Take a fresh look at your lifestyle.

దేశంలో 30 వేలకు తగ్గిన కొత్త కొరోనా కేసులు

తగ్గుతున్న పాజిటివిటీ రేటు

దేశంలో కొరోనా కేసులు కాస్త తగ్గాయి. నిన్న మొన్నటి వరకు 40 వేలకుపైగా నమోదైన కేసులు తాజాగా 30 వేలకు చేరువకు దిగివచ్చాయి. 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,549 కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,887 మంది బాధితులు కోలుకోగా.. మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,17,26,507కు పెరిగింది. ఇప్పటి వరకు 3,08,96,354 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ‌బారినపడి మొత్తం 4,25,195 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్‌ ‌కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో మొత్తం 47,85,44,114 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలావుంటే కర్నాటక రాష్ట్రంలో మూడోవిడత కోవిడ్‌ ‌నియంత్రించేందుకు ఆంక్షలు తప్పనిసరి అని 2శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు కలిగిన జిల్లాలపై నిఘా పెట్టాలని టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ ప్రభుత్వానికి సూచించింది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న మేరకు ప్రత్యేకంగా సమావేశమై నివేదిక రూపంలో సర్కార్‌కు సూచించింది.

కేరళ, మహారాష్ట్రల నుంచి కర్ణాటకకు వొచ్చేవారు 2డోసుల టీకా వేసుకున్నా ఆర్‌టీపీసీఆర్‌ ‌నెగటివ్‌ ‌రిపోర్టు తప్పనిసరి చేయాలని సూచించింది. 2శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు కల్గిన జిల్లాలపై నిఘా పెట్టాలని ఆదేశించింది. వాణిజ్య వ్యవహారాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6వరకు మాత్రమే వెసలు బాటు కల్పించాలని, నైట్‌ ‌కర్ఫ్యూ కొనసాగించాలని సూచించింది. రాత్రి 7గంటలనుంచి ఉదయం 6దాకా నిబంధనలు వర్తింప చేయాలని సలహా ఇచ్చింది. వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా అమలులో ఉండాలని, అన్ని కార్యాలయాలలోనూ 50శాతం సిబ్బందికి మాత్రమే పని కల్పించాలని, వర్క్ ‌ఫ్రం హోంకు ప్రోత్సహించాలని సూచించింది. కోవిడ్‌ ‌మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. మాస్క్, ‌భౌతికదూరం, చేతులు శుభ్రం చేసుకోవడం విధిగా పాటించాలన్నారు.

Leave a Reply