షపాతంగా పంపిణీ చేయడం సవాల్‌తో కూడుకున్న విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ ‌తెలిపారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బెంగళూరు(ఐఐఎంబీ)లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఆమె మాట్లాడారు. కొరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి 2021 ప్రారంభంలో మనం శుభవార్త వినొచ్చన్నారు. అయితే వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చాక అన్ని దేశాలకు సమ ప్రాధాన్యంతో దానిని పంపిణీ చేయడం సవాల్‌తో కూడుకున్న విషయం అని సౌమ్య స్వామినాథన్‌ ‌తెలిపారు. వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా భారత్‌కు మంచి పేరు ఉన్నది. రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఆ దేశంలో ఇప్పటికే పలు కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ ‌మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు అర్థమవుతున్నదని చెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా 2,797 కేసులు..తెలంగాణ పోలీస్‌ ‌శాఖను కలవరపెడుతున్న కొరోనా
తెలంగాణలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో 2,797 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 1,14,483 కొరోనా కేసులు నమోదు కాగా…మొత్తం 789 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 27,600 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. 86,089 మంది కొరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,42,480 కొరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర  పోలీస్‌ ‌శాఖలో కొరోనా కేసులు కలవర పెడుతున్నాయి. పోలీస్‌ ‌శాఖలో మొత్తం 5,684 పోలీసు సిబ్బంది కొరోనా బారిన పడ్డారు. వీరిలో 2,284 మంది డిశ్చార్జ్ అవగా…3,357 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 44 మంది పోలీసులు కొరోనాకు బలయ్యారు. అమరులైన వారిలో కానిస్టేబుల్‌ ‌నుంచి అడిషనల్‌ ఎస్పీ ర్యాంక్‌ ‌వరకు ఉన్నారు.

మొత్తం డిపార్ట్‌మెంట్‌లో 54 వేల మంది సిబ్బంది ఉండగా…పది శాతం మందికి కొరోనా సోకింది. వైరస్‌ ‌కేసుల్లో హైదరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌టాప్‌లో ఉంది. హైదరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో 1,967 మంది కొరోనా బారిన పడగా…అందులో 891 మంది చికిత్స పొందుతున్నారు. 1053 మంది రికవరీ అవగా…23 మంది కొరోనాతో మృతి చెందారు. తర్వాతి స్థానంలో వరంగల్‌ ‌నిలిచింది. వరంగల్‌లో 526 కేసులు ఉండగా, 361 మంది చికిత్స పొందుతున్నారు. 163 మంది కొరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా కొరోనాకు ఇద్దరు పోలీసులు బలి అయ్యారు.

Leave a Reply