Take a fresh look at your lifestyle.

లైంగిక నేరాల అదుపునకు కొత్త మార్గదర్శకాలు

నిర్భయ్‌ ‌చట్టం అమలులో ఉన్నా ఆడపిల్లలపై అత్యాచారాలు  హద్దు, అదుపు లేకుండా జరుగుతున్న దృష్ట్యా, ఇందుకు సంబంధించిన కేసుల్లో   రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయడం మంచి పరిణామం. ఇలాంటి మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్నా రాజకీయ వొత్తిడులు, పలుకుబడి వర్గాల వొత్తిడుల కారణంగా అధికారులు పాటించలేదు. ఇప్పుడైనా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేట్టు కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇలాంటి కేసుల్లో రాష్ట్రాల పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక యువతిపై  అగ్రవర్ణాల యువకులు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను శారీరకంగా హింసించారు. ఈ ఘటనలో వాస్తవాలు బయటకు రాకుండా చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయలేదు. అత్యాచార కేసులను నీరు గార్చకుండా  కేంద్రం పంపిన మార్గదర్శకాల ప్రకారం 60 రోజుల్లో  దర్యాప్తు పూర్తి చేయాలని కూడా కేంద్ర హోం శాఖ ఆదేశించింది. నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలనీ, అలా చేయకపోతే  సంబంధిత పోలీసు అధికారి బాధ్యులని కేంద్రం పేర్కొంది. అలాగే, నేరం జరిగిన ప్రదేశం తమ పరిధి వెలుపలదైతే జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌గురించి కేంద్రం గతంలోనూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, పని వొత్తిళ్ళు,  రాజకీయ వొత్తిళ్ల కారణంగా తమ పరిధిలోని కాదంటూ పోలీసులు తప్పించుకుంటున్నారు.

లైంగిక దాడి గురించి ఫిర్యాదు అందిన 24 గంటల్లో   బాధితురాలికి వైద్య సహాయం అందజేయడం, ఆమె వాంగ్మూలాన్ని నమోదం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆదేశించింది. వాంగ్మూలాలను తీసుకుంటున్నా, పోలీసులు కేసు దర్యాప్తులో వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు లేదు. ఆడియో రికార్డింగ్‌లో సక్రమంగా నమోదు కాలేదన్న సాకుతో వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. న్యాయవాది సమక్షంలో నమోదు చేయనప్పటికీ, బాధితురాలి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఇలాంటి కేసులలో దర్యాప్తునకు తోడ్పడేందుకు కేంద్రం ఇన్వెస్టిగేషన్‌ ‌ట్రాకింగ్‌ ‌సిస్టమ్‌ ‌ఫర్‌ ‌సెక్సువల్‌ అఫెన్సెస్‌ అనే పోర్టల్‌ను  అందుబాటులోకి తెచ్చింది. దానిని దర్యాప్తు అధికారులు ఉపయోగించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.

నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డస్‌ ‌బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో గత ఏడాది రోజుకు 88 అత్యాచారాల కేసులు నమోదు అయ్యాయి. అయితే, అన్నింటిలో అత్యధికంగా రాజస్థాన్‌లో ఆరువేల కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లో 3వేలు నమోదు అయ్యాయి. అత్యాచారానికి గురైన మహిళలు  కుటుంబ గౌరవం, ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతారు. అలా వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి పోలీసులు వొత్తిళ్ళ కారణంగా వెనకాడతారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలపై జరిగే లైంగిక దాడులను నివారించేందుకు నేరస్తుల కదలికలను  నమోదు  చేయడానికి షీ టీమ్స్‌కు చిన్న కెమెరాలను అందిస్తోంది. ముఖ్యంగా బస్‌ ‌స్టాపులు, సినిమా థియేటర్లు, పార్కుల వంటి పబ్లిక్‌ ‌ప్రదేశాల్లో   నేరస్తులు, అనుమానితుల కదలికలను  ఈ కెమెరాల్లో చిత్రీకరిస్తారు. ఇలా తీసిన ఫిలింలు దర్యాప్తులో ఎంతో ఉపయోగ పడుతున్నాయి. హైదరాబాద్‌లో పని చేస్తున్న షీ టీమ్స్ ‌దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్‌ అసెల్ట్  ఎవిడెన్స్ ‌కలక్షన్‌ ‌కిట్స్ ‌ను ఉపయోగించాలి. ఆడపిల్లలను లైంగికంగానే కాకుండా మానసికంగా వేధిస్తున్న మృగాళ్లపై సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయాలి,  తమిళనాడులో తాజాగా విరుంధర్‌ ‌నగర్‌లో ఒక యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించడమే కాకుండా, వాట్స్ అప్‌లో ఫోటోలు పంపి ఆ యువతి వివాహం ఆపేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇలాంటి ఘటనలు లెక్కకు రానివి ఎన్నో ఉన్నాయి. చట్టాల పట్ల గౌరవం, భయం లేకపోవడం వల్లనే మృగాళ్ళు బరితెగిస్తున్నారు. అందుకే, ఇలాంటి కేసుల దర్యాప్తు తొందరగా ముగించి న్యాయస్థానాల్లో   చార్జిషీట్‌ ‌దాఖలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కేసుల విచారణకు ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులు పని చేస్తున్నా, పెరుగుతున్న కేసులతో వాటికి కూడా తలకుమించిన భారంగా పరిస్థితి తయారవుతోంది. లైంగిక నేరాలను ఆపేందుకు సమాజంలో పెను మార్పు రావాలి. ప్రతి తండ్రి తమకు కూడా ఆడపిల్ల  ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుని మగ పిల్లల వైఖరులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.

మహిళా సంఘాలు ఇప్పటికే లైంగిక నేరాలకు ఉద్యమాలను నిర్వహిస్తున్నాయి. మరింత ఎక్కువ చైతన్యం సమాజంలో వచ్చినప్పుడు నేరాలు అదుపులోకి వస్తాయి. ఆడపిల్లల పట్ల యువకుల, మగవారి దృక్పథంలో మార్పు రావాలి. వారిని మగవారితో సమానంగా చూసిన నాడు మాత్రమే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఆకతాయిగా వ్యవహరించేవారు మనవారా, పరాయి వారా అనే భేద భావం లేకుండా, అల్లరి చేష్టలకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడేట్టు చూసిన నాడే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌ ‌వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో నేరాలు అధికం అనేవారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ జాడ్యం ఎక్కువగా ఉంది. సామాజిక మాధ్యమాల ప్రభావం ఇందుకు ప్రధాన కారణమన్న విశ్లేషకుల అభిప్రాయాన్ని తోసివేయలేం. అందరిలోనూ మార్పు వస్తేనే లైంగిక నేరాల అదుపు సాధ్యం.

Leave a Reply