- మరిన్ని అవకాశాలు, హక్కులు కల్పించేందుకే..
- కొరోనా దేశానికి కొత్త పాఠాలను నేర్పింది
- సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నాం…భారత్ వెనకడుగు వేయదు
- ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం
రైతులకు మేలు చేసేందుకే సాగు చట్టాలను తీసుకుని వొచ్చామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కొత్త సాగు చట్టాలు రూపకల్పన చేయకముందు ఉన్న హక్కులు, సదుపాయాలను తగ్గించలేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన సాగు సంస్కరణలు.. రైతులకు కొత్త అవకాశాలను, హక్కులను కల్పించినట్లు రామ్నాథ్ చెప్పారు. చిన్న, మధ్యతరహా రైతుల శ్రేయస్సు కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, రైతులకు తమ అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు 1,13000 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంట్ బ్జడెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
కోవిడ్ సంబంధిత నిబంధనలతో ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు 18 రాజకీయ పార్టీలు ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కొరోనా సంక్షోభ సమయంలో ఉభయ సభల సమావేశాలు కీలకమైనవని రామ్నాథ్ అన్నారు. ఇది కొత్త సంవత్సరం అని, కొత్త దశాబ్దం అని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల కావొస్తోందన్నారు. ఎటువంటి సవాళ్లు ఎదురైనా.. భారత్ వెనకడుగు వేయదని నిరూపించినట్లు రాష్ట్రపతి తెలిపారు. అన్ని అవరోధాలను భారత్ ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు. కొరోనాపై పోరాటంలో ఎంతో మంది పౌరులను కోల్పోయామన్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా సంక్షోభ సమయంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కోవిడ్ వేళ ఆరు మంది ఎంపీలు మరణించినట్లు వెల్లడించారు. వారందరికీ నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయాల వల్ల మహమ్మారిని నివారించినట్లు చెప్పారు. పేద ప్రజలకు కూడా మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నట్లు వెల్లడించారు. స్వయం సమృద్ధి చాలా అవసరం అన్న విషయాన్ని కోవిడ్ నేర్పిందన్నారు. 1.5 కోట్ల మందికి ఉచిత ఆరోగ్యసేవలు అందినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో జరుగుతున్నట్లు చెప్పారు.