- కొరోనా కొత్త స్టెయ్రిన్తో పెద్దగా ముప్పు లేదు
- కాంటాక్ట్‌లను ట్రేస్ చేస్తున్నాం : డిహెచ్ శ్రీనివాసరావు
- వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి ఈటల
కొరోనా నేపథ్యంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని, కొత్త తరహా కరోనా వైరస్‌పై ఆందోళన అవసరం లేదని డిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. తక్కువ సంఖ్యలో కుటుంబ సభ్యులతో కొత్త సంవత్సర వేడుకలు చేసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా 20 స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 166 కాంటాక్ట్‌లను ట్రేస్ చేశామని…ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని…అందరికీ నెగిటివ్ వొచ్చిందని తెలిపారు. ఇంకా 56 మంది ఆచూకీ కనుక్కోవాల్సి ఉందని…. విదేశాల నుంచి వొచ్చిన వారిలో పాజిటివ్ వొచ్చిన వారికి టీమ్స్‌లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 1.17 శాతం ఈ వారంలో కొరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని…కొత్త వేరియంట్ వైరస్ స్థానిక ప్రజలకు సోకే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావొద్దని…కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో ఇంకా సెకండ్ వేవ్ రాలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
మరోవైపు కొత్త రకం కొరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర దేశాల నుంచి శంషాబాద్‌కు వొస్తున్న ప్రయాణీకులకు నిబంధన విధించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి 96 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును తప్పనిసరిగా చూపించాలని ఆదేశించారు. శంషాబాద్‌లో ల్యాండ్ కాగానే ఆ రిపోర్టు చూపిస్తేనే.. విమానాశ్రయం నుంచి బయటకు పంపుతామని అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు కూడా ఆర్టీపీసీఆర్ రిపోర్టును చూపించిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 7 నుంచి 8 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. బ్రిటన్ నుంచి వొచ్చే విమానాలు ఇప్పటికే నిలిచిపోయాయి. ఇక షార్జా, అబుదాబి, దోహా, ఖతార్‌తో పాటు ఇతర విమానాశ్రయాల నుంచి నిత్యం 900-1000 మంది ప్రయాణికులు వొస్తున్నారు. వీరిలో 100 నుంచి 120 మంది వరకు ఆర్టీపీసీర్ రిపోర్టు లేకుండానే శంషాబాద్‌కు వొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీపీసీఆర్ రిపోర్టును శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు తప్పనిసరి చేశారు.