Take a fresh look at your lifestyle.

పాత పంచాయతీలను నిద్రలేపుతున్న కొత్త రెవెన్యూ చట్టం !

“చట్టంపట్ల పరిజ్ఞానం, భూస్వాములకు ఎలాంటి ఇబ్బందిలేదు.కానీ రెండు మూడు ఎకరాలలోపు భూమి కలిగిన నిరుపేదలకు, కష్టాన్ని నమ్ముకోని పనిచేసుకునేవారికి, పనికెళ్ళకుండా ఇంకాస్త ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తుందని చెప్పడంలో నిజం లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలలో పెద్దవారిలో జరిగే విషయాలను పరిగణలోకి తీసుకోని, వారి సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపించి, సమస్యలు జఠిలమవ్వకుండా, ఆస్థి, ప్రాణ నష్టాలకు తావివ్వకుండా ఆదుకునే ప్రయత్నాలలో భాగంగా ప్రకటన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.”

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రెవిన్యూ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా చేపట్టి, ధరణి పోర్టల్‌ ‌కు సైతం సాంకేతిక పరమైన తుదిమెరుగులు గావించి నవంబర్‌ 1 ‌నుండి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రత్యేకంగా రెండు విషయాలను పరిశీలించాలి… మొదటిది ప్రభుత్వం చెబుతున్నట్లుగా పారదర్శకత, అక్రమదారులు అడ్డు తగలకుండా, అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సరిహద్దులు, సులభంగా రిజిస్ట్రేషన్‌ అయ్యేటట్లు, ప్రతి సెంటుభూమి కంప్యూటర్‌ ‌లో నిక్షిప్తం కావడం, కబ్జాదారుల నుండి శాశ్వతంగా రక్షణ పొందే పలు విషయాలను ప్రభుత్వం పదేపదే చెప్పడం శుభపరిణామం గానే భావిద్దాం.. కానీ రెండవ విషయానికి వస్తే సాదాబైనమా ద్వారా ఐదు ఎకరాల లోపుగల వ్యవసాయదారులకు రిజిస్ట్రేషన్‌ ‌కల్పించే వెసులుబాటును కొద్ది రోజుల గడువుతో కేటాయించడం… చూపరులకు, భూ పంచాయతీలు లేనివారికి ఇది కూడా మంచిపని లాగే కనిపించినా, కొంచెం చరిత్రలోకి తొంగిచూస్తే భూ పంచాయతీలకు, పాత కక్ష్యలను నిద్రలేపి తట్టినట్లయ్యింది.

వాస్తవంలోకి వెళ్ళీ విశ్లేషిస్తే …
మూడు నాలుగు దశాబ్దాల క్రితం భూములకు అంతగా ఆర్థిక విలువ లేనప్పుడు ఎలాంటి పంచాయతీలు లేవు. ఏవైనా భూపంపకాలు జరగాలంటే ‘‘ఈ మడి నాకు, ఆ మడి నీకు’’ అని లేదా ముళ్ళు కట్టే, తాడు సాయంతో కొలిచి, ఎలాంటి నిర్దిష్టమైన సరిహద్దులు లేకుండా పంచుకొని వ్యవసాయం చేసుకునేవారు. కాలక్రమేణా పరిణామ క్రమంలో అభివృద్ధి వల్లనో, మార్పుల వల్లనో ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం అభివృద్ధి చెందడం, ఒక్కసారిగా భూముల రేట్లు పది వంతుల కంటే ఎక్కువగా పెరగడం, పట్టణాలు, నగరాలలో భూకబ్జాలు మొదలుకావడం, భూ కక్షలు, చంపడాలు, చావడాలు మొదలుకావడం, సివిల్‌ ‌కోర్టులలో భూపంచాయతీల కేసుల సంఖ్య పెరగడం, ఆ తర్వాత అది నగరాల చుట్టుపక్కలకు పాకి, గ్రామాల వరకు వచ్చి ఎకరాకు 5 నుండి పదివేల వరకు పలికే రేటు కాస్త, ఒక్కసారిగా లక్షలు, అనతికాలంలోనే కోట్ల రూపాయల వరకు పాకడంతో అందరిలో అలజడి ఆరంభమై సన్న, చిన్న కారు రైతులు తమకు ఉన్న కొద్ది భూములను కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా అన్నదమ్ములతో, పొలం చుట్టుపక్కల వారితో తగాదాలు, గొడవలు, కొట్లాటలు కేసులు కోర్టులు అని అన్నింటినీ పరిచయం చేసింది.

