- పాతకొత్తల కలయికతో మోడీ కేబినేట్ విస్తరణ
- కొత్తగా 36 మందికి కేబినేట్లో చోటు
- మంత్రివర్గంలో 77కు చేరిన మంత్రుల సంఖ్య
- యువత, మహిళలు, విద్యావంతులకు పెద్దపీట
- 12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన
- కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రమోషన్
- కొత్త మంత్రులు 43 మందితో ప్రమాణం చేయించిన రామ్‌నాథ్ కోవింద్
అలాగైతే మోదీ కూడా తప్పుకోవాలి..12 మంది కేంద్ర మంత్రులను తప్పించడం పై కాంగ్రెస్ విమర్శ
బుధవారం తీవ్ర కసరత్తు తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ముగిసింది. ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు. కేబినేట్‌కు కొత్త రూపు కల్పిస్తూ 43 మందికి చోటు కల్పించారు. యువకులను, ఉన్నత విద్యావంతులను, మహిళలను తీసుకోవడం ద్వారా కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. యూపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 7గురికి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం దక్కింది. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు.
బుధవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. వారిచేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. డాక్టర్ వీరేంద్ర కుమార్, సర్బానంద సోనోవాలా, డాక్టర్ వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్సీపీ సింగ్, అశ్వనీ వైష్ణవ్, పశుపతి కుమార్ పారస్, కిరణ్ రిజిజు, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, మన్సుఖ్ మాండవ్య, పురుషోత్తం రూపాలా, భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పంకజ్ చౌధరి, అనుప్రియా పటేల్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ,అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మహిళా శక్తి, యువ శక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
యువత చేతికి పగ్గాలు ఇచ్చేందుకు మోదీ నిర్ణయించుకోవడంతో కొత్తగా మంత్రులవుతున్న యువ నేతలకు అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పలువురు మహిళలకు చోటు దక్కింది. కొత్తగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేబినేట్ బెర్త్ దక్కింది. ఇలా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వొచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు, చేర్పులు చేసింది. కొత్తగా 36 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పటికే కేబినెట్లో ఉన్న ఏడుగురికి వారి పనితీరు ఆధారంగా పదోన్నతి కల్పించారు. దీంతో మొత్తంగా 43 మంది బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేబినెట్లో పలువురి శాఖల్లో మార్పులు జరగున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రులు, సహాయ శాఖ మంత్రులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జవదేకర్, సంతోశ్ కుమార్ గంగ్వార్, సదానంద గౌడ, థావర్ చంద్ గెహ్లాట్, సంజయ్ శ్యామ్ రావు, ప్రతాప్ చంద్ర సారంగి, దేవ శ్రీ చౌదరి, బాబుల్ సుప్రియో, సంజయ్ ధోతరే, రతన్ లాల్ కటారియా, ధన్వే పాటిల్, అశ్వినీ చౌబే వంటి వారికి మోడీ ఉద్వాసన పలికారు.
కొరోనా సంక్షోభం సమయంలో ప్రభుత్వంపై వొచ్చిన విస్తృత విమర్శల నేపథ్యంలో పలువురు మంత్రులు పదవులు కోల్పోయారు. వినాశకరమైన కోవిద్ రెండవ వేవ్ నేపథ్యంలో మంత్రులు ప్రభుత్వంపై వొచ్చిన విమర్శలు తిప్పికొట్టలేదని కూడా ప్రధాని మోడీ ఆగ్రహాన్ని కొంతమంది మంత్రులు చవి చూడాల్సి వొచ్చింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో కలిపి మోడీ కేబినెట్లో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. నిసిత్ ప్రామాణిక్ వయసు 35 సంవత్సరాలు. ఈయన మోదీ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. ఆయన బీసీఏ చదివారు. ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పని చేశారు. శాంతన ఠాకూర్ కూడా పశ్చిమ బెంగాల్ నాయకుడే. 38 ఏళ్ళ వయసుగల శాంతను తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన బొంగావ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీఏ చదివారు. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశారు.
అనుప్రియ సింగ్ పటేల్ అప్నాదళ్ (ఎస్) నేత. అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్‌లోని మిర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆమె దివంగత డాక్టర్ సోనీలాల్ పటేల్ కుమార్తె. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఛత్రపతి సాహూజీ మహరాజ్ విశ్వవిద్యాలయాల్లో చదివారు. భారతి ప్రవీణ్ పవార్ మహారాష్ట్రలోని డిండోరి (ఎస్టీ) నియోజకవర్గం బీజేపీ ఎంపీ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్. ఆమె నాసిక్‌లో ఎంబీబీఎస్ చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూవర్షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. డాక్టర్ మురుగన్ మద్రాస్ హైకోర్టులో సుమారు 15 సంవత్సరాలు న్యాయవాద వృత్తిని నిర్వహించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షునిగా పని చేసిన అనుభవం ఉంది. జాన్ బర్లా పశ్చిమ బెంగాల్‌లోని అలిపుర్దౌర్స్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తేయాకు తోటల్లో పని చేసే కార్మికుల హక్కుల కోసం ఆయన కృషి చేశారు. ఆయన తన 14వ ఏట నుంచి తేయాకు తోటలో కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. 2019 మేలో రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ మంత్రుల మండలిలో ఇది మొదటి పునర్నిర్మాణం అవుతుంది.
అలాగైతే మోదీ కూడా తప్పుకోవాలి..12 మంది కేంద్ర మంత్రులను తప్పించడం పై కాంగ్రెస్ విమర్శ
కేంద్ర కేబినెట్ విస్తరణ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 12 మంది కేంద్ర మంత్రులను తప్పించారు. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. వారి వారి పనితీరును పరిగణనలోకి తీసుకొని గనక తప్పిస్తే, ఆ లెక్కన ప్రధాని మోదీని కూడా బాధ్యతల నుంచి తప్పించాల్సిందేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా తప్పించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆయన హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని ఆయన ఆరోపించారు. ఇక కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అమిత్‌షాను కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన కాలంలోనే నక్సలిజం, మూకదాడులు ఘోరంగా పెరిగిపోయాయని సూర్జేవాలా ఆరోపించారు. ఇదే కోవలోకి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కూడా తొలగించాలని సూచించారు. ఆయన హయాంలో పెట్రో ధరలు విపరీతంగా పెరిగి, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని సూర్జేవాలా మండిపడ్డారు. ఇది కేబినెట్ విస్తరణ ఎంత మాత్రమూ కాదని, కేవలం పార్టీలు మారిన వారికి పదవులు ఇచ్చే కార్యక్రమం అని సూర్జేవాలా ఎద్దేవా చేశారు.
వారంతా మోదీకి అవసరం : ఖర్గే
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… ‘‘చాలా మంది దళితులను, వెనుకబడిన తరగతులకు చెందిన వారిని కేబినెట్లోకి తీసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ కూర్పు చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ కూర్పు. ఆయా సామాజిక వర్గాల బాగు కోసమేమీ కాదు. ఇలా చేయడం మోదీకి అత్యావశ్యకం. అందుకే దళితులను, వెనుకబడిన వర్గాల వారికి చోటు కల్పించారు’’ అంటూ ఖర్గే విమర్శించారు.