Take a fresh look at your lifestyle.

కొత్త రెవెన్యూ చట్టం

“విలేజ్‌ ‌రెవెన్యూ ఆఫీసర్‌ (‌వీఆర్వో) పోస్టులను రద్దు చేస్తుండటంతో వారందరినీ ఇతర డిపార్ట్మెంట్లలోకి ట్రాన్స్ఫర్‌ ‌చేస్తాం.. ట్రాన్స్ఫర్‌ ఇష్టం లేకుంటే వీఆర్‌ఎస్‌ ‌తీసుకోవచ్చు, లేదా రాజీనామా చేయవొచ్చు. ఇతర శాఖల్లోకి వెళ్లేవారికి సంబంధిత పేస్కేల్‌ ‌ప్రకారం జీతాలు ఇస్తాం, దీనితో సర్కారుపై రెండు, మూడు వందల కోట్ల భారం పడుతుంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ కోసం వీఆర్వోలను నియమించారు… ప్రస్తుతం రికార్డులన్నీ డిజిటలైజేషన్‌ ‌చేయడంతో ఆ పోస్టు అవసరం లేనిదిగా మారింది.. ప్రజలను, ప్రజాప్రతినిధులను సంప్రదించే రద్దు నిర్ణయం తీసుకున్నాం.. గెజిట్‌ ‌వొచ్చే తేదీ నుంచే వీఆర్వో పోస్టులు రద్దవుతాయి. వారిని నాలుగు నెలల్లో ఏదైనా డిపార్ట్‌మెంట్లో సమాన కేడర్‌లోకి ట్రాన్స్‌ఫర్‌గానీ, విలీనం గానీ చేస్తాం. అందుకు ఇష్టం లేనివారు వీఆర్‌ఎస్‌గా గానీ, రిజైన్‌ ‌గానీ ఆప్షన్‌ ఎం‌చుకోవచ్చు..-ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు”

శాసనసభ ఆమోదం
యథాతథంగా రెవెన్యూ శాఖ
ఇకపై రెండు రకాల పాస్‌బుక్కులు
కొత్త చట్టంలోనూ లోపాలున్నాయి : భట్టి
వక్ఫ్, ‌దేవాదాయ భూములను పరిరక్షించండి : అక్బరుద్దీన్‌
అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్‌ ‌పాస్‌పుస్తకాల బిల్లు 2020కు, వీఆర్వో రద్దు బిల్లు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు, పంచాయతీరాజ్‌ 2020 ‌సవరణ బిల్లుకు, పురపాలక చట్టం సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏక్రగీవ ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ ముగిసిన అనంతరం ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన సభ్యులంతా బల్లలు చరుస్తూ బిల్లుకు మద్దతు ప్రకటించారు. అంతకుముందు…తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ శాసనసభలో వాడీవేడీగా చర్చ జరిగింది. శాసనసభ వర్షాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చర్చను ప్రారంభించారు. తెలంగాణ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా ఇది తొలి అడుగుమాత్రమేనని పేర్కొన్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. అయితే, ఈ కొత్త చట్టంలోనూ అనేక లోపాలున్నాయనీ, వాటిని ఎలా సరిదిద్దుతారని కాంగ్రెస్‌ ‌శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. భూ ప్రక్షాళన సమయంలో అనేక అవకతవకలు దొర్లాయనీ, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు, ఇప్పటికే వక్ఫ్, ‌దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయనీ, కొత్త చట్టంతోనైనా వాటిని కాపాడాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ‌ప్రభుత్వానికి సూచించారు. ముందుగా… కొత్త రెవెన్యూ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌చర్చను ప్రారంభిస్తూ రాష్ట్రంలో వీఆర్‌వో వ్యవస్థను మాత్రమే రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ‌యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న వీఆర్‌వో వ్యవస్థ అరాచకాలకు పాల్పడుతుంది. అందుకే రద్దు చేశామన్నారు. ఇక రెవెన్యూ విభాగంలో అన్ని రికార్డులు ఉంటాయి. సర్వే సెటిల్‌మెంట్‌ ‌వ్యవస్థ కూడా ఉంటుందన్నారు. ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.