అంతెందుకు భూమి రేటు పెరగడంతో కొడుకు తల్లిదండ్రులు, ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు సైతం గొడవలు పడుతూ, కోపంతో క్షణికావేశంలో ఒకరినొకరు చంపుకుని సందర్భాలను సైతం వివిధ దినపత్రికల్లో చూసిన సంగతి అందరికి తెలిసిందే. ఇది ఇంతటితో ఆగకుండా రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య దూరాన్ని పెంచుతూ మన సాంప్రదాయాలను దెబ్బతీస్తూ వస్తుండటం ఒకెత్తయితే…. ఆ దశలోనే భూ పంచాయతీలకు తావుచ్చినట్లుగానే రాజకీయాలు గ్రామాలకు చేరాయి .పలు రాజకీయ పార్టీలు ఇలాంటి సమస్యలతో బాధపడే కుటుంబాలలో ఒకరికి ఒకపార్టీ మద్దతునిస్తే , మరొకరికి ఇంకోపార్టీ మద్దతునిచ్చి ఆ సమస్య పరిష్కారం గాకుండా తీవ్ర జఠిలం చేస్తూ వారిని ఆర్థికంగా దెబ్బతీశారనడంలో నిజంలేకపోలేదు .ఇక్కడా ఆనాటి నుండి నేటి వరకు గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలలో అక్కడక్కడా అన్నదమ్ములు , తల్లీకొడుకులు ఇలా ఒకఇంట్లో వారిని పలురాజకీయాలు ప్రోత్సహించి ఎన్నికలలో నిలబెట్టిన సందర్భాలలో వివిధ దినపత్రికలలో చూసిన సంగతి సైతం విదితమే .

ఇలా భూపంచాయితీలు రగులుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం రావడం , ప్రభుత్వ కార్యాలయాలు అంతగా పనికి నోచుకోకపోవడం, ప్రజల దృష్టియంతా ఉద్యమంపైకి వెళ్ళడం . . ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల మధ్య తెలంగాణ ఏర్పడటం, నూతన రాష్రంలో ప్రభుత్వం ఒక్కరోజులోనే సమగ్రసర్వే నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ప్రతి సమాచారాన్ని సేకరించడం జరిగింది. దానికనుగుణంగా కార్యకలాపాలను గావిస్తూ …రైతు బందు, రైతు బీమా, పంట బీమా లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశబెట్టడం, వీటి అమలుకై తెలంగాణ ప్రభుత్వం పేరిట నూతన పట్టా పాసు బుక్కులను జారీచేయడం జరిగింది. ఈ తతంగంతో కొన్ని సమస్యలకు సమాధానం లభించినట్లయింది. భూములన్నీ కంప్యూటీకరణను చేయడం, రాష్ట్రంలో సాదా బైనమా ద్వారా క్రమబద్దీకరణను నిలుపుదల చేయడంలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో లబ్ధిదారులు కొంత ఆగ్రహాన్ని వెలిబుచ్చిన, మరొక దారిని ఎన్నుకొని గ్రమాపెద్దల సమక్షంలో మాట్లాడుకోని పంచాయతీలను తెంపుకున్న మాట వాస్తవం.

