Take a fresh look at your lifestyle.

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కొత్త కేసులు

  • సగానికి పైగా కేసులు కేరళ, మహారాష్ట్రలలోనే
  • కేరళలో శని, ఆదివారాల్లో లాక్‌డౌన్‌
  • ‌కన్వర్‌ ‌యాత్రకు యూపి ప్రభుత్వం అనుమతిపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం.. సుమోటోగా కేసు.. యూపికి నోటీసులు

కొరోనా థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికలు వొస్తున్న వేళ దేశంలో కొత్త కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్‌ ‌పాజిటివ్‌గా తేలింది. సోమవారం నమోదయిన కేసుల కంటే కొత్త కేసుల్లో 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3.09కోట్లకు చేరాయి. 24 గంటల్లో మరో 624 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు కొరోనా కారణంగా మొత్తంగా 4,11,408 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 4,29,946 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గింది. తాజాగా 41వేల మంది వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు.

మొత్తం రికవరీలు 3,01,04,720 అంటే 97.28 శాతానికి చేరాయి. ఇక మంగళవారం 37.14 లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసులు 38.76 కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్రదే సగానికి పైగా వాటా ఉంది. ఈ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ ‌వైపు మొగ్గుచూపింది. జులై 17, 18న పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ‌విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేరళలో 14వేలకు పైగా కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య ఏడువేలకు పైనే ఉంది.

కన్వర్‌ ‌యాత్రకు యూపి ప్రభుత్వం అనుమతిపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం..సుమోటోగా కేసు..యూపికి నోటీసులు
కొరోనా థర్డ్ ‌వేవ్‌ ‌ముప్పు పొంచి ఉందన్న భయాందోళనల మధ్య ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం ‘కన్వర్‌ ‌యాత్ర’కు అనుమతి ఇవ్వడంపై సుప్రీమ్‌ ‌కోర్టు అసహనం వ్యక్తం చేసింది. యాత్రకు అనుమతిస్తూ యోగి సర్కార్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. యాత్రకు ఎందుకు అనుమతించారో చెప్పాలని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ ‌నారిమన్‌ ‌సారథ్యంలోని ధర్మాసనం యూపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. కోవిడ్‌ ‌థర్డ్ ‌వేవ్‌ ‌ముప్పు పొంచి ఉందంటూ వివిధ వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమయినప్పటికీ ఈనెల 25 నుంచి ‘కన్వర్‌’ ‌యాత్ర ప్రారంభించేందుకు యోగి ప్రభుత్వం బుధవారంనాడు అనుమతి ఇచ్చింది.

ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా ‘కన్వర్‌ ‌యాత్ర’ను రద్దు చేసింది. కాంవడ్‌ ‌యాత్ర అనేది సనాతన సంప్రదాయంలో ఒక భాగమైనప్పటికీ, కోవిడ్‌ ‌మహమ్మారి సమయంలో విలువైన ప్రాణాలను కాపాడటం అత్యంత ముఖ్యమని ఉత్తరాఖండ్‌ ‌ముఖ్యమంత్రి పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం కన్వర్‌ ‌యాత్రను రద్దు చేసినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ యాత్ర కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తాపత్రికల్లో చదివామని, దీనిపై సంబంధిత ప్రభుత్వాల వైఖరిని తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని, ప్రజలను కలవరపెడుతున్న అంశం కావడంతో వారిలో అయోమయం నెలకొందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోవిడ్‌పై పోరాటంలో ఏమాత్రం మనం రాజీ పడకూడదని ప్రధాని మోదీ ఇప్పటికే వ్యాఖ్యానించడాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. జూలై 24న యాత్ర మొదలు కానున్నందున సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి నోటీసులు పంపుతున్నామని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా స్పందన తెలియజేస్తే వచ్చే శుక్రవారం విచారణ జరుపుతామని బెంచ్‌ ‌స్పష్టం చేసింది.

Leave a Reply