ప్రజా అవసరాలకు మాత్రమే అసైన్డ్ ‌భూములను తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మాదిరి అసైన్డ్ ‌భూములను తీసుకోవడం లేదు. కేవలం ప్రాజెక్టులు, ప్రజా ప్రయోజనాల నిమిత్తమే ప్రభుత్వం భూములను తీసుకుంటున్నదని సీఎం తెలిపారు. అలాగే రెవెన్యూ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకుని వస్తున్నప్పుడు వ్యవస్థ లేకుండా ఎలా ముందుకు పోతామని అన్నారు. ధరణిలో అన్ని అంశాలను పక్కాగా చేస్తామని అన్నారు. చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ‌పక్షనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..వీఆర్వో వ్యవస్థను కొనసాగించాలన్నారు. ధరణి పోర్టల్‌ను ఎవరైనా హ్యాక్‌ ‌చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో భూమికి, రికార్డులలో నమోదైన వివరాల్లో తేడాలు ఉన్నాయనీ, అసైన్డ్ ‌భూముల సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పలు ప్రాంతాలలో రైతు సమన్వయ సమితి భవనాలు, వైకుంఠధామాల కోసం పేదలకు ఇచ్చిన భూములనే ప్రభుత్వం తీసుకుంటున్నదనీ, పేదల భూములు పోగొట్టుకోకుండానే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామాలలో రైతులకు సహాయం కోసం రెవెన్యూ సిబ్బంది ఉండాలనీ, సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ ‌పూర్తయ్యే వరకూ ప్రస్తుత విధానం కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భట్టి సూచనపై సీఎం కేసీఆర్‌ ‌స్పందిస్తూ వీఆర్వో వ్యవస్థను రద్దు చేశాం, దానిని కొనసాగించాలని మీరు కోరుతున్నారా ?అన్ని ప్రశ్నించారు. కొత్త చట్టాలు రూపొందించేటప్పుడు విశాల ధృక్పదంతో ఆలోచించాలని సూచించారు. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రవేశపెడుతున్న ధరణి పోర్టల్‌ ‌ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుందనీ, ప్రైవేటు సంస్థలకు అప్పగించబోమని స్పష్టం చేశారు. ఈ రికార్డు, డిజిటల్‌ ‌రికార్డు, డాక్యుమెంట్‌ ‌రూపంలో భూ రికార్డులు ఉంటాయనీ, ఒకే సర్వర్‌పై ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఉంటాయనీ, ప్రజలకు మేలు కలిగించే కొత్త రెవెన్యూ చట్టాన్ని శానసభ ఆమోదించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం ….రెవెన్యూ చట్ట సవరణపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ చట్టాల పేరుతో వక్ఫ్, ‌దేవాదాయశాఖ భూములకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని స్వాగతిస్తూనే… వక్ఫ్, ‌దేవాలయ, దర్గా భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్లుగా సర్వేలతోనే సరిపెడుతున్నారని, వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయని వాపోయారు. గత చట్టాలతో ఎక్కువగా ముస్లింలే నష్టపోయారన్నారు. అలాగే హైదరాబాద్‌ ‌పాతబస్తీలో, జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని చాలా మురికివాడలకు లే అవుట్లు లేవని.. కొత్త చట్టంలో వాటిపై దృష్టి పెట్టాలన్నారు. చాలా భూములకు రిజిస్టేష్రన్లు లేక, పిల్లలకు పెళ్లిళ్లు చేయాలన్నా, చదివించుకోవాలన్నా భూ యజమానులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అలాగే గ్రీన్‌ ‌జోన్లను కచ్చితంగా ఏర్పాటు చేయాలని, కాంక్రీట్‌ ‌నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదన్నారు. భూమి పట్టాలు ఆన్‌లైన్‌లోకి ఎక్కించే సమయంలో చాలా అక్రమాలు జరిగాయని అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. నిజంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి చాలా తేడాలున్నాయని ఆయన అన్నారు. ఆలయాలు, దర్గా, వక్ఫ్ ‌భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేయోద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ‘వక్ఫ్ ‌భూములపై సర్వేలతోనే సరిపెడుతున్నారు. స్వాతంత్య్ర వచ్చాక చాలామంది భూములు పోయాయి. వారిలో ముస్లీంల భూములే ఎక్కువగా ఉన్నాయి. అమ్ముకున్నోళ్లు బాగానే ఉంటారు, కానీ కొనుకున్నోళ్లే కష్టాలు పడుతున్నారు. వక్ఫ్, ‌గుడి భూముల్లో అక్రమాలు చేస్తే ప్రాసిక్యూట్‌ ‌చేయాలి. సిటీలో కొన్ని ప్రాంతాలను గ్రీన్‌ ‌జోన్లుగా ప్రకటించాలని ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ ‌ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply