నూతన సచివాలయం నిర్మాణం – నేపథ్యం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, అన్ని వసతరులతో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అందుకు పాత సచివాలయం స్థితిగతుల పై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినేట్ సబ్ కమిటి పాత సచివాలయం కండీషన్ బాగా లేదని సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించింది.ఈ పరిస్థితుల్లో ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో ఒక నిపుణుల కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనంచేసి పలు లోపాలను గుర్తించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నివేదిక ఇచ్చింది. 2019 జూన్ 27న కొత్త సచివాలయం భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. నూతన సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెస్సావో అనే ఆర్కిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ ఆమోదించిన ప్రస్తుత నమూనాతో షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన సచివాలయన్ని నిర్మించే కాంట్రాక్టును దక్కించుకొని అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టింది.
నూతన సచివాలయ భవనం డిజైన్ కు ప్రేరణ :
నిజామాబాదులోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలులు-అక్కడి గోపురాలు, గుజరాత్ లోని సారంగాపూర్ లో ఉన్న హనుమాన్ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. నూతన సచివాలయానికి తూర్పున లుంబినీవనం, అమరజ్యోతి.. పశ్చిమాన మింట్ కాంపాండ్, ఉత్తరాన అంబేద్కర్ విగ్రహం, దక్షిణాన రవీంద్రభారతి వెల్లే రోడ్డు నెలకొని ఉన్నాయి.
నూతన సచివాలయం నిర్మాణం – ప్రత్యేకతలు
కొరోనా, కోర్టు కేసులు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులు 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి. పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనం నిర్మించబడింది. ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఆరో అంతస్తుపైన డోమ్ కు మధ్య 4,500 చదరపు అడుగుల చొప్పున రెండు అంతస్తులను నిర్మించారు. ఆరో అంతస్తులోని సీఎంవోకు చేరుకునేందుకు రెండు లిప్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే. ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు.అన్ని అంతస్థుల్లో ఉద్యోగులకు లంచ్ రూమ్ లను నిర్మించారు. ఆరో అంతస్థులో క్యాబినెట్ మీటింగ్ హాల్, కాన్ఫరెన్స్, హాళ్లను ఏర్పాటు చేశారు. ఏసీ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్ నే నెలకొల్పారు..24 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు. 635 గదులు.. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు.. అదే తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం. రోజూ 3 వేల మందికి పైగా కార్మికులు పనిచేశారు. ఈ విధానంలో పిల్లర్ల తయారీకే 6 నెలల సమయం పట్టింది. మొత్తం 4 ద్వారాలను ఏర్పాటు చేశారు..తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం, సీఎస్, డీజీపీ, మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారు..పడమర వైపు ద్వారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తారు..ఈశాన్య గేటు నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వస్తారు..ఆగ్నేయ ద్వారం నుంచి సందర్శకులు వస్తారు. విశాలమైన పోర్టికో తో ఉన్న ప్రధాన ముఖ ద్వారం సచివాలయ సౌధం అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. ఇంత ఎత్తైన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి.
సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్ తో కూడిన పాస్ లు జారీ..300 సీసీ కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘా..కొత్త భవనంలో అత్యుత్తమ సాంకేతికత వినియోగించడం ద్వారా పాలన ఆన్ లైన్ కానుంది.
కరెంట్ పొదుపునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించే అవకాశం ఉంది.సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఏటీఎమ్ సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్ ఉన్నాయి.
వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్ ను నిర్మించారు.
సచివాలయంతో పాటు గుడి, మసీదు, చర్చిలను కూడా నిర్మించారు. వాటి పక్కనే ముందువైపు రిసెప్షన్ హాల్, ఎన్ ఆర్ ఐ సెంటర్, పబ్లిసిటీ సెల్ పక్కనే మీడియా కోసం గదులు నిర్మించారు.
అందులో రెండుసార్లు 45 రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి. అయినా కార్మికులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
విస్తీర్ణం వివరాలు
మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు
భవనం నిర్మించిన ఏరియా : 2.45 ఎకరాలు
ల్యాండ్ స్కేపింగ్ : 7.72 ఎకరాలు
సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు
పార్కింగ్ : 560 కార్లు, 700 ల బైక్ లు,
యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ.
ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ.
లోయర్ గ్రౌండ్ ం గ్రౌండ్ ం ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు : 14 అడుగులు
అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
భవనం పొడవు, వెడల్పు : 600 • 300
ప్రధాన గుమ్మటాలు (స్కైలాంజ్) : 11వ అంతస్థు
కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.
image.png
నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి గల కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు. సీఎం కేసీఆర్ గారి మాటల్లో …
‘‘దేశం గర్వించదగ్గ రీతిలో అందరివాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాశయుని మహా విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నం. ఈ దేశం ప్రజలకోసం భవిష్యత తరాలకోసం రాజ్యంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధునిగా వారు చేసిన కృషి, త్యాగం అజరామరం. కేవలం దళితులు, గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు.. వివక్షను ఎదుర్కొనే ప్రతి చోటా అంబేద్కర్ ఆశయం సాక్షాత్కారం అవుతుంది. అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. వారి కృషి ఒక్కటని చెప్పలేం. వారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందడమే. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకున్నాం.’’
ప్రతిష్టాత్మక ఐజిబిసి గుర్తింపు
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.