అంతా సద్దుమణిగాక ఎవరికి వారు వారి పనుల్లో నిమగ్నమయ్యాక ఒక్కసారిగా ప్రభుత్వం నూతన రెవిన్యూ చట్టాన్ని తీసుకు వచ్చి సాదా బైనమా ద్వార భూక్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో ఒక్కసారిగా భూకక్ష్యలు, పాత పంచాయతీలకు ఊతమిచ్చినట్లయి , నిద్రలేచి,శిథిలావస్థలోకి జారుకున్న కాగితాలు సైతం లామినేషన్‌లు, జిరాక్స్ ‌లతో కంప్యూటర్‌ ‌లలో అనుసంధానం కావడానికి మీసేవలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వీటి వల్ల జరిగే ఫలితాన్ని పక్కకు పెడితే, ఏం జరుగుతుంది, జరగబోతుందని అనుమానాలతో ఒకరినొకరు ద్వేషించుకొంటూ, పంచాయతీలకు తావునిస్తుంది.పంచాయితీలను తెంపకుండా, తీవ్ర కఠినం చేసేవిధ•ంగా వారు వారి పనుల్లో నిమగ్నమై సమస్యను ఇంకా జఠిలంచేస్తూ వింతపోకడలకు దారితీయడానికి ఈ నూతనచట్టం ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే చట్టంపట్ల పరిజ్ఞానం, భూస్వాములకు ఎలాంటి ఇబ్బందిలేదు .కానీ రెండు మూడు ఎకరాలలోపు భూమి కలిగిన నిరుపేదలకు, కష్టాన్ని నమ్ముకోని పనిచేసుకునేవారికి, పనికెళ్ళకుండా ఇంకాస్త ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తుందని చెప్పడంలో నిజం లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలలో పెద్దవారిలో జరిగే విషయాలను పరిగణలోకి తీసుకోని, వారి సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపించి, సమస్యలు జఠిలమవ్వకుండా, ఆస్థి, ప్రాణ నష్టాలకు తావివ్వకుండా ఆదుకునే ప్రయత్నాలలో భాగంగా ప్రకటన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

గ్రామాలలో స్వార్ధపూరిత రాజకీయాలు చేసే మహానాయకులు ఏమీ తెలియని పేదలమధ్య చిచ్చుబెడుతూ , కాలం వెళ్ళదీసే రాజకీయాలు మాని, వీలైతే సానుకూలంగా పరిష్కారమార్గానికి పూనుకోవడానికి ప్రయత్నించాలి.అలాగే భూతగాదాలున్న వారు సైతం మానవతాదృక్పదంతో ఒకరినొకరు కూర్చోని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అంతేగానీ పెడ్తానుషులని, కేసులని, కోర్టులని భయలుదేరితే అసలుకే ఎసరు వస్తుంది . గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ప్రభుత్వాలు ప్రజల క్షేమం , సంక్షేమం కోసం చేపట్టే చట్టాలు ఒక్కసారీ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకోని , నిర్దిష్టమైన లక్ష్యాలతో ప్రజామోదంగా , ఆచరణలో ఉపయోగకరమైన చట్టాలను తీసుకరావడానికి ప్రయత్నించాలి.అంతేగానీ ఏడాదికేడాది ఒకే విషయానికి సంబంధించిన చట్టాలను తెస్తూ , ప్రజలను భయాందోళనలకు గురిచేయకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ప్రతిపక్షాలు సైతం చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకోని పూర్తిగా ఆ చట్టాన్ని తప్పుబడుతూ , ప్రజలను గందరగోళానికి దారితీయకుండా మంచిని మంచి అని , చెడును చెడు అని చెబుతూ ప్రజలకు విషయం పట్ల పరిజ్ఞానం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కావున ఆ బాటలో పయనించాలి . అలాగే సమాజంలో నెలకొన్న వివిధ వ్యాపార సంస్థలు కూడా ప్రతి విషయాన్నీ ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించకుండా సామాన్య , పేద ప్రజలకు సేవాదృక్పధంతో ఆలోచించే భావనను అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి . అలాంటి సమాజం కోసం ప్రతిఒక్కరు పూనుకోని పనిచేయాలని ఆశిద్దాం.

polam saidhulu
డా. పోలం సైదులు ముదిరాజ్‌,
9441930361.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply