Take a fresh look at your lifestyle.

‌బడ్జెట్‌ ‌సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ బిల్లు..!

new revenue, bill ,budget session,telanganaత్వరలో జరుగనున్న తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల్లో ప్రభుత్వం చెబుతున్న కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది. బూజుపట్టిన గత రెవెన్యూ చట్టంవల్ల రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో వారి కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నది. రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన భూసర్వేలో దాదాపు 80 నుండి 90 శాతం భూముల విషయంలో ఎలాంటి తగాదాలులేవు. అయినా రైతులు, ప్రజలు భూమి విషయంలో నిత్యం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అందుకు  రెవెన్యూ సిబ్బందిలోని కొందరు లాలూచీ పడడమే కారణమన్న విషయం బహిరంగ రహస్యమే. భూమి పేరుమార్పిడి (మ్యుటేషన్‌) ‌చేసేవిషయంలో రెవెన్యూ సిబ్బంది లక్షలాదిరూపాయలను డిమాండ్‌ ‌చేస్తున్న సంగతి తెలియంది కాదు. తాజాగా ఓ అధికారి ఆరు లక్షల రూపాయలను డిమాండ్‌చేసి లక్షరూపాయల అడ్వాన్స్‌గా తీసుకుంటూ ఏసీబికి పట్టుపడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. ఏసిబి వలలో అనేక మంది చిక్కుకుంటున్నా చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగులను ఆసరాచేసుకుని కొందరు అధికారులు, సిబ్బంది తమచేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇవ్వాల్టికీ ఇంకా వేలాదిమంది తమ పాస్‌బుక్కులకోసం రెవెన్యూ కార్యాలయాలచుట్టూ చక్కర్లు కొడుతూనేఉన్నారు. పేర్లు తప్పు పడడమో, భూ కొలతలు తప్పుగా చూపించిన కారణంగానో, ఒక రైతుకు చెందిన భూమిని మరో రైతు పేర మార్పిడి చేసి ఉండటమో ఇలా అనేక సమస్యలతో నిత్యం భూయజమానులు అధికారులు, సిబ్బంది చుట్టూ తిరగక తప్పడంలేదు. రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతి, అలసత్వాన్ని  రూపుమాపేందుకే తెలంగాణ సర్కార్‌ ‌కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ వ్యవస్థను సమూలంగా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గత కొంతకాలంగా పలు వేదికలపైనుండి చెబుతూనే ఉన్నారు. రెవెన్యూశాఖ సమర్థవంతంగా పనిచేస్తే రైతులు పెట్రోల్‌ ‌సీసాలు పట్టుకుని కార్యాలయాలకు ఎందుకు వస్తారంటూ కెసిఆర్‌ ‌పేర్కొనడాన్నిబట్టి ప్రజలు ఎంత ఘోరాతిఘోరంగా ఇబ్బంది పడుతున్నారన్నది అర్థమవుతున్నది.

వివిధ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని పరిశీలించినప్పుడు రెవెన్యూ శాఖనే నంబర్‌ ‌వన్‌గా ఉందని తేలిన విషయాన్నికూడా ఆయనే చెప్పుకొచ్చారు. ఈ విచ్చలవిడితనాన్ని, అరాచకత్వాన్ని ఇకముందు కొనసాగనివ్వకుండా దీనికి సరైన సర్జరీ చేయాలన్న ముఖ్యమంత్రి, అందుకు సంబందించిన కసరత్తును కొద్దినెలలుగా చేపట్టారు. వాస్తవంగా భూములు తదితర వ్యవహారాలకు సంబందించి ఇప్పటికే వందకు పైగా చట్టాలున్నాయి. అయితే అందులో కాలంచెల్లినవి అనేకం ఉన్నాయని, అవసరంలేనివాటిని తొలగించి, వాటి స్థానంలో కొత్త నిబంధనలతో చట్టం ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో 1999లోనే అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న దేవేందర్‌గౌడ్‌  196 ‌చట్టాలను ఏకీకృతం చేస్తూ ఏపి ల్యాండ్‌ ‌రెవెన్యూ కోడ్‌ను ప్రవేశపెట్టి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినఫైల్‌కు నేటికీ అతీగతీలేదు.

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన దరిమిలా  తెలంగాణకు అనుకూలమైన రెవెన్యూకోడ్‌ను ఏర్పాటుచేసుకోవాలన్నది తెలంగాణ సర్కార్‌ ఆలోచన. ఉన్న అనేకచట్టాలను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చే క్రమంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా అటు న్యాయకోవిదులతోనూ, ఇటు రెవెన్యూలో అనుభవమున్న అధికారులతో మా ప్రభుత్వం అనేకసార్లు చర్చలు జరిపి చట్ట ప్రక్షాళన చేపట్టింది. దీనివల్ల రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న ల్యాండ్‌ ‌మాఫియాలు, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న రెవెన్యూ సిబ్బంది ఆటలకు కళ్ళెం పడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. భూ క్రయ విక్రయాలకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసే ఆలోచనలోకూడా  ప్రభుత్వముంది. ఎవరైనా భూమిని కొనుగోలు చేస్తే వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అవుతుంది. అది రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయంతోపాటు బ్యాంకులకు చేరిపోతుంది. దీనివల్ల ఒకే భూమి డ్లూప్లికేట్‌ ‌రిజిష్ట్రేన్‌ ‌జరుగకుండా, బ్యాంకుల్లో దానిమీద అప్పులు తీసుకోవడం ఇక కుదరదు. అలాగే గతంలో బ్యాంకులు అప్పు ఇచ్చే విషయంలో వివిధ పత్రాలకోసం ఇబ్బందులు పెట్టే విధానంకూడా తగ్గిపోతుంది. రుణాల మంజూరు, మార్ట్‌గేజ్‌ ‌విషయంలో  పాస్‌బుక్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్‌ ‌భూరికార్డులను పరిగనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు క్రితంకూడా ఈ వ్యవస్థ ఉన్నప్పటికీ, అది పకడ్బందీగా అమలుకాలేదు. ఇప్పుడు తప్పకుండా ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.

దీంతోపాటు సుదీర్ఘకాలం కోర్టుల్లో కొనసాగుతున్న భూవివాదాలకు కూడా తెరపడే అవకాశంలేకపోలేదంటున్నారు. అలాగే ఇంతకుముందే కెసిఆర్‌ ‌చెప్పిన ఏ రోజు జమాబందీ ఆరోజే ఆన్‌లైన్‌లో కిందిస్థాయి అధికారి మొదలు, పై స్థాయి అధికారి కార్యాలయాల వరకు చేరే ఏర్పాటు చేస్తున్నారు. అమ్మకాలు, కొనుగోళ్ళు, పట్టామార్పిడి అంతా ఆన్‌లైన్‌లో జరిగేట్లుగా ఏర్పాటుచేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ బడ్జెట్‌ ‌సమావేశాల్లో పెట్టే  ఈ బిల్లు  ఇంకా ఎలాంటి మార్పు చేర్పులతో వస్తుందో వేచిచూడాలి మరి.

Tags: new revenue, bill ,budget session,telangana

Leave a Reply