- పథకం ప్రాకారం గులాబీ నేతల ఆక్రమణలు
- ప్రగతిభవన్ వేదికగా పెద్ద ఎత్తున భూదందాలు
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు
ధరణి పోర్టల్ తెచ్చింది ప్రజల కోసం కాదని..గులాబీ లీడర్ల భూ దందా కోసమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ వచ్చాక కొత్త భూ సమస్యలు పుట్టుకుని వచ్చాయన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం భూములు కాజేసే పక్రియ అని మండిపడ్డారు. లక్షలాది మంది రైతులు ధరణి పోర్టల్ తో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. న్యాయం కోసం రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ధరణితో దళారులు రెచ్చిపోతున్నారని.. దీనిని అడ్డంపెట్టుకుని బీఆర్‌ఎస్ లీడర్లు పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు.ధరణి పోర్టల్ తో ల్యాండ్ వివాదాలు పెరిగాయని అన్నారు. ధరణి పోర్టల్ లో పలు క్యాటగిరిల కింద వచ్చిన దాదాపు 10 లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. పాస్ పుస్తకాల్లో నమోదైన తప్పులను సరిదిద్దు కోవడానికి ధరణిలో ఎలాంటి ఆప్షన్ లేదని విమర్శించారు. ధరణిలో నిముషాల్లోనే మ్యూటేషన్ జరుగుతుందని.. పారదర్శకంగా ఉంటుందని అవినీతి ఉండదని సీఎం చెప్పిండు కానీ క్షేత్రస్థాయిలో దానికి విరుద్ధంగా ఉందన్నారు.
న్యాయబద్దమైన ల్యాండ్ ను రాత్రికి రాత్రే ప్రొహిబిటరీ ల్యాండ్ గా రికార్డ్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోందని.. ప్రగతి భవన్ కేంద్రంగా సెటిల్ మెంట్ జరుగుతోందని ఆరోపించారు. ధరణి ముసుగులో బీఆర్‌ఎస్ లీడర్లు భూ దందాకు పాల్పడుతున్నారని విమర్శించారు. ధరణి భూ సమస్యల పరిష్కారం కోసమని ప్రభుత్వం చెప్పింది కానీ.. గులాబీ నాయకుల కోసమని తేలిపోయిందన్నారు కిషన్ రెడ్డి. ప్రజల భూములను ధరణి పేరుతో మధ్య దళారులు, పాలక పార్టీ నాయకులు కొట్టేస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. బ్రోకర్లను పెంచి పోషించడానికే ధరణి పోర్టల్ అని కోర్టులు కూడా చెప్పాయన్నారు. ధరణిలో సమ్యలు లేకుంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా? ఆ రిపోర్టులో ఏ ముందో బయటపెట్టాలన్నారు. అసలు ధరణిలో భూ సమస్యలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో… ఎన్ని పరిష్కరించారